Saturday, August 25

శుక్లాంబరధరం విష్ణుం

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే

శుక్ల – స్వచ్చమైన
అంబర – ఆకాశాన్ని
ధర్మ – ధరించిన
శశివర్ణం – చంద్రుని వంటి కాంతి కలిగిన
చతుర్భుజం – నాలుగు వేదాలను నాలుగు భుజములుగా కలిగినవాడు / చతుర్విధపురుషార్ధాలను ఇచ్చువాడు
ప్రసన్నవదనం – చిరునవ్వులొలికించి సిరివెన్నలలను చిందించు నగుమోము కలవాడు
విష్ణుం – సర్వవ్యాపకుడైన పరమాత్మ
సర్వ విఘ్నోపశాంతయే – సమస్త అడ్డంకులను శాంతింపచేయుటకు
ధ్యాయేత్ – ధ్యానం చేస్తున్నాను.

తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన.

ఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందినది అని అనుకుంటాము. కాని, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు.

శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.

ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి కి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది.

ఏకో దేవః సర్వభూతేషు...అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.

Thursday, August 2

ప్రదక్షిణం

గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం. "స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని" రకరకాలుగా కోరుతూంటారు. అసలా ప్రదక్షిణ అనేదాని గురించి తెలుసుకుందాం.

ఈ జగత్తులో సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే అవి సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతున్నాయని చెప్పవచ్చు. విశ్వంలో జననం నుండి మరణం వరకు ఒక ప్రదక్షిణ. ఎన్నో జన్మల కర్మ ఫలాలను అనుభవించడమే, వాటి దుష్ఫలితాలను తొలగించుకునేందుకు తాపత్రయ పడటమే ప్రదక్షిణ.

నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి, ప్రాణాలను కూడ లెక్క చేయకుండా, బిడ్డకు జన్మనిచ్చి, తమకంటే బిడ్డను ఉన్నతస్థాయిలో ఉంచేందుకు తపనపడే తల్లి కి ఎంతటి ఉన్నతస్థానం ఇస్తామో, ప్రప్రధమ దైవంగా భావిస్తామో, ఏమి చేస్తే కృతఙ్ఞత ప్రకటింపబడుతుందో తెలిపే వివరణ ఇది...
మూడు సార్లు భూప్రదక్షిణ చేసినా, 100సార్లు కాశి యాత్ర చేసినా, కార్తీక,మాఘ స్నానాలు చేసినా, అమ్మకు వందనం చేసినదానితో సాటిరాదు.

ప్ర అక్షరం సమస్త పాప నాశనకారి
ద అక్షరం కోరికలన్ని తీరుతాయనే భావం
క్షి అక్షరం రాబోయే జన్మ జన్మల రాహిత్యాన్ని సూచిస్తుంది
ణం అక్షరం అఙ్ఞానం వీడి ఙ్ఞానం ప్రసాదించే ఆవృతం అని అర్ధం ( భగవాన్ శ్రీ రమణ మహర్షి వివరణ)

ప్రదక్షిణ చేసేటప్పుడు, చేతిలొ కాగితం పై లెక్కించుకుంటు, ధ్యాసంతా ఎపుడెపుడు 108 అవుతాయా, తొందరగ చేద్దాం అని, భగవంతుని మీద ధ్యాసలేకుండా త్వర త్వరగా చేయడం అనేది పద్దతి కాదు.

నిండు నెలల స్త్రీ, నిండు కుండతో నడిచే వ్యక్తి ఎలా నడుస్తారో, అంత నెమ్మదిగా, దైవ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణా విధానంలో ఎంత నెమ్మదిగా ఉంటే అంత ఫలితం ఉంటుందని విఙ్ఞులు అంటారు.
ప్రదక్షిణ చేసేటప్పుడు ఇష్టమైన దైవాన్ని స్మరించాలి.

అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు అడుగుని అనుసరిస్తూ, చేతులు నిశ్చలంగా జోడించి, దైవ నామస్మరణతో ప్రదక్షిణ చేయాలని పెద్దలంటారు. దీనినే "చతురంగ ప్రదక్షిణ" అంటారు.


సృష్టి, స్థితి, లయ కారకులను స్మరిస్తూ చేసే ప్రదక్షిణాలు 3ప్రదక్షిణాలు

పంచభూతాలలోని పరమాత్మను దర్శిస్తూ 5 ప్రదక్షిణాలు
నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదక్షిణలు :
మొదటిది...ఫలాన వ్యక్తిని ప్రదక్షిణ చేయడానికి వచ్చానని చెప్పడానికి
రెండవది...నవగ్రహాధిపతి అయిన సూర్యునకు చేసే ప్రదక్షిణ
మూడవది...ప్రదక్షిణాలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందుకు