Showing posts with label ఆచరించు పద్దతులు. Show all posts
Showing posts with label ఆచరించు పద్దతులు. Show all posts

Wednesday, October 10

ఎవరితో ఎలా మాట్లాడాలి

ఇప్పుడు మనం కొన్ని వేల రూపయలు ధారపోసి కమ్యునికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటున్నాం. పురాణ గ్రంధాలలో వీటి గురించి చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడిని నుండి నేర్చుకోవచ్చు.
మాట్లాడే విద్యకి ఉన్న గొప్పదనం ఆదికావ్యం వాల్మీకి రామాయణంలోనే కనబడుతుంది. హనుమంతుడు అంటే రామభజన చేసేవాడని సామాన్యుల భావన. కాని వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కేవలం భజన పరుడుకాదు. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షా పరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా, ఆదర్శవంతముగా నిర్వహించిన వాడు.

ఎలా మాట్లాడాలి?? 
శాస్త్రానుసారం ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతాడు పవనకుమారుడు. అది ఎలాగన్నది కిష్కింధ కాండలో మొదటిసారి హనుమంతుడు, రాముడిని కలిసినపుడు, రాముని నోట పలికించాడు వాల్మికీ మహర్షి.

ఎలా మాట్లాడాలంటే..
విషయం స్పష్టముగా ఉండాలి
వాక్యంలో దోషాలు ఉండకూడదు. ముఖము, కన్నులు, నుదురు, కనుబొమ్మలు..ఏ అవయవంలోనూ వికార చేష్టలు ఉండకూడదు.
విషయంతో సంబంధంలేని మాటలు మాట్లాడకూడదు.
సందిగ్ధంగా ఉంచకూడదు.
మాటలను ఆపి ఆపి మాట్లాడకూడదు
మాట మనసులోనుండి రావాలి
మధ్యమ స్వరంతో మాట్లాడాలి
ఇలా హనుమ మాట్లాడినట్లు అభ్యాసం చేయగలిగితే, ఎవరైన, ఏ రంగంలోనైనా, ఎక్కడైన రాణించగలరు.

ఎవరితో ఎంత మట్లాడాలి ??
ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు అనేది ప్రతీరోజు మనం చూసే ప్రధాన అంశం. నీతులు, నియమాలు ఒక వాక్యంలో చెప్పి వదిలేస్తే హృదయానికి హత్తుకోవు. విషయం అర్ధం అయ్యేలా స్పష్టముగా చెప్పాలి.

దూతగా...
మధ్యవర్తిగా వెళ్ళినపుడు ఎలా మట్లాడాలి అనేది హనుమంతుడు రామదూతగా అశోకవనంలో సీతమ్మ తల్లితో మాట్లాడిన తీరు గమనించాలి.
అశోకవనంలో ప్రాణత్యాగానికి పాల్పడుతున్న సీతను చూసాడు హనుమ. ముందుగా ఆమె చేత ఆ ప్రయత్నాన్ని విరమింపచేయాలి, రాముడు రాబోతున్న వార్త తెలపాలి, అంతకుమించి తాను రామ దూత అని నమ్మించాలి. ఏ విధముగా సంభాషించాలి అని అలోచించి “ దశరధుడు అనే మహారాజు అయోధ్యకు రాజు....అని విషయాన్ని చెప్పడం మొదలు పెట్టాడు చెట్టు మీద కూర్చునే, రాముడి పేరు తప్ప మరొకరి పేరు తెలియని లంకలో దశరధమహారజు పేరు వినబడిందంటే, తన ఆత్మీయులు ఎవరో వచ్చారని అర్ధమై ఆత్మహత్యా ప్రయత్నం మానేసింది సీత. అప్పుడు పవనకుమారుడు సీత ఎదురుగా వచ్చి, రాముడు వానర సైన్యంతో సీతను విడిపించడానికి వస్తున్నడనే విషయాని సీతమ్మకి తెలియచేస్తాడు. తాను చేసిన సాహసాలు ఒక్కటి కూడ చెప్పడు.
రాముడు వచ్చేవరకు సీత జీవించి ఉండేలా చేయాలి, అందుకు ఏం చేయాలి? రాముడు రాబోతున్న వార్త చెబితే చాలు, తన సాహసాల గురించిన ప్రస్తావన అవసరంలేదు. అందుకే హనుమ అవసరం మేరకు మాత్రమే మాట్లాడాడు.

స్నేహితులతో...
సీతను చూసి, రావణుడిని హెచ్చరించి, లంకా దహనం చేసి తిరిగి తన కోసం ఎదురు చూస్తున్న వానరసేనను కలుస్తాడు హనుమ. సీతను చూసాను అనే మాట మాత్రమే చెప్పి వారి మనసులను కుదుట పరుస్తాడు. ప్రాణాలు కుదుటపడ్డ వానరులు, అసలు ఎలా సముద్రాన్ని దాటగలిగావు, సీతమ్మను ఎలా కనిపెట్టావు అని అడిగారు.

ప్రభువుతో... 
సీతమ్మ చెప్పిన, చిత్రకూటంలో జరిగిన ఒక సంఘటనను హనుమ రాముడితో చెప్పాడు. (తాను సీతను చూసాననే దానికి ఆనవాలుగా). తరువాత అసలక్కడ సీతమ్మ ఎలా ఉంది, రావణుడి గురించి వివరంగా తెలిపాడు.
ముఖ్యమైన విషయం ముందే చెప్పేయాలి. అంతేగాని టి.వి సీరియల్ లా సాగదీయకూడదు. అవసరమైన విషయం ముందు చెప్పేసి, తరువాత విషయాలు నెమ్మదిగ చెప్పాలి. 

ఇలా ప్రత్తి ఒక్క పురాణం నుండి మనం నేర్చుకోవలసింది, నేర్చుకుని ఆచరించవలసిన అంశాలు చాల ఉంటాయి. కనీసం మనం ఒక్కదాని ఆచారణలో పెడితే, దాని ఫలితాలకు తిరుగుండదు.

Thursday, August 2

ప్రదక్షిణం

గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం. "స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని" రకరకాలుగా కోరుతూంటారు. అసలా ప్రదక్షిణ అనేదాని గురించి తెలుసుకుందాం.

ఈ జగత్తులో సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే అవి సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతున్నాయని చెప్పవచ్చు. విశ్వంలో జననం నుండి మరణం వరకు ఒక ప్రదక్షిణ. ఎన్నో జన్మల కర్మ ఫలాలను అనుభవించడమే, వాటి దుష్ఫలితాలను తొలగించుకునేందుకు తాపత్రయ పడటమే ప్రదక్షిణ.

నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి, ప్రాణాలను కూడ లెక్క చేయకుండా, బిడ్డకు జన్మనిచ్చి, తమకంటే బిడ్డను ఉన్నతస్థాయిలో ఉంచేందుకు తపనపడే తల్లి కి ఎంతటి ఉన్నతస్థానం ఇస్తామో, ప్రప్రధమ దైవంగా భావిస్తామో, ఏమి చేస్తే కృతఙ్ఞత ప్రకటింపబడుతుందో తెలిపే వివరణ ఇది...
మూడు సార్లు భూప్రదక్షిణ చేసినా, 100సార్లు కాశి యాత్ర చేసినా, కార్తీక,మాఘ స్నానాలు చేసినా, అమ్మకు వందనం చేసినదానితో సాటిరాదు.

ప్ర అక్షరం సమస్త పాప నాశనకారి
ద అక్షరం కోరికలన్ని తీరుతాయనే భావం
క్షి అక్షరం రాబోయే జన్మ జన్మల రాహిత్యాన్ని సూచిస్తుంది
ణం అక్షరం అఙ్ఞానం వీడి ఙ్ఞానం ప్రసాదించే ఆవృతం అని అర్ధం ( భగవాన్ శ్రీ రమణ మహర్షి వివరణ)

ప్రదక్షిణ చేసేటప్పుడు, చేతిలొ కాగితం పై లెక్కించుకుంటు, ధ్యాసంతా ఎపుడెపుడు 108 అవుతాయా, తొందరగ చేద్దాం అని, భగవంతుని మీద ధ్యాసలేకుండా త్వర త్వరగా చేయడం అనేది పద్దతి కాదు.

నిండు నెలల స్త్రీ, నిండు కుండతో నడిచే వ్యక్తి ఎలా నడుస్తారో, అంత నెమ్మదిగా, దైవ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణా విధానంలో ఎంత నెమ్మదిగా ఉంటే అంత ఫలితం ఉంటుందని విఙ్ఞులు అంటారు.
ప్రదక్షిణ చేసేటప్పుడు ఇష్టమైన దైవాన్ని స్మరించాలి.

అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు అడుగుని అనుసరిస్తూ, చేతులు నిశ్చలంగా జోడించి, దైవ నామస్మరణతో ప్రదక్షిణ చేయాలని పెద్దలంటారు. దీనినే "చతురంగ ప్రదక్షిణ" అంటారు.


సృష్టి, స్థితి, లయ కారకులను స్మరిస్తూ చేసే ప్రదక్షిణాలు 3ప్రదక్షిణాలు

పంచభూతాలలోని పరమాత్మను దర్శిస్తూ 5 ప్రదక్షిణాలు
నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదక్షిణలు :
మొదటిది...ఫలాన వ్యక్తిని ప్రదక్షిణ చేయడానికి వచ్చానని చెప్పడానికి
రెండవది...నవగ్రహాధిపతి అయిన సూర్యునకు చేసే ప్రదక్షిణ
మూడవది...ప్రదక్షిణాలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందుకు

Friday, July 20

కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు...

పూజ చేసాక, దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్దతి / ఆచారం. పూజ పూర్తి అయ్యాక, టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టెసాం తంతు పూర్తి అయింది అని అనుకుంటారు (అనుకుంటాము). అంతా బాగనే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. అందేంటొ కాస్త తెలుసుకుందాం.
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి....

1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.


2. కాయ కొట్టేటప్పుడు 9అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది


3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది


4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు


5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

Monday, July 9

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి

“చిన్న పిలకాయల్ని అడిగినా చెప్తారు ఎల ప్లాన్ చేసుకోవాలో, పార్టి ఎక్కడ ఇస్తే బాగుంటుందో, ఏ హోటల్ లో భోజనం చేస్తే బాగుంటుందో” అనేది టక్కున వచ్చే సమాధానం. కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యుతను చెడగొడుతోందో తెలుస్తోంది.

వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది.

పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు.

మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం

ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది.

ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయి
ఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి

లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి

అంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిది
కేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??

ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు.

పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే.

ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి

చిరంజీవీ యధా త్వం భో భవిష్యామి మహామునే
రూపనాన్ విత్తవాంశ్చైవ శ్రియాయుక్తశ్చ సర్వదా
మార్కండేయ నమస్తేస్తు సప్తకల్పాంత జీవన
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ప్రసీద భగవన్మునే
చిరంజీవీ యధాత్వంతు మునీనాం ప్రవరో ద్విజ
కురుష్వ మునిశార్దూల తధా మాం చిరంజీవినం
మార్కండేయ, మహాభాగ, సప్తకల్పాంత జీవనః
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ఆస్మాకం వరదోభవ

ఈ శ్లోకాలను పుట్టినరోజు ఎవరిదైతే వారు చదవాలి. ఈ క్రింది షష్టీదేవి శ్లోకం పిల్లలచే చదివించడం మంచిది

జయదేవి జగన్మాతః జగదానంద కారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టదేవతే
త్రైలోక్యేయాని భూతాని స్థావరాణి చరాణిచ
బ్రహ్మ విష్ణు శివైస్సార్ధం రక్షాం కుర్వంతు తానిమే

ఈ శ్లోకాలతోపాటు చదువవలసినవి

అశ్వత్ధామా బలిః వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరుశురామశ్చ సప్తైతే చిరంజీవనః
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ మధాష్టమం
జీవేద్వర్ష శతం ప్రాఙ్ఞః అపమృత్యు వివర్జితః
పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి.

“షష్టిపూర్తి” ఉత్సవాలు

ఇంతేకాక శాంతి కమలాకరంలో షష్టి ఆబ్ది పూర్తి వంటి విశేష దినాలో చేయాల్సిన తంతు చెప్ప బడినది.

జన్మత ష్షష్టమే వర్షే మృత్యు రుగ్ర రధానృణాం
దశభిస్త్వధికే తస్మిన్ మృత్యుర్భీమరధో నృణాం
విజయాఖ్యా రధోమృత్యుః అష్టసప్తతిమే భవేత్

59 దాటి 60వ సంవత్సరం రాగానే “ఉగ్రరధ” శాంతి, 70వ ఏట “భీమరధ” శాంతి, 78వ ఏట “విజయరధ” శాంతి, 83వ ఏట “శతాభిషేకం”, వంద సంవత్సరాలు నిండాక పూర్ణ శతాభిషేకం చేసుకోవాలి.

చిన్నవారందరు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది.

మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..

నిత్యాన్నదాతా తరుణోగ్ని హోత్రీ
మాసోపవాసీ చ పతివ్రతాచః
వేదాంతవిత్ చంద్ర సహస్ర దర్శీ
షడ్జీవలోకే మమ వందనీయాః

“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

విషయ సేకరణ : ఋషిపీఠం

Friday, December 9

తెలుగు సంవత్సరములు/తిధులు/వారములు...

మనం రోజు పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొంటాం. అందులో ఆయనము, మాసము, తిధి, వారము, ఋతువు, సంవత్సరము మొదలైనవి స్పష్టం చేస్తాం. అవి ఏమిటో ఒక్కసారి మననం చేసుకొందాం.

తెలుగు సంవత్సరాలు 60 :
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద్యూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద. రాక్షస, నల, పింగళ. కాళయుక్తి, సిద్ధార్ధి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.

ఆయనములు 2:
ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.

ఋతువులు 6 :
వసంతం, గ్రీషం, వర్ష, శరదృరుతువు, హేమంత, శిశిర

మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)

పక్షములు 2 :
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుంది అమావాస్య వరకు కృష్ణపక్షం.

తిధులు 16 :
పాడ్యమి, విదియ తదియ,
వితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య

వారములు 7 :
ఆదివారం - భానువాసరే
సోమవారం - ఇందువాసరే
మంగళవారం - భౌమ్యవాసరే
బుధవారం - సౌమ్యవాసరే
గురువారం - గురువాసరే
శుక్రవారం - భృగువాసరే
శనివారం - స్థిరవాసరే / మందవాసరే

Thursday, August 18

విగ్రహారాధన

విగ్రహారాధనను కొంతమంది ప్రముఖులే ఖండించారు. అంటే విగ్రహారాధన పనికిరాదనా దాని అర్ధం. కాదు ఎందుకంటే పెద్దలు పెట్టిన ఏ పద్దతి, శాస్త్రం తప్పు కాదు. అందులో ఏదో అర్ధం నిగూఢంగా దాగి ఉంటుంది. దానిని గ్రహించి మనం దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ' అన్న వ్యక్తుల మాటలు పట్టించుకోరాదు.

మొత్తం భగవంతుని ఉపాసించే పద్దతులు నాలుగు. అది ప్రతీకోపాసన, ప్రతిమోపాసన, విభూతోపాసన, విరాటోపాసన. ప్రతీకోపాసన అనగా ఆధ్యాత్మిక రంగంలో ఒకటో తరగతి. ఏదో ప్రతీకను (పసుపుముద్దో, కొయ్యముక్కో ఇలా) పెట్టి దానినే దైవంగా పూజించటం. రెండవది ప్రతిమోపాసన ఇది ఈ వ్యాసంలో మనం చర్చిస్తున్న విగ్రహారాధన. ఒక ప్రతిమను పెట్టి దానిని దైవంగా పూజించటం. ఇది ఆధ్యాత్మిక రంగంలో రెండవ తరగతి. ఎంత గొప్ప వ్యక్తి అయినా క్రింది తరగతులు చదివే కదా ఉన్నత విద్యకు పోయేది. ఈ విగ్రహారాధన సాధకుని మనస్సును దైవంపై స్థిరపర్చుతుంది. మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

ఆంజనేయ ప్రపంచంలో ఎక్కువగా భక్తులను ఆదుకొనేది విగ్రహారాధనే. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుపతి వెంకన్న, కాశీ విశ్వేశ్వరుడు, అయ్యప్పస్వామి అందరూ కలియుగంలో విగ్రహరూపంలో వెలసి భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతున్నవారే. దానిలో ఏ ఆకర్షణ, శక్తి లేకపోతే ఇన్ని లక్షల మంది భక్తులు, అన్ని కోట్లు సమర్పించుకొని తమ కోర్కెలు నెరవేర్చుకొంటున్నారు. ఇలా చెప్పుకుపోతే ప్రపంచంలో చాలా శక్తివంతమైన ప్రత్యక్ష నిదర్శనం గల విగ్రహాలు ఉన్నాయి. శ్రీరామదాసు లాంటి మహాభక్తులు కూడా మొదట ప్రతిమను పట్టుకొని పునీతులైన వారే. విగ్రహారాధనను ఖండించిన వారు తమ అహంకారాన్ని ఖండించుకోలేని వారే! వివేకానంద స్వామివారు ఒకసారి దేశాన్ని పర్యటిస్తూ విగ్రహారాధన అంటే మండిపడే ఓ రాజు ఉన్నదేశానికి వచ్చారు. ఆయన ఆ రాజును సంస్కరించాలని అనుకొన్నారు. "మీరు ఎన్ని చెప్పండి. విగ్రహం అంటే ఓ బొమ్మ. మట్టి లోహం తప్ప అందులో మరే విశేషమూ లేదు. యోగం ద్వారా భగవంతుని చేరుకోవటమే నిజమైన మార్గం" అన్నారు. దానికి వివేకానందుడు చిరునవ్వు నవ్వి ఆ రాజుగారి చిత్రపటాన్ని తెప్పించారు. అందరూ చూస్తూ ఉండగా ఆయన దివానును పిలిచి "ఈ పటంపై ఉమ్మేయ్" అన్నారు. ఆయన గడగడ వణుకుతూ "అపచారం అపచారం " అన్నాడు. ఇది రాజుగారికి కూడా కోపం తెప్పించింది. అప్పుడు వివేకానందుడు ఇలా అన్నాడు. ఈ బొమ్మలో ఏముంది రంగులేకదా! కాకపోతే ఇందులో రాజుగారి విగ్రహాన్ని చూసి భయపడుతున్నారు. అలాగే ఓ భక్తుడు కూడా మట్టి విగ్రహంలో కూడా తను మట్టిని చూడటం లేదు ఆ భగవంతుడ్నే చూస్తున్నాడు" అనగా ఆ రాజు గారు సిగ్గుపడ్డారు. నవవిధ భక్తిలో కూడా అర్చన ఒక భాగం. "అజ్ఞానాం భవనార్ధాయ ప్రతిమాః పరికల్పితా" (సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్ధమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది) అని దీని అర్ధం. కావున విగ్రహారాధన చేయకుండా భగవంతుని చేరుట దుర్లభం. దీనికి భక్తి ప్రధానం.

భవాని ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మొదటి సాధన ఇది. తమ ఇష్టదైవాన్ని విగ్రహరూపంలో పూజించటం పరబ్రహ్మను పూజించటమే అవుతుంది. దాని ద్వారా మనోనిగ్రహం పొంది తదుపరి నిర్గుణోపాసన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. సర్వవ్యాప్తి అయిన భగవంతుని శిలా, మృత్తిక, లోహ, దారుకలతో విగ్రహాలుగా మలచి మంత్ర తంత్ర సంస్కారములతో ఆవాహన చేసి, మంత్రతంత్ర విధులతో సామాన్యమైన భక్తులు పూజించి భగవంతుని అనుగ్రహం పొందుట శాస్త్ర సంబంధమై ఉన్నది. విగ్రహమనగా విశేషంగా గ్రహించునది. దైవశక్తిని గ్రహించునది. భగవద్గీత "ఉపాసింపవీలులేని భగవత్ తత్వాన్ని సామాన్య భక్తులు ఉపాసించటానికి విగ్రహారాధనే మేలు" అన్నది.

విగ్రహాలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇంట్లో నాలుగు నుంచి పన్నెండు అంగుళాల విగ్రహాలే ఉంచాలి. ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇక విభూతోపాసన, విరాటోపాసన అన్నది భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెల్పే ఆఖరి ఆధ్యాత్మిక దశలు.

Wednesday, June 29

దీపారాధన

  • దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
  • వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.
  • కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి.
  • కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.
  • దీపారాధన చేసేముందు దేవుడి ముందు పెట్టే కుందుల్లో నూనె, 2 వత్తులు వేసుకొని ఉంచుకోవాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో ( హారతి ఇచ్చే వస్తువు) కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధనని చేయాలి. అగరొత్తులు, ఏకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు దీపారాధన నుండి వెలిగించకూడదు.
  • దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.
  • ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు.
  • అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
  • దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మి కి , నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతి కి ముఖ్యము. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తి కి చాలా ముఖ్యము.
  • ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏదో ఒక తైలము శ్రేష్ఠము. ఎట్టి పరిస్ధితులలో శనగనూనె వాడరాదు.
నెయ్యి --------మహాలక్ష్మి కటాక్షం (ఆవు నెయ్యి, విప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.)
ఆముదం ------కష్టాలు తొలుగుట, ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు పొందుతారు
నువ్వులనూనె ------ మద్యమం(దుష్ట శక్తి , శతృ బాధలు తొలుగుతాయి)

దీపం కొండెక్కింది అనాలి. దీపారాధన పూర్తయింది, ఆరిపోయింది అని అనకూడదు.
తెల్లవారుఝామునే లేచి స్నానాదులు ముగించుకొని దైవారాధన చేయాలి. తెల్లారి 5 గంటల లోపు స్నానం చేస్తే దానిని బుషిస్నానం, 5-6 గంటల వేళ స్నానం చేస్తే దైవస్నానం, 6-7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. (ఇప్పుడు మిట్టమధ్యాహ్నం వరకు స్నానాదులు చేయకుండా మిగిలిన పనులు పూర్తిచేస్తున్నారు. అది ఇంటికి, మనకి కూడా మంచిది కాదు.)

Wednesday, May 18

నమస్కారం

"నమస్కారం" అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం. తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.

మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష. [ ఇటీవల నమస్కారానికే అర్ధం మారిపోయింది, ఒక చేతిని పైకెత్తి నమస్తే అంటున్నారు, ఇంకొందరు వెటకారంగా కూడా ఉపయోగిస్తున్నారు ]

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా "నమస్కారం / నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.
  • శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.[శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు ]
  • హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించాలి.
  • గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి
  • తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి
  • తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి
  • యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.