Friday, March 30

జై శ్రీరాం



నూతన సంవత్సరం, చైత్ర మాసం, ఉగాది వచ్చిందంటే శ్రీరాముని తలవని వారుండరు. శ్రీరామ చంద్ర స్మరణ అంటే శ్రీమద్రామాయణ స్మరణయే. జరుగుచున్నది “నందన”నామ సంవత్సరం. ఆ పదానికి అర్ధం “ఆనందింపచేయునది”. తల్లిదండ్రులను ఆనందింపచేసే పుత్రుని నందుడంటారు. దశరధ నందనుడు, కౌసల్యా నందనుడు అని రామచంద్రుడిని పిలవడం అంతరార్ధం ఇదే.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట పంపమనన్నప్పుడు దశరధుడు మనస్పూర్థిగా పంపలేకపోయాడు. కాని, కౌసల్య మాత్రం ఆనందంగా పంపగలిగిన దానిని మనసులో ఉంచుకుని, విశ్వామిత్రుడొక ఉషఃకాలమున రామలక్షణులను
“ కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం”
కౌసల్యకు జనించిన సత్పురుషుడవు, నరశ్రేష్టుడవైన ఓ రామా, ప్రాతస్సంధ్య ఏర్పడనున్నది. కనుక చేయవలసిన నిత్యకృత్యమును ఆచరించవలసియున్నది కనుక లెమ్మని నిద్రలేపాడు.
ఇక్కడ కౌసల్యా సుప్రజా అంటే కౌసల్య యొక్క సుపుత్రుడు / అన్ని సద్గుణాలు కలిగిన పుత్రుడు కలది కౌసల్యా అని అర్ధం. ఎవరికైన తొలిగురువులు తల్లితండ్రులే. కనుక వారి వచనాన్ని జవదాటరాదు.

రామాయణం మహా కావ్యం సర్వవేదార్ధసమ్మతం
సర్వపాపప్రశమనం దుష్టగ్రహనివారణం
వాల్మీకి రామాయణం గురించి ఇలా అన్నారు “ రామాయణం మహా కావ్యం. సర్వవేదసారం. సమస్త పాపాలను నశింపచేసేది. దుష్టగ్రహబాధలను తొలగిస్తుంది. ఇటువంటి గ్రంధం అందరిచే చదువదగినది లేక వినదగినది అని చెబుతూ మహర్షి, ఈ గ్రంధాన్ని వినదగ సమయాలను, ఫలితాలను కూడ చెప్పారు.

కార్తీక, మాఘ, చైత్రమాసాలలో శుక్ల పక్షాన పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది దినములు రామాయణ కధామృతం శ్రవణం చేయతగినది. ఈ సమయాన పారాయణ ఫలప్రదమైనది.
ఘొరమైన కలియుగాన ఈ తొమ్మిది రోజులు రామాయణ పఠనమును గాని, శ్రవణమును గాని తప్పక చేయాలి.
రాముడిని చూడనివాడు, రాముని దృస్టికి రానివాడు లోక నిందకు గురియవుతాడు. అందుకే మేనమామ ఇంటి నుండి తిరిగి వచ్చిన భరతుడు రాజ్యలోభాకృష్ణుడు గాక, రామదర్శన భాగ్యమునకు తపించిపోయి, తల్లి చేసిన పాపంలో తనకూ భాగమున్నదని, కౌసల్య అనుమానికి స్థానమివ్వరాదని, ఆమెవద్ద తనను తననేక విధాలుగా నిందించుకుని, అడవికేగి రామదర్శన భాగ్యమునొంది, ఆయన పాదుకలను తెచ్చి రాజ్యపరిపాలన గావించి తంద్రికి తగ్గ పుత్రుడని, “నందను”డంటే ఇలా ఉండాలని నిరూపించుకొన్నాడు.

రామాయణం నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.

దశరధుడి నుండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం

కౌసల్యా, కైకేయి నుండి స్థితప్రఙ్ఞత

రామయ్య తండ్రి నుండి, తల్లి తండ్రుల మాటను ఆచరించడం

సీతమ్మ తల్లి, భర్త అడుగుజాడలలో నడవడం. ఆపద సమయాలలో మనోదైర్యంతో ఉండటం.

లక్ష్మణుడు, స్వామి భక్తి, రామాయణం మొత్తం పరిశిలిస్తే, రాముడి బాల్యం నుండి అన్నని విడవని తమ్ముడు, సుఖమైన దుఖమైన.

ఆంజనేయుడు, స్వామి భక్తి కి ప్రతీక, ఏ సంధర్భంలో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి, ఇపుడు మనం వేల కొలది బ్బు ధారపోసి నేర్చుకొనే కమ్యునికేషన్ స్కిల్స్ అనేవి ఆంజనేయుడి ద్వార నేర్చుకొవాలి.

రావణాసురుడు, మనకు రావణాసురుడు దుష్టుడిగా కనిపించినా, అతను తన రాజ్య ప్రజలకు దుష్టుడు కాదు, శతృవు కాదు. మంచి రాజ్య పాలకుడు, కార్యశీలుడు. అంతకము మించి శంకరుడి భక్తుడు. మహత్తేజస్సు కలవాడు. అంతకంటే గొప్ప విషయం, సీతమ్మను తాకనేలేదు. జీవి తపన పడిపోయాడు, ఆ శ్రీమన్నారయణుడి దరిచేరడానికి.

మందోదరి, మహా ఇల్లాలు.

ఇలా ఒక్కో పాత్ర ఒక్కో పాఠాన్ని నేర్పుతుంది.ఎటు చూసిన రామాయణం మహా సుందరమైనది. ఆంతా సుందరమే. “ప్రపంచంలోని అన్ని గ్రంధాలు తగులబడిన పర్వాలేదు, రామాయణం ఒక్కటి ఉంటే చాలు” అని ఓ మహానుభావుడు అన్నట్లు, మనం నిత్యం పారయణ చేయవలసిన మహత్ గ్రంధం రామాయణం.
ఆ ఇప్పటినుండే ఎం చదువుతాంలే అనుకొంటే, పెద్ద వయస్సు వచ్చేసరికి నేర్చుకొనేది ఏమి ఉండదు. కాబట్టి, ఈ క్షణం నుండి రామ నామంతో , వీలైన ప్రతి క్షణాన్ని స్మరించండి.
జై శ్రీరాం....

విషయ సేకరణ : కొంత ఋషిపీఠం నుండి, కొంత స్వీయ లిఖితము.

Tuesday, March 20

నందన సంవత్సరాది

అందరికి "నందన" సంవత్సర శుభాకాంక్షలు.

ఉగస్య ఆది:ఉగాది: - 'ఉగ'అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. అంటే సృష్టి 'ఉగాది'. 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
వేదాలను హరించిన సోమకుని వధించి మత్సావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచునందని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో,రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది పచ్చడి నివేదించవలెను.

ఉగాది పచ్చడి సేవనం
ఉగాదినాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన దానినే ఉగాది పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌
అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాదినాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం. పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రభోదాత్మకం కూడా! 'తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు' అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు హరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

పంచాంగ శ్రవణం
'తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌'
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు ఉగాది నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.
'పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్'
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
'పంచాంగం' అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు,7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, భవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే 'పంచాంగం'. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.