Monday, October 31

ద్వాదశజ్యోతిర్లింగాలు (2)

5. వైద్యనాధేశ్వరుడు
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధితపాదపద్మం ష్రీవైద్యనాథం తమహం నమామి ||

బీహార్ రాష్ట్రములోని, బీడ్ జిల్లాకు 26కి.మి దూరాములో, పర్లి అనే గ్రామంలో వైద్యనాధేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గ్రామాన్నే కాంతిపూర్/మధ్యరేఖ వైజయంతి/ జయంతి అని కూడా పిలుస్తారు. కన్యాకుమరి నుండి, ఉజ్జయిని కి ఒక రేఖను గీస్తే, ఈ పర్లి గ్రామం స్పష్టంగా ఆ రేఖపై కనిపిస్తుంది. మేరు/నాగనారయణ పర్వతాల కి దగ్గర్లో ఉంది ఈ గ్రామం. బ్రహ్మ, వేణు, సరస్వతి అనే నదులు ఇక్కడ మనకు కనిపిస్తాయి.

మహా శివ భక్తుడైన రావణుడు, శివ అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు. ఎండనక, వాననక సంవత్సరాలు తరబడి తపస్సు చేసినా ఆ భోళా శంకరుడు అనుగ్రహించలేదు. రావణుడు తన తలను శివునికి అర్పించాడు. ఆ సమయంలో భక్తవ శంకరుడు అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు, దానికి రావణు డు, "నిన్నే నా లంకకు తీసుకొని వెళ్ళి అక్కడ పూజించుకుంటాను, ఆ వరం ప్రసాదించు" అని కోరాడు. దానికి శివుడు, "నేను ప్రసాదించే లింగాన్ని నువ్వు తీసుకొనివెళ్ళు, ఎట్టి పరిస్థితులలో మధ్యలో కింద పెట్టవద్దు" అని హెచ్చరించాడు. శివ ప్రసాదంతో బయలుదేరిన రావణు డు, మర్గమద్యలో నదీ తీరంలో సంధ్యావందనం చేయతలచి, దగ్గర్లో ఓ బాలుడుని పిలిచి, తాను వచ్చేవరకు లింగాన్ని కింద పెట్టవద్దన్ని చెప్పి వెళ్ళాడు. రావణుడు అటు వెళ్ళగానే, ఆ బాలుడు రెండుసార్లు రావణుడిని పిలిచి, అతను రాకపోయేసరికి లింగాన్ని కిందపెట్టేసాడు. ఆ లింగమే వైద్యనాధేశ్వర లింగం. ఆ బాలుడేవరో కాదు, గణాధీశుడు.

ఇంకో కథనం ప్రకారం. సాగరమధనంలో శ్రీమహావిష్ణువు అమృతమును, ధన్వంతరిని శివలింగంలో దాచాడు. ఆ లింగాన్ని తాకిన అసురులు, లింగం నుండి వెలువడే మంటల తాకిడికి తాళలేక పోయారు. అదే శివభక్తులు తసకితే లింగం నుండి అమృతం కురవ సాగింది. అందుకే ఈ లింగానికి వైద్యనాధేశ్వర లింగం/అమృతేశ్వర లింగమని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరు లింగాన్ని త్రాకి భక్తితో పూజించుకుంటారు.

6. భీమశంకరుడు
యం ఢాకినిశాకినికాసమాజె నిషేవ్యమాణం పిషితాషనైష్చ |
సదైవ భీమాదిపదప్రసిద్దం తం షణ్కరం భక్తహితం నమామి

మహారాష్ట్రంలో పూనె పట్టణానికి కొద్ది దూరంలో భీమానది తీరాన సహ్యాద్రి పర్వత శ్రేణిలో డాకినీ అనే అరణ్యంలో భీమశంకరుడు వెలిసాడు. త్రిపురాసురుడి ఆగడాలను అరికట్టడానికి శివుడూ రుద్రావతారుడైనాడు. శివునితో యుద్ధానికి పాల్పడిన త్రిపురాసురుడు, శివునిచే సం హరించబడ్డాడు. యుద్ధం చేసి అలసిన శంకరుడు ఎత్తైన సహ్యాద్రి పర్వతాలపైన విశ్రమించాడు. శివుని శరీరం నుండి స్వేద బిందువుల ధారే చిన్న కొలనుగా ఏర్పడింది. అక్కడనుండే భీమానది ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి.

మరో కథనం ప్రకారం, పూర్వము కామరూప రాజ్యం నందలి "ఢాకినీ" అను ప్రదేశములో భీమాసురుడు అను రాక్షసుడు
ఉండేవాడు. తన తల్లి కోరికపై బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసి, అనేక వరాలు పొంది, దేవేంద్రాదులను జయించాడు. భీమాసురుడు కామరూప రాజ్యముపై దండెత్తి, కామరూప రాజు సురక్షణను, అతని భార్య సురణాదేవిని బంధించెను. సురక్షణ, సురణాదేవి శివ భక్తులైనందున, వారు చెరశాలలో పార్ధివ లింగమును పూజించు చుండిరి. భీమాసురుడు శైవుడైనందు వలన రాజదంపతులను పరమేశ్వరుని సేవింపరాదని శాసించాడు. ఆ రాజదంపతులు భీమాసురునకు భయపడక, పరమేశ్వరుడిని పూజించిరి. భీమాసురుడు రాజ దంపతులను సంహరించుటకు తన కత్తిని ఎత్తాడు. అంతట పరమేశ్వరుడు ఆ మట్టి లింగము నుండి వచ్చి, భీమసురుడును సంహరించెను. రాజ దంపతులు పూజించిన ఆ లింగమును భీమశంకర లింగము అంటారు.

7. రామేశ్వరుడు

తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో రామేశ్వం వుంది. శ్రీరాముడు స్థాపించడంవలన ఇది రామేశ్వరమైంది. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైంది. ఈ క్షేత్ర మహిమను స్కందపురాణం, రామాయణం, రామచరితమానస్, శివపురాణం మొదలగు గ్రంథాలుచె ప్తున్నాయ. లంకపైకి యుద్ధానికి వెళ్లేముందు శ్రీరాముడు ఇక్కడే శివపూజ చేసి ఆశీర్వాదం పొందాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చేటప్పుడు సీతతో కలిసి ఇక్కడ పూజలు నిర్వహించాడు. హనుమంతుడు కైలాసంనుండి తెచ్చిన శివలింగం ఇక్కడే ప్రతిష్టితమైంది. లంకకు వెళ్లే వారధిని విభీషణునికి కోరిక మేరకు శ్రీరాముడు తన ధనస్సుతో ఛిన్నాభిన్నం చేసాడు. ఇదే స్థలంలో "ధనుష్కోటి" తీర్థం ఇప్పుడు జనులను ఆకర్షిస్తోంది. మహా శివరాత్రిలాంటిపర్వదినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. లక్ష్మణశిల, పంచముఖి హనుమాన్, శ్రీరామ-జానకీ మందిరాలు ఇక్కడ నెలవైయున్నాయ. గుడికి దగ్గరలో వున్న సముద్ర ప్రాంతంను అగ్ని తీర్ధము అంటారు. ఇక్కడ స్నానము చేసిన తర్వాతనే గుడికి వెళ్ళాలి. భారతదేశములో నాలుగు మూలల వున్న నాలుగు దామాలలో మొదటిది రామేశ్వరం. మిగతావి ద్వారక, పురీ జగన్నాధ్, బదరీనాధ్.

8. నాగేశ్వరుడు

గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14కి. మీ దూరము) చాలా చిన్న గ్రామం.
దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసరుడు కోపామును పట్టలేక తన చేతిలోని గదచె సుప్రియుని తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరుపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.

ఈ గుడి నిర్మాణ తీరు వర్ణనాతీతం. పాండవకాలంలో చేసిన రాతి కట్టడం. నాలుగు స్థంబాల మీద నిర్మించిన ఈ గుడిలో, నాగేశ్వరుడు గర్భ గుడిలో పూజలందుకుంటాడు. ఇక్కడ చెప్పదగ్గ విశేషం ఎంటి అంటే, నందీశ్వరుడు మనకు శివునికి ఎదురుగా కనిపించడు. ఈ గుడి వెనుక వైపు నందీశ్వరునికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఈ గుడికి చుట్టూరా 12జ్యోతిర్లింగాలను, 12దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.

Sunday, October 30

ద్వాదశజ్యోతిర్లింగాలు (1)

మహాశివుడిని విగ్రహ రూపంలో దేవాలయాలలో పూజించటం బహు అరుదు. మనకు ఆ భోళాశంకరుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. అటువంటి లింగాలలో ద్వాదశజ్యోతిర్లింగాలు అత్యంత ప్రసిద్ధమైనవి. అవి..

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.


1. సోమనాధేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటది "సోమేశ్వర లింగం". ఇది మిక్కిలి ప్రఖ్యాతి చెందిన పురాతనమైన శైవ క్షేత్రం. పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం (సౌరాష్ట్రం) లోని ప్రభాస పట్టణంలో ఈ ఆలయం ఉన్నది. సరస్వతీ నది ఇక్కడ సాగర సంగమం చేస్తుంది. ఈ సాగర సంగమంలోనే చంద్ర భగవానుడు స్నానం చేసి, శివారాధన చేసి, శాప విముక్తి పొందినాడు.
దక్ష ప్రజాపతి కుమార్తెలు నూరుమంది. అందరిలోనూ పెద్ద కుమార్తె "సతీదేవి" శివుని భార్య. మిగిలిన కుమర్తెలలొ 27 మందిని (అశ్విని, భరణి మొదలగు నక్షత్రములు) చంద్రునుకి ఇచ్చి వివాహం చేశాడు. సవతులు అందరిలోనూ చిన్నదగు రేవతి యందు చంద్రునకు మిక్కిలి ప్రేమ యుండుట వలన, మిగిలిన వారు తమ తండ్రికి ఫిర్యాదు చేశారు. అంతట దక్ష ప్రజాపతి చంద్రునకు "క్షయ వ్యాధిని పొందు" అని శాపం ఇచ్చాడు. నారద ముని సలహాతో, చంద్రుడు ప్రభాసమునకు పోయి 40 దినములు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు. అంత పర్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ట చేసి, పూజించిన, నీకు శాపఫలం క్షీణించగలదు. మొదటి 15 దినములు నా వర ప్రభావంబున వృద్ది పొంది, తరువాత 15 దినములు దక్ష ప్రజాపతి శాప ఫలంబున క్షీణించగలవు అని తెలియజేసాడు. చంద్రుడికి సోముడు అనే పేరు ఉంది. సోముడు చేత అర్పించబడిన ఈశ్వరుడు కాబట్టి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ సోమేశ్వరలింగాన్ని పూజించే వారికి సకల పాపములు, క్షయ మొదలగు వ్యాధులు తొలగిపోతాయి

2. శ్రీశైల మల్లికార్జునుడు

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైయిన భ్రమరాంబికాదేవి, ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైల మల్లికార్జునుడు మనకు శ్రీశైలంలో దర్శనమిస్తారు. దక్షిణ భారతదేశాన, ఆంద్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా, కృష్ణానదీ తీరాన నల్లమల కొండల్లో 'శ్రీశైలం' క్షేత్రం ఉంది. ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చాలా విశాలమైంది. కోటగోడల్లాంటి అతి పెద్ద గోడలపై కుడ్యచిత్రాలు తీరి వుంటాయి. స్థంభాలతో సహా వాస్తుశిల్పంలో సంపన్నత, దర్పం తొణికిసలాడుతుంటాయి. విజయనగర రాజులనాటి వాస్తుకళకు ఇది నిదర్శనం.
మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానములు. శివరాత్రినాటి రాత్రి స్వామి వారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి - 360 మూరల గుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టడం / మంగళపాగా అని అంటారు. ఈ వస్త్రాన్ని రోజుకొక మూర చొప్పున 360 రోజులు నేస్తారని చెప్పుకుంటారు. మంగళ పాగా రాత్రి వేళ లింగోద్భవ సమయానికి నేత ముగుస్తుంది. పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడట. తరవాత ఈ మంగళపాగాను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు.
ఇక్కడకు ఇక 3 కి. మీ. దూరంలో కృష్ణా నది ఉత్తార వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అని అంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకు గల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలో వున్న ' లింగాల గట్టు ' వగైరాలను దర్శించుకుని గాని మరలరు.
ఆలయం చుట్టూ ప్రాకారం గోడలు చాల ఎత్తుగాను వివిధ గోపురాల్తో శోభిల్లుతుంటాయి. ప్రాకారనిర్మాణానికి వినియోగించబడిన రాళ్ళు సుమారు 20 అ. వైశాల్యంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు, రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు - భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగా శివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీ చక్రప్రతిష్ట చేశారని ప్రతీతి. చైత్రమాసంలో ' అంబ తిరునాళ్ళ ' అని గొప్ప ఉత్సవం జరుగుతుంది.
వెనుక వైపున భ్రమరాంబికాలయంతో పాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.
"మల్లికార్జునస్వామిని చేతులతో తాకి పునర్జన్మ లేకుండా ముక్తిని పొందవచ్చు". "కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో దైవదర్శనం ముక్తిదాయకాలు".
" శ్రీశైలం యొక్క శిఖర దర్శనమే సమస్త పాపహరణం జన్మరాహిత్య" మని వేదోక్తి .

3. మహాకాళేశ్వరుడు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన " శ్రీ మహాకాళేశ్వర స్వామి " జ్యోతిర్లింగరూపమున దర్శనమిస్తారు.
ఈ ఆలయం మూడు అంతస్తులుండి, ఏడు గోపురాలుండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు, రెండవ అంతస్తులో ఓం కారేశ్వరుడు, మూడ వ అంతస్తులో నాగచంద్రేశ్వరుడు కొలువై వుంటారు. ఈ మూడవ అంతస్తు మాత్రం నాగపంచమి నాడు మాత్రమే తెరిచి పూజాది కాలు చేస్తూవుంటారు. మిగిలిన రోజుల్లో ఈ అంతస్తు మూసివుంటుంది. ఇక ఈ ఆలయంలో 3 అడుగుల వ్యాసంతో 21/2 అడుగుల ఎత్తున్న జ్యోతిర్లింగే శ్వరుడు పశ్చిమ దిక్కుగా ప్రతిష్టితు డయ్యాడు. ఇక్కడ చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది. పూర్వం ఒక సాధువు స్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి అభిషేకించి వెళ్ళిపోయేవాడట. ఆయనని ఎవరూ దర్శించలేకపోయారు. ఇప్పుడుడు మాత్రం ఇక్కడ అగ్నిహోమం లోనున్చి వచ్చిన భస్మంతో స్వామిని అభిషేకిస్తున్నారు. .
ఇక్కడ తాంత్రిక విద్యలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అఘోరకులు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. వీరిని చూడడానికి కొంత భయం కలుగుతుంది. వీరి ఉపాసనా చర్యలు కూడా మనకి భయం పుట్టిస్తాయి.

4. ఓంకారేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది "ఓంకార లింగము". మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇండోర్ కు సుమారు 80కి.మీ దూరంలో "ఓంకారేశ్వర లింగము" ఉంది. దీనినే అమలేశ్వర లింగము అని కూడా అంటారు.
పర్వతములన్నిటి యందు " మేరువు " అను పర్వతము గొప్పది. మేరువు మీద మంగళప్రదుడైన శివమూర్తి ప్రమధగాణాలతో గౌరీ సామేతంగ నివసించియున్నాడు. వింధ్యుడు అనే పర్వత రాజుకు మేరువ రాజుకు ఉన్నంత గొప్పతనము పొందవలెనని సంకల్పముతో, "ఓం నమః శివాయ" మంత్ర జపం చేయుట మిన్నునంట ఎత్తు పెరుగుచుండును. దీనిని చూచిన అగస్త్యముని చేయినడ్డుపెట్టి "వింధ్య రాజా! నేను కైలాసపతితో సంప్రదించి, నీకు ప్రసన్నుడగునట్లుగా చేయుదును. నీవు పెరగక నిలిచియుండు" అని చెప్పెను. అగస్త్య ముని పరమేశ్వరునితో "స్వామీ నీ అనుగ్రహమును సంపాదించుకోరి, వింధ్యా పర్వత రాజు మిన్నునంటగా పెరుగుచున్నాడు, అతని కోరికను ఫలింప జేయుము" అని ప్రార్ధించాడు. శంకరుడు వింధ్యునకు ప్రత్యక్షమై, వింధ్య పర్వతరాజు అభీష్టము అనుసరించి, ఆ పర్వతము పై సువర్ణ రూప లింగముగా వెలిశాడు.

Friday, October 28

నాగులచవితి

మన దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు నాగజాతివాడు, సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనంగా అమరినవాడు, శివుడు నాగాభరణుడు, ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం, మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధపంచమినాడు నాగపంచమి, కార్తీకశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.

ఆశ్లేషనక్షత్రానికి అధిష్టానదేవత సర్పం, నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది.
వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు
పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది.

వృశ్చికరాశిలో జ్యేష్టానక్షత్రం సర్పనక్షత్రం, ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగులచవితి. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వార ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు, కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.

Wednesday, October 26

కార్తీక మాసం

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

కార్తీకమాసంలో నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు
కార్తీకమాసంలో తెల్లవారుజామున తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీకమాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు. తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందనీ, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న ఆదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ వ్రత విధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి, పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవ్వాలి. నక్షత్రాలు ఉండగానే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే వారు కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తూ నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

Sunday, October 23

దీపావళి

సంస్కృతం లో "వళి" అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస.ఆశ్వీయుజ మాసం చివరి ఐదు రోజులు దీపావళి
పండగను జరుపుకుంటాము. దసర పండగ నుండి 20 రోజుల తర్వాత దీపావళి వస్తుంది. స్కందపురాణం లో చెప్పినట్లు, "శుక్లపక్షం లో అష్టమి తిది నుండి 12 రోజుల వరకు (దీపావళి దాక) "మహా శక్తి వ్రతం" చేస్తారు, దీనినే కేధారవ్రతం అంటాము.ఈ రోజున మహాశివుడు "శక్తి"ని (అమ్మవారిని) తన శరీరంలో అర్ధబాగం గా స్వీకరిస్తాడు. ఈ రూపమే "అర్ధనారీశ్వర రూపం". కలశంని 21 పోగులు గల దారం తో అలంకరించి, 21 నైవేద్యంల తో అమ్మవారిని 35 రోజులు పుజిస్తారు. (35 వ రోజు ) చివరిరోజు చేసే వ్రతాన్ని "కేధార గౌరీ వ్రతం" అంటారు. దీపావళి రోజు లక్ష్మి పూజను చేస్తాము.

దీపావళి ఎన్నెన్నో రకాలుగా, మరెన్నో విధాలుగా కూడా తరతరాలుగా ఆచరణలో కనిపిస్తుంది. ఆంధ్రదేశంలోను, దక్షిణభారతదేశం అంతటా ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవటం కనిపిస్తుంది. ఆశ్వయుజ బహుళ చతుర్థశి, అమావాస్య, కార్తీకశుద్ధ పాఢ్యమి ఈ మూడునాళ్ళు ఎంతో పుణ్యప్రదంగా భావించుకుంటూ ఒక వ్రతవిధిని అవలంబిస్తూ ఆచరించటం కనిపిస్తుంది. ఉత్తరాన ఈ పండుగనే ఐదురోజులపాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్థశి, అమావాస్య, కార్తీకశుద్ధ పాఢ్యమి, విదియ. ఈ ఐదురోజులు అక్కడ ఎంతో పర్వదినాలుగా భావిస్తారు. ధనత్రయోదశి (ధన్‌తేరస్‌ లేదా యమత్రయోదశి) నరక చతుర్థశి, దీపావళి, బలిపాఢ్యమి, భగినీహస్తభోజనం (భ్రాతృద్వితీయ) లేదా యమద్వితీయగా ఐదురోజులపాటు పండుగను చేసుకుంటారు.

వ్రత గ్రంథాలను పరిశీలిస్తే ఈ పండుగ జరుపుకునే తీరు తెలుస్తుంది. త్రయోదశినాటి రాత్రి అపమృత్యు నివారణకోసం నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని పూజించి ఇంటికి ఎదుట, వెలుపల భాగంలో ఉంచుతారు. దీన్నే యమద్వీపం అని కూడా అంటారు. ఆ మరునాడు నరక చతుర్థశిని జరుపుకుంటారు. లోకకంఠకుడైన నరకాసురుడు భగవానుడు చేతిలో హతమై లోకకల్యాణం జరిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఈ పండుగ ఆనాటి నుంచి అలా ప్రజలంతా జరుపుకుంటున్నారు.

నరకచతుర్థశినాడు నూనెలో లక్ష్మి, నీటిలో గంగ ఉంటాయి కనుక నువ్వుల నూనెతో తలంటుకొని విధి విధానంగా సూర్యోదయానికి ముందే తలంటుస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి ఉత్తరేణు ఆకులు, మట్టిపెళ్ళలతో దిష్టితీయించుకొనే సంప్రదాయం ఒకటుంది. మినప ఆకులను తినటంకూడా అంటే వండించుకొని తినటంకూడ ఓ సంప్రదాయంగా ఉంది. ఆ మరునాడు దీపావళి అమావాస్య రోజున మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల బెరడులను నీటిలోవేసి ఆ నీటితో స్నానంచేయటం ఓ ఆచారం. ప్రదోషకాలల్లో దీపాలను వెలిగించి అనంతరం దారిద్య్రాన్ని పారదోలేందుకు, ఇంట ధనరాసులు నిండేందుకు లక్ష్మీపూజను చేస్తుంటారు. దీపాలను వెలిగించటం, బాణాసంచా కాల్చటం, ఆకాశ దీపాలంటివి అమర్చటం, పితృదేవతారాధన లాంటివి ఈ పండుగనాడు చేస్తుంటారు.

దీపావళి రాత్రి నిద్రపోకుండా జాగరణ చేసి, అర్థరాత్రి వేళ, దరిద్ర దేవతను ఇళ్ళనుంచి, ఊరినుంచి కొంతమంది తరిమేస్తుంటారు. స్త్రీలు చాటలు, తప్పెటలు వాయిస్తూ దరిద్రాన్ని తరమటం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటి ఆవరణలో చక్కగా శుభ్రంచేసి ముగ్గులు తీర్చిదిద్దుతారు. దీపావళి మరునాడు బలిపాఢ్యమిని జరుపుతారు. బలిచక్రవర్తిని వామనవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు పాతాళానికి పంపేటప్పుడు ఆయనను మళ్ళీ సంవత్సరానికి ఒకసారి భూమిమీదకు వచ్చి ఒక్కరోజు పాలించేలా వరమిచ్చిన సన్నివేశాన్ని ఈరోజున జరుపుకుంటారు. ఆ మరునాడు భ్రాతృద్వితీయ. ఈ రోజున సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతివంటను ఆరగించి వస్తారు. ఈ ప్రకారం దీపావళి దేశవ్యాప్తంగా ఆనంద ఉత్సాహాల నడుమ జరుగుతుంటుంది.

Wednesday, October 19

వ్యాసభగవానుడు

పరాశర్యం పరం పురుషం విశ్వవేదైకయోనిం
విశ్వాధారం విబూధ వినుతం వేదవేదాంతవేద్యం
శశ్వచ్చాంతం శమిత విషయం శుద్ధబుద్ధి విశాలం
వేదవ్యాసం విమల మతిదం సర్వదా హం నమామి

పరాశరుని కుమారుడు, పరమపురుషుడు, ఙ్ఞానులచే స్తుతింపబడువాడు, వేదవేదాంత వేద్యుడు, మంచి బుద్ధిని ప్రసాదించు వేదవ్యాసునికి సదా నమస్కరిస్తున్నాను.

వ్యాస భగవానుని జననం :
వ్యాస మహర్షి, సత్యవతీ గర్భాన జన్మించిన వృత్తాంతాన్ని దేవీ భాగవతం పేర్కొన్నది.
యమునాద్వీపంలో సత్యవతి సద్యోగర్భంలో అపర మన్మధుని వలె ఉన్న మహాతేజస్సంపన్నుడైన వ్యాసమహర్షి జన్మించాడు. ఆ ద్వీపంలోనే జన్మించి ఆ ద్వీపంలోనే ఉంచబడిన బాలుడు కాబట్టి అతనికి "ద్వైపాయనుడు" అని పేరు వచ్చింది. ఆయన పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి, తపస్సు చేయడానికి ఆమె అనుమతిని పొంది నిష్క్రమించాడు.

వ్యాసశ్రమం :
వ్యాసాశ్రమం బదిరికి వెళ్ళే త్రోవలో అలకానందా సరస్వతీ నదుల సంగమస్థానంలోని "శమ్యాప్రాస" తీర్ధానికి సమీపంలో ఉంది. వ్యాసుడు వేద ప్రచారం ఇక్కడనుండే ప్రారంభించాడని, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైన మహర్షులు ఇక్కడే వేదశాస్త్రాలలో శిక్షణ పొందారని పురాణాలు చెబుతున్నాయి. కాని, వరాహ పురాణం ప్రకారం వ్యాసుడు, మధుర వద్దనున్న సోమతీర్ధం, వైకుంఠ తీర్ధముల మధ్యనున్న విష్ణు గంగాతీరంలో తపస్సు చేసినట్లు వివరణ.

వ్యాసుడు జగత్కళ్యాణం కోసం ఒకే రాశిగా ఉన్న వేదాలను విభజించి వాటి శాఖలను విడివిడిగా నిర్దేశించాడని భట్టభాస్కరుడు, తైత్తిరీయ సంహితలో స్పష్టం చేశాడు. అలాగే దుర్గాచార్యుడు, వేదరాశి ఒకటిగా ఉండి, అధ్యయన చేయడం కష్టంగా ఉండేదనీ, దానిని నాలుగుగా విభజించి, సులభతరం చేసారని పేర్కొన్నారు.

ఇప్పుదు జరుగుచున్నది, వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలో ఇది 28వ కలియుగం. ముందు గడిచిన 27 మహాయుగాలలో అనేక పేర్లుగల "వ్యాసులు" ఆవిర్భవించి, 27సార్లు వేదవిభజన చేశారు.కృష్ణద్వైపాయనుడు చేసిన వేదవిభజన 28వది. దీని బట్టి, ఇంద్రుడు మొదలైన పదవుల పేర్లు ఉన్నట్లే, "వ్యాస" అనేది కూడ ఒక పదవికి సంబందించినది అని. దానిని అధిష్టించు వ్యాసులు అనేకమంది ఉంటారని తెలుస్తొంది.

గతంలోని వ్యాసుల పేర్లు విష్ణుపురాణం ప్రకారం, 1) స్వయంభువు 2) ప్రజాపతి 3) ఉశనుడు (శుక్రాచార్యులు) 4) బృహస్పతి 5) సూర్యుడు 6) యముడు 7) ఇంద్రుడు 8) వసిష్టుడు 9) సారస్వతుడు 10) త్రిధాముడు 11) త్రివృషుడు 12) భరద్వాజుడు 13) అంతరిక్షుడు 14) ధర్ముడు 15) త్రయారుణి 16) ధనుంజయుడు 17) కృతంజయుడు 18) సంజయుడు 19) అత్రి 20) గౌతముడు 21) హార్యాత్మకుడు 22) వేణుడు 23) సోముడు 24) తృణబిందుడు 25) భార్గవుడు 26) శక్తి మహర్షి 27) జాతుకర్ణుడు 28) కృష్ణద్వైపాయనుడు

ఈ విధముగా ప్రతి ద్వాపరయుగంలోను ఒక మహనీయుడు వ్యాసపీఠాన్నలంకరిస్తాడు. వ్యాసభగవానుడు వేదమూర్తి, హిమాలయా శిఖరాలే ఆయన సముత్తుంగ శిరస్సు. కన్యాకుమారి ఆయన పాదద్వంద్వం. శ్రీలంక పాదపీఠం. యుగయుగాల వేదఘోషలోని ప్రణవనాదమే ఆయన హృదయ స్పందన. గంగాది సర్వనదీనదాలే రక్తనాళాలు. భారతీయ సంస్కృతే ప్రవహించే రక్తం. ఆయన నేర్పిన నడవడే ధర్మం. ఆయన అడుగుజాడలే భారతదేశాన్ని ప్రపంచదేశాలకు గురువుగా నిలిపాయి. ఆయనే వేదవ్యాసులు.

ఈ ప్రపంచ వాఙ్మయంలో ప్రతిదీ లోతుగా పరిశోధిస్తే చివరకి వాటి మూలంలో వ్యాసమహర్షే కనిపిస్తారు. అందుకే "వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అన్నారు. వేదవిఙ్ఞాన సర్వఙ్ఞ పీఠాధిపతి. అందుకే ఆయన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమను భారతదేశమంతా వ్యాపూర్ణిమగా/గురుపూర్ణిమగ జరుపుకుంటాము. మహాయోగి అరవిందులు, వ్యాసుడిని జాతీయ కవిగాను, భారతాన్ని జాతీయ కవ్యంగాను అభివర్ణించారు.

వ్యాసుడు తన నలుగురి శిష్యుల ద్వార 4వేదాలను, సూతమహర్షి ద్వారా సకల పురాణ సంపదను, వైశంపాయనుని ద్వార మహాభారతాన్ని, శుకయోగి ద్వార భాగవతాన్ని మానవజాతికి అందించారు.

Tuesday, October 11

వరాహపురాణంలో వేంకటాచల విశేషాలు (2)

పద్మావతీశ్రీనివాసుల వివాహం:
అది విన్న ఆకాశరాజు, ధరణీదేవి, మహదానందంతో బృహస్పతిని రప్పించి, వధూవరుల నక్షత్రాల ప్రకారం తగిన మూహూర్తం పెట్టమని చెప్పిరి. బృహస్పతి ఉత్తరఫల్గునీ నక్షత్రం మంచిదని, వైశాఖమాసంలో వివాహం జరిపించమని చెప్పెను.
ఆకాశరాజు విశ్వకర్మను ఆహ్వానించి పుర అలంకారము అప్పగించెను. కుబేరుడు కోశాగారము నింపెను. అంగరంగ వైభోగముగా కన్యాదానము, మాంగల్యధారణ, హోమాదులను జరిపించిన ఆకాశరాజు, వృషభాద్రికి తన కూతురుని అల్లునితో పంపెను. ఆకాశరాజు ప్రేమాదరాలకు మెచ్చిన శ్రీనివాసుడు వరం కోరుకోమనగా "నీ యందు భక్తిని, ఎల్లపుడూ నీ సేవ చేసుకొను భాగ్యమును నాకనుగ్రహించు" అని కోరెను. శ్రీనివాసుడు, ఆకాశరాజు కోరికెను అనుగ్రహించెను.

తొండమానుని వృత్తాంతం :
బ్రహ్మాండనాయకుడిని 100సంవత్సరాలు అనన్యమైన భక్తితో సేవించిన రంగదాసు తిరిగి, దంపతులైన ,మహారాజు సువీరుడు, నందిని కి తొండమానుడుగా జన్మించాడు. ఇతను విష్ణుభక్తుడు. పాండ్యరాజ పుత్రిక పద్మను వివాహము చేసుకొనెను. ఒకరోజు వెంకటాద్రి సమీపములో వేటకు వెళ్ళాడు, అక్కడ ఒక మదపుటేనుగును చూచి, దానిని పట్టుకొందామని ప్రయత్నములో సువర్ణముఖీ నదిని దాటి చాలదూరం వెళ్ళాడు. తిరిగివచ్చు సమయంలో పంచవర్ణముల కల చిలుకను చూసి, దాని వెంటపడగా, అది "శ్రీనివాసా" అంటూ రివ్వున వేంకటాద్రికి చేరింది. అక్కడ ఉన్న బోయవాడిని అడుగగా, అది శ్రీనివాసుడికి ఇష్టమైన చిలుక అని, దాన్ని ఎవ్వరు పట్టుకోలేరు అని, నేను స్వామి దర్శనానికి వెళ్తున్నానని చెప్పెను". తొండమానుడు అతనితో కలిసి స్వామిని దర్శించుకొన్నాడు. తొండమానుడు శ్రీనివాసుని సేవలో చరితార్ధమైనాడు. శ్రీనివాసుడు ఒకసారి తొండమానుడికి కలలో కనిపించి " ద్వారగోపుర ప్రాకారాలను నీవు కట్టించుము. నీ వంశములో ముందు తరాలలో నారాయణుడు అనువాడు విమానము నిర్మించి, స్వర్ణముతో అలంకరించగలడు" అని సెలవిచ్చెను. ఆ దేవదేవుడి ఆఙ్ఞానుసారం తొండమానుడు ప్రాకారమును నిర్మించి, వైఖానస ఆగమశాస్త్ర ప్రకారము పూజలు చేయించాడు.
ఈ విధముగా వరాహ పురాణములో శ్రీనివాసుని అవతార విశేషాలను, వేంకటాచలములోని అనేక తీర్థాల ప్రాముఖ్యాన్ని, వేంకటేశ్వర వైభవాన్ని ఇల ఎన్నో విషయాలను పొందుపరిచారు.

Sunday, October 9

వరాహపురాణంలో వేంకటాచల విశేషాలు (1)

శ్రీ వేంకటాచలం గురించి, ఆ బ్రహ్మాండనాయకుని గురించి ఎంత చెప్పినా మాటలు చాలవు. వేంకటాచల మహత్యం అనేక పురాణాల నుండి సంగ్రహింపబడినప్పటికీ వరాహపురాణం విస్తారంగా అభివర్ణించినది. వరాహపురాణం మహాపురాణాలలోనిది. ఈ పురాణమునందు 218 అధ్యాయాలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. వేంకటాచల మహత్యం ఎక్కువ అధ్యాయాలలో(40 అధ్యాయాలు) వర్ణించిన పురాణం వరాహ పురాణం మాత్రమే.

శ్వేతవరాహ వృత్తాంతం :
శ్రీమన్నారాయణుడు, శ్వేతవరాహ రూపంలో పాతాళమున ఉన్న హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. తరువాత కొంతకాలము భూమిపైనే నివాసం ఏర్పర్చుకోదల్చి, వైకుంఠమునుండి గరుడుని ద్వారా "క్రీడాద్రి" (వేంకటాద్రి) ని భూమికి తెప్పించాడు. ఈ పర్వతమునే కృతయుగములో అంజనాద్రి అని, త్రేతాయుగములో నారాయణాద్రి అని, ద్వాపరయుగములో సింహాద్రి అని, కలియుగములో శ్రీవేంకటాచలమని పేరుగాంచినది. పవిత్ర వేంకటాచలములో అనేక తీర్ధాలు ఏర్పడినవి, ప్రతీ తీర్ధానికి ప్రత్యేక ఇతిహాససంబంధం కూడా ఉన్నట్లు ఇక్కడ తెలియచేయబడినది.

స్వామిపుష్కరిణి :

కొండపైన ఉన్న పుష్కరిణి మానవనిర్మితం కాదు. అది స్వయంవ్యక్త క్షేత్రం కనుక పుష్కరిణి కూడ స్వయంవ్యక్తమైనది. "స్వామి పుష్కరిణి" అనే ప్రసిద్ధి, వెంకటాద్రియందున్న మూడుకోట్ల తీర్ధాలలో. ఈ ఒక్క తీర్ధానికే దక్కింది. ఈ పుష్కరిణి గురించి వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలు పేర్కొన్నాయి.
శ్వేతవరాహ రూపంలో ఉన్న విష్ణువు ఆఙ్ఞానుసారం గరుడుడు, వైకుంఠము నుండి "క్రీడావాపిని" భూలోకానికి తెచ్చెను. ఇది గంగాది తీర్ధాలకు ఉత్పత్తిస్థానమని శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలియకముందే స్వామి పుష్కరిణి ఆవిర్భవించింది అని వరాహపురాణం ప్రతిపాదిస్తున్నది. దీన్ని గురించిన ప్రస్తావన అంటే ఎప్పుడు/ఎలాగ ఆవిర్భవించింది అనే దాని గురించి ఏ పురాణంలోను ప్రస్తావించలేదు.

బ్రహ్మోత్సవ వైభవం :

బ్రహ్మ శ్రీవారిని సేవించుటకు వేంకటాచలానికి వచ్చి, అక్కడే కొంతకాలం ఉండెను. తరువాత స్వామి వారి ఆఙ్ఞతో వేంకటాద్రి యందు బ్రహ్మోత్సవం చేయడం ప్రారంభించెను. సౌరమానమును అనుసరించి, సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినకాలం కన్యామసమందురు. ఈ కన్యామాసంలో ధ్వజారోహణం చేస్తారు.
ఈ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం చూడటానికి దేవతలు విచ్చేసిరి. బ్రహ్మ ఆఙ్ఞానుసారం విశ్వకర్మ అన్నశాలలను, నివాసభవనాలను, పుర వీధులను ఏర్పాటు చేసాడు.
ఉత్సవ సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశుడు సమస్త వాద్యఘోషలతో, ఛత్రచామరలు, కవులు, వాద్యములు, వేదపండితులు వెంటరాగా, ఊరేగింపుగా వెళ్ళెను. ప్రతిరోజు వైఖానస ఆగమశాస్త్రవిధి ప్రకారం యాగశాలలో హోమం మొదలైన వైదికకర్మలన్ని జరుగును. బ్రహ్మోత్సవానంతరం తిరుమలేశుడు బ్రహ్మను పిలిచి " నీవు అత్యంత భక్తితో జరిపించిన ఈ బ్రహ్మోత్సవము నాకెంతో తృప్తిని కలిగించినది. ప్రతీ సంవత్సరము కన్యామాసంలో బ్రహ్మోత్సవాన్ని ఈ విధంగానే నిర్వహించినవారు బ్రహ్మలోకాన్ని పొందుదురు" అని వరమిచ్చెను.
బ్రహ్మోత్సవం మొట్టమొదట కల్పారంభంలో బ్రహ్మచే ఆచరింపబడి, ఇప్పటికీ ప్రతీఏడు జరుగుతున్నది.

పద్మావతమ్మ జననం

ఆకాశరాజు యఙ్ఞము చేయదలచి అరణీనదీ తీరంలో బంగారు నాగలితో కర్షణము చేయిస్తూ తాను నవధాన్యములు చల్లుచుండెను. ఇంతలో పద్మశయ్యపై పరుండి బంగారు బొమ్మవలే ఉన్న బాలిక ఆ భూమిపై కనపడెను. ఆ సమయంలోనే ఆకాశవాణి ఇలా పలికింది " ఈ బిడ్డ నీ బిడ్డ, ఈమెను నీవు పెంచుము"అని. ఆకాశరాజు సంతసించి భార్య అయిన ధరణీదేవి తో సంతోషముగా పద్మావతిని పెంచి పెద్దచేసెను.
ఒకరోజు పద్మావతి చెలికత్తెలతో కలిసి ఉద్యానవనమునకు వెళ్ళింది. అంతలో ఒక మదపుటేనుగు అటుగా రావడంతో అందరూ భయంతో చెట్టుచాటున దాగిరి. ఆ సమయంలోనే ఆజానుబాహుడు, పద్మాక్షుడు అయిన వేంకటేశ్వరుడు అటు రాగ, ఆ ఏనుగు శ్రీనివాసునికి నమస్కరించి అడవిలోకి వెళ్ళిపోయింది.
అప్పుడు వేంకటేశ్వరుడు పద్మావతిని చూస్తూ, "ఈమె ఎవరు?"అని ప్రశ్నించగా "ఈమె ఆకాశరాజు, ధరణీదేవిల ముద్దల కొమరిక. నిన్ను ఇక్కడ ఆకాశరాజు చూచినచో కారాగారమున బంధించును. కనుక ఇచ్చటనుండి త్వరగా వెళ్ళుము" అని చెల్లికత్తెలు సమాధానమిచ్చిరి. శ్రీనివాసుడు తిరిగి వేంకటాద్రికి వెళ్ళిపోయాడు
ముక్తాగృహానికి చేరిన శ్రీనివాసుడు పరధ్యానముగా ఉండుట గమనించిన వకుళామాత, శ్రీనివాసుడి ద్వార పద్మావతి విషయమును తెలుసుకొనెను. తనకు పద్మావతితో వివాహము జరిపించమని వకుళను అడుగగా, వకుళ ఆకాశరాజు ఉండు నారాయణపురమునకు శ్రీనివాసుని ద్వార దారి తెలుసుకొని, నారాయణపురం చేరెను. ధరణీదేవిని కలుసుకొని, స్వపరిచయం చేసుకొని, ఉద్యానవనంలో జరిగిన పద్మావతీ శ్రీనివాసుల కలయిక గురించి వివరంగా చెప్పింది.

Sunday, October 2

సూర్యనారాయణుడి పాదాలవద్ద సూర్యకిరణాలు (oct 2011)

ప్రతీ సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయన కాల మార్పు సందర్భంలో సూర్యకిరణాలు, అరసవల్లి సూర్య భగవానుడి పాదాలను తాకుతాయి. ఇలా ఏడాదికి 2పర్యాయములు (అక్టోబర్/మార్చ్) జరుగుతుంది. అక్టోబర్ 1న జరిగిన ఈ దర్శనాన్ని మనమూ చూద్దాము.