Saturday, September 22

శ్రీలక్ష్మీ నృసింహ స్వరూప ధ్యాన శ్లోకం

వందే నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం
వివృతాస్యం త్రిణయనం శరదిందు సమప్రభం
లక్ష్మ్యలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం
చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం
ఉరోజ శోభితోరస్కం రత్నకేయూరముద్రితం
తప్తకాంచన సంకాశం పీతనిర్మల వాసనం
ఇంద్రాది సురమౌళిస్థ స్ఫురన్మాణిక్య దీప్తిభిః
నీరాజిత పదద్వంద్వం శంఖచక్రాది హేతిభిః
గరుత్మాతా సవినయం స్తూయమానం ముదాన్వితం
హృత్సరోజనదావాసం ప్రహ్లాదవరదం హరిం


"దేవతలకు ప్రభువైన శ్రీనృసింహస్వామి బంగారు సింహాసనం పై కూర్చొని ఉన్నారు. తెరచిన నోటితో, మూడుకన్నులతో, శరత్కాల చంద్రునివంటి చాయతో, వామభాగమున లక్ష్మీదేవితో, సమస్త మంగళకర శక్తులతో భాసిస్తున్నాడు. చతుర్భుజాలతో, సుందరతనువుతో, స్వర్ణకుండలాలతో, శ్రీవత్సలాంచన శోభితమైన ఛాతితో, రత్నకేయూరాల తో, పుటం పెట్టిన బంగారంలా, పీతాంబరధారియై శోభిస్తున్నాడు. ఇంద్రాదులు వంగి నమస్కరిస్తూండగా, వారి కిరీటాల మణుల కాంతులే హారతులై మెరుస్తున్నాయి. ఆ వెలుగులతో, శంఖచక్రాది చిహ్నాలతోనున్న పాదములు విరాజిల్లుతున్నాయి. వినయంతో ఉన్న గరుత్మంతుడు స్తోత్రిస్తుండగా ఆనందిస్తున్న శ్రీహరి ప్రహ్లాదవరదుడై నా హృదయకమలంలో యెల్లప్పుడూ నివసిస్తున్నాడు. ఆ స్వామికి వందనములు. 

Tuesday, September 18

గణేష దుర్గాస్తోత్రం

గణేష దుర్గాస్తోత్రం, రక్షాకరమైన స్తుతి.



ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయాం అగ్నితేజసః
యామ్యాం లంబోదరో రక్ష్యేత్ నైఋత్యాం పార్వతీసుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదః ప్రభుః
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః
ఏవం దశదిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్న నాయకః
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః
కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి

"తూర్పున హేరంబుడు, ఆగ్నేయములో అగ్ని సమాన తేజస్వి, దక్షిణాన లంబోదరుడు, నైఋతిలో పార్వతీసుతుడు, పడమర వక్రతుండుడు, వాయువ్యంలో వరదుడైన ప్రభువు, ఉత్తరాన గణపుడు, ఈశాన్యంలో ఈశానందనుడు, ఇలా పది దిక్కులా విఘ్ననాయకుడైన శ్రీమహాగణపతి నన్ను రక్షించుగాక. "

హేరంబుని స్మరించే ఈ రక్షాస్తోత్రాన్ని 3సార్లు పఠించేవారికి పాపసంహరణమే కాక, సంకటాలు తొలుగుతాయి. వెంటనే సమస్యా పరిష్కారం అవుతుంది. ఇది శ్రీ శివకృష్ణ సంవాదంలో ప్రబోధించిన స్తుతిగా పురాణాలు చెబుతున్నాయి.