Wednesday, June 29

దీపారాధన

  • దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
  • వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.
  • కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి.
  • కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.
  • దీపారాధన చేసేముందు దేవుడి ముందు పెట్టే కుందుల్లో నూనె, 2 వత్తులు వేసుకొని ఉంచుకోవాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో ( హారతి ఇచ్చే వస్తువు) కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధనని చేయాలి. అగరొత్తులు, ఏకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు దీపారాధన నుండి వెలిగించకూడదు.
  • దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.
  • ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు.
  • అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
  • దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మి కి , నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతి కి ముఖ్యము. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తి కి చాలా ముఖ్యము.
  • ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏదో ఒక తైలము శ్రేష్ఠము. ఎట్టి పరిస్ధితులలో శనగనూనె వాడరాదు.
నెయ్యి --------మహాలక్ష్మి కటాక్షం (ఆవు నెయ్యి, విప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.)
ఆముదం ------కష్టాలు తొలుగుట, ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు పొందుతారు
నువ్వులనూనె ------ మద్యమం(దుష్ట శక్తి , శతృ బాధలు తొలుగుతాయి)

దీపం కొండెక్కింది అనాలి. దీపారాధన పూర్తయింది, ఆరిపోయింది అని అనకూడదు.
తెల్లవారుఝామునే లేచి స్నానాదులు ముగించుకొని దైవారాధన చేయాలి. తెల్లారి 5 గంటల లోపు స్నానం చేస్తే దానిని బుషిస్నానం, 5-6 గంటల వేళ స్నానం చేస్తే దైవస్నానం, 6-7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. (ఇప్పుడు మిట్టమధ్యాహ్నం వరకు స్నానాదులు చేయకుండా మిగిలిన పనులు పూర్తిచేస్తున్నారు. అది ఇంటికి, మనకి కూడా మంచిది కాదు.)

Wednesday, June 22

శ్రీలక్ష్మీదేవి

క్షీరసాగర మధన సందర్భంలో హాలాహలం పుట్టడం, దానిని పరమశివుడు సేవించి నీలకంఠుడు కావడం జరిగింది. అది మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. ఆ రోజు శివరాత్రి అయినది. ఐరావతం, కౌస్థుభం, పారిజాతం, అప్సరసలు ఇవన్నీ జన్మించాక, ఫాల్గునశుద్ధపూర్ణిమ - ఉత్తరాఫల్గునీ నక్షత్రం ఉన్న శుభదినాన శ్రీలక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు. ఈరోజు లక్ష్మీదేవి ఆవిర్భావమే కాక లక్ష్మీనారాయణుల పాణిగ్రహణ మహోత్సవము జరిగిన మహత్తరమైన రోజు. ఫాల్గున మాసానికి "తపస్యమాసం" అని పేరు. అంటే తపస్సునందు యోగ్యమైనది అని అర్ధము.

లక్ష్మీ తత్వం :
అందరూ సిరిసంపదలు కోరుతూంటారు. అవి కోరగానే వచ్చేవి కావు. అవి వరింప దగిన వారినే వరించి వస్తాయి. అంటే వాటికై మనం కొన్ని అర్హతలు కల్గిఉండాలి. లక్ష్మీ అంటే ధనం ఒక్కటే కాదు, 8 విధాలైన కోరికలను లక్ష్ములుగానే వ్యవహరిస్తున్నాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గృహలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, మోక్షలక్ష్మి.
లక్ష్మీదేవి ఎక్కడ ఉండదంటే :
"యత్ర నాస్తి హరేఃపూజా, తదీయ గుణకీర్తనం
నోత్యుకశ్య ప్రశంసాయం నయామి తస్యమందిరం"
శ్రీహరి యొక్క పూజ, కీర్తన, ఉత్సుకత లేని వారి ఇంట నేను ప్రవేశించను అని లక్ష్మిదేవియే స్వయముగా చెప్పినది.మిట్టమధ్యాహ్నం దాక నిద్ర పోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం. గురువులను, తల్లితండ్రులను దూషించడం, దూషణలు చేసేవారి ఇంట లక్ష్మీదేవి ఉండదు.

"సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ"
సంపద కలుగునపుడు కొబ్బరి కాయలోనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజు మాయమగు విధముననే మాయమయిపోవును. చిత్తశుద్ది ఉన్నచోటనే విత్తశుద్ది ఉంటుంది.
లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కవిధానంలో ప్రకటితమైనది. (1) స్వాయంభువ మన్వంతరంలో దైత్య గర్భంలో బృగుమహర్షికి కూతురైనది. అప్పుడు అమ్మవారి పేరు "భార్గవి". ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత అయిన సన్నివేశం. (2) స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి అవతరించింది. (3) ఔత్తమ మన్వంతరంలో జలరాశినుండి (4) తామస మన్వంతరంలో భూమినుండి (5) రైవత మన్వంతరంలో బిల్వవృక్షము నుండి (6) చాక్షుష మన్వంతరంలో సహస్రదళపద్మం నుండి (7) వైవస్వత మన్వంతరంలో (ఇప్పుడు జరుగుతున్న మనువు కాలంలో) ఇంద్రునికి దుర్వాశుని శాపం కారణంగా, నశించిన సంపదలను అనుగ్రహిస్తూ, మహర్షుల ప్రార్ధనతో క్షీరాసాగర మధనంలో ఆవిర్భవించింది. ఫాల్గున చతుర్దశితో కూడిన పూర్ణిమ - ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో జరిగింది కావున ఆ రోజునే శ్రీలక్ష్మీ జయంతిగా జరుపుకొంటాము.
శ - ఆనందం, ర - తేజస్సు, ఈ - లక్ష్మి, కనుకనే ఆనందతేజస్సులు అమ్మరూపం. లక్ష్మీదేవియే స్వాహా రూపంతో దేవతలకు "హవ్యాన్ని", స్వధా రూపంతో పిత్రుదేవతలకు "కవ్యాన్ని" (పితృదేవతలకియ్యదగిన అన్నము) చేరుస్తుంది.
లక్ష్మీ స్థానాలు :
కన్యలు, ముత్తైదువులు, ఆభరణాలు, పసుపు, కుంకుమ, గోశాల, పర్వతాలు, చదువు, నదులు, సరోవరాలు, మంచిమాటలు, వికసించిన పద్మాలు ఇలా వస్తురూపేనా, స్థలరూపేనా, వ్యక్తిరూపేనా అమ్మవారు మనతోనే ఉంటారు. "ఆశ, శ్రద్ధ, ధృతి, కాంతి, విజయం, వినయం, సహనం" అనేవి సప్తశ్రీలు. ఈ సప్తశ్రీలను ముందుండి నడిపించేది "పురోగా" అనే లక్ష్మి. కనుక అష్టశ్రీలు మనలో స్థిరంగా ఉండాలంటే శ్రీదేవిని ఉపాసిస్తూ, సత్యధర్మాలని పాటిస్తూండాలి.
లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీసూక్తంలో 15 ఋక్కులు ఉన్నాయి. శ్రీసూక్తం దేవి మూర్తులన్నింటికీ ప్రతీక. దీనిలోని ఒక్కోమంత్రం ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. నియమానుసారం జపించి హోమం చేయడంద్వారా ఫలితాన్ని పొందవచ్చు అని పెద్దల సారాంశం. అవి (1) దారిద్ర్యనాశం (2) దుఖఃనాశం (3) కష్టహరణం (4) అన్నమవస్త్రసమృద్ధి (5) సుఖసంసార జీవనం (6) సౌభాగ్యం (7) ధనప్రాప్తి (8) ఉన్నతాధికార ప్రాప్తి (9) భాగ్యం (10) భోగం (11) ఆనందం (12) వంశవృద్ధి (13) దేవి దర్శనానుగ్రహం (14) ముఖ్తి (15) భోగమోక్షరూపమైన జీవన్ముక్తి.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో "మంచి" అనేది ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏదైనా అది లక్ష్మీ అమ్మవారి స్వరూపమే.

Wednesday, June 15

శ్రీ దుర్గాస్తోత్రం

విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీం

యశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం

కంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీం

వాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాం
దివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీం

భారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాం
తా న్వై తారయతే పాపా - త్పంకేగా మివ దుర్బలాం

స్తోతుం ప్రచక్రమే భూయో - వివిధైః స్తోత్రసంభవైః
ఆమంట్ర్య దర్శనాకాంక్షీ - రాజా దేవీం సహానుజః

నమోస్తు వరదే కృష్ణే - కుమారి బ్రహ్మచారిణి!
బాలార్కసదృశాకారే - పూర్ణచంద్రనిభాననే

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపంఛవలయే కేయూరాంగదధారిణి

భాసి దేవి యథా పద్మా - నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ - విశదం తవ ఖేచరి

కృష్ణచ్ఛవిసమా కృష్ణా - సంకర్షణసమాననా
బిభ్రతీ విపులై బాహూ - శక్రధ్వజసముచ్ఛ్రయౌ

పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధను ర్మహాచక్రం వివిధా న్యాయుధాని చ

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం - కర్ణాభ్యాం చ విభూషితాః!
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే

ముకుటేన విచిత్రేణ - కేశబంధేన శోభినా
భుజంగాభోగవాసేన - శ్రోణీసూత్రేణ రాజతా

భ్రాజసే చావబద్ధేన - భోగేనే వేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానా - ముచ్ఛ్రి తేన విరాజసే

కౌమారం వ్రత మాస్థాయ - త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి - త్రిదశైః పూజ్యసే పి చ

త్రైలోక్యరక్షణార్థాయ - మహిషాసురనాశిని
ప్రసన్నా మే సుర జ్యేష్ఠే - దయాం కురు శివా భవ

జయా త్వం విజయా చైవ - సంగ్రామే చ జయప్రదా
మమా పి విజయం దేహి - వరదా త్వం చ సాంప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే - తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి - సీధుమాంసపశుప్రియే

కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ - పుత్రతో ధనతో పి వా

దుర్గా త్తారయస్తే దుర్గే త త్త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారే ష్వవసన్నానాం - మగ్నానాం చ మహార్ణవే

దస్యుభి ర్వా నిరుద్ధానాం - త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారే ష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి శ్శ్రీర్ ధృతి స్సిద్ధిః - హ్రీ ర్వి ద్యా సంతతి ర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా - జ్యోత్స్నాకాంతిః క్షమా దయా
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సో హం రాజ్యా త్పరిభ్రష్టః - శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణత శ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి - సత్యే సత్యా భవస్వ నః

శరణం భవమే దుర్గే - శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ - దర్శయామాస పాండవం

ఉపగమ్య తు రాజాన - మిదం వచన మబ్రవీత్
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో

భవిష్య త్యచిరా దేవ - సంగ్రామే విజయ స్తవ
మమ ప్రసాదా న్నిర్జిత్య హ్త్వా కౌరవవాహినీం

రాజ్యం నిష్కంటకం కృత్వా - భోక్ష్యసే మేదినీం పునః
భాత్రృభి స్సహితో రాజన్ - ప్రీతిం ప్రాప్స్యసి పుష్కాలాం

మత్ప్రసాదా చ్ఛ తే సౌఖ్య - మారోగ్యం చ భవిష్యతి
యే చ సంకీర్తయిష్యంతి - లోకే విగతకల్మషాః

తేషాం తుష్టా ప్రదాస్యామి - రాజ్య మాయు ర్వపు స్సుతం
ప్రవాసే నగరే చాపి - సంగ్రామే శత్రుసంకటే

అటవ్యాం దుర్గకాంతారే - గహనే జలధౌ గిరౌ
యే స్మరిష్యంతి మాం రాజన్ య థాహం భవతా స్మృతా

న తేషాం దుర్లభం కించి - దస్మిన్ లోకే భవిష్యతి
య ఇదం పరమ స్తోత్రం - శృణుయా ద్వా పఠేత వా

తస్య సర్వాణి కార్యాణి - సిద్ధిం యాస్యంతి పాండవాః
మత్ప్రసాదా చ్చ వ స్సర్వాన్ - విరాటనగరే స్థితాన్

న ప్రఙ్ఞాస్యంతి కురవో - నరా వా తన్నివాసినః
ఇత్యుక్త్వా వరదా దేవీ - యుధిష్ఠిర మరిందమం
రక్షాం కృత్వా చ పాండూనాం - తత్రై వాంతరధీయత

రాహుకాల పూజ

రాహుకాలం అనగానే, ఆ సమయంలో ఎదైన పని మీద బైల్దేరటంగాని, కొత్తగా ఎదైన పనిని మొదలెట్టడం గాని చెయ్యొద్దు అని మన ఇళ్ళలో అంటూంటారు. కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పెట్టే నైవెద్యం పసుపు రంగులో ఉండాలి అని కొందరు చెప్పారు, నేను ఒక గుడిలో చూసా కూడా. పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టారు ఆ గుడిలో పూజరి గారు. ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడ్తారు. ఇది కూడా చాలా మంచిది.

రాహుకాల సమయం :
సోమవారం - ఉ 7:30 -9:00
మంగళవారం - మ 3:00 -4:30
బుధవారం - మ 12.00 - 1:30
గురువారం - మ 1:30 - 3:00
శుక్రవారం - ఉ 10:30 - 12:00
శనివారం - ఉ 9:00 - 10:30
ఆదివారం - సా 4:30 - 6:00

Tuesday, June 7

బ్రహ్మోత్సవాలు (3)


బ్రహ్మోత్సవాలలో ఉభయ దేవేరులతో కూడిన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ దేవాదిదేవుడిని అన్నమాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు.

తిరువీధుల మెరసీ, దేవదేవుడు
గరిమలమించిన సింగారముల తోడను ||

తిరుదండెలపై నేగీ దేవుడిదే తొలునాడు
సిరులు రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరి నాలుగోనాడు పువ్వుగోవిలలోన ||

గక్కున నయిదవనాడు గరుడుని మీదను
యెక్కెను ఆరవనాడు యేనుగు మీదను
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుఱ్ఱ మెనిమిదోనాడు ||

కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీ వేంకటేశుడింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీదను.

అంటూ ఎంతో మధురంగా వర్ణించాడు. ఒక్కసారి ఐనా బ్రహ్మోత్సవ సమయంలో ఆ వెంకన్నను దర్శనం చేసుకొవాలి.

ఏడుకొండలవాడా , వెంకటరమణా గోవిందా..గోవిందా..

Monday, June 6

బ్రహ్మోత్సవాలు (2)

ప్రస్తుతం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం, తిరుమలలో జరుగు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9రోజులపాటు అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. ఈ 9 రోజులు ముల్లోకాలలోని దేవతలూ, దివ్య శరీరాలతో మహర్షులూ తిరుమలలోనే ఉంటారు. తిరుమల "గోవిందా, గోవిందా "అంటూ ఆ నారాయణుడి నామస్మరణతో మారుమ్రోగిపోతూంటుంది. సర్వసేనాధిపతి విష్వక్సేనుల వారికి తిరువీధులలో వైభవంగా ఊరేగింపు నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. విష్వక్సేనుల వారిని పల్లకీలో కూర్చొండబెట్టి, ఉత్సవాలకు బ్రహ్మాది దేవతలకు ఆహ్వానించడానికై, తిరుమల మాడ వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున రాత్రి పెద శేషవాహనం. శ్రీవారికి ఆదిశేషుడు అత్యంత ప్రియభక్తుడు.ఆదిశేషునికి ఉన్నంత కైంకర్యనిరతి మరెవరికి లేదు. ఆదిశేషుడే స్వయముగా శేషాద్రిగా వెలసి స్వామివారిని తన శిరస్సుపై సర్వవేళలా ఉంచుకుంటూ జగత్ కళ్యానానికి తోడ్పడుతున్నడు. అంతటి ప్రియభక్తుడైన ఆదిశేషుని పై మాడవీధులలో ఊరేగి వెళ్ళడం శ్రీవారికి అత్యంత ప్రియం.

Friday, June 3

బ్రహ్మోత్సవాలు (1)


శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనది బ్రహ్మోత్సవం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీమన్నరాయణుడే తిరుమలపై ప్రత్యక్షంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్షమున శ్రవణా నక్షత్రమునందు, చక్రస్నానమును సంకల్పించి 9రోజులముందుగా ధ్వజారోహణము చేస్తారు. తరువాతి 9రోజులు ఆయా నిర్ణీత వాహనములలో శ్రీ స్వామివారికి ఉత్సవములు జరుగును. 3 సంవత్సరాలకు ఒకమారు అధిక మాసము వచ్చినప్పుడు, 2పర్యాయములు బ్రహ్మోత్సవాలు జరుగును. అంటే,కన్యామాసము ఆశ్వయుజ మాసము ఐనప్పుడు ఆశ్వయుజమాసము నందు, విజయదశమినుండి 9 రోజులును, కన్యామాసము భాద్రపద మాసమైనపుదు భాద్రపద, ఆశ్వయుజ మాసములందు 2 బ్రహ్మోత్సవమలు జరుగును. చతుర్ముఖబ్రహ్మ స్వయముగా ఈ బ్రహ్మోత్సవము జరిపించినట్లు వరాహ పురాణము నందు చెప్పబడినది.