Saturday, July 31

సంకటహర చతుర్ధి వ్రతం



ఏ కార్యం తలపెట్టిన, ఏ వ్రతం ఆచరించినా ముందుగా గణపతిని ఆరాధిస్తాము.విఘ్నాధిపతి ఐన వినాయకుడు సంకటాలను, సర్వ విఘ్నాలను పోగ్గొట్టి శుభాన్ని కలుగజేస్తాడు. అలాంటి గణపతి ని పలురకాలుగా పూజిస్తారు. అన్నింటిలోకి అంత్యంత మహిమాన్వితమైనది, కష్టాలను తొలగించి అనంత శుభాలను కలుగజేసేది సంకటహర చతుర్ధి వ్రతం. దీనినే శ్రీసంకస్టహర చతుర్ధీ మహాగణపతి వ్రతం అని కూడా అంటారు. స్కంద పురాణం లో, శ్రావణమాస మహత్యం లో వ్యాస భగవానుడు ఈ వ్రతం యొక్క విశిష్టతను తెలియపరిచాడు.
ఏమి చేయాలో పాలుపోక, ఏది చేసినా విజయవంతం కాక, సందిగ్ధావస్థ లో ఉన్న సమయంలో ఈ వ్రతం ఆచరించడం వలన సర్వ విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్ధి చంద్రోదయ సమయంలో పూజిచినట్లైతే శుభం కలుగుతుందని గణపతే స్వయంగా తల్లి ఐన పార్వతీదేవికి చెప్పినట్లు పురాణ కధనం.
మొదటిసారిగా ఈ వ్రతాన్ని శ్రావణ బహుళ చతుర్ధి నుండి ప్రారంభించాలి. లేని పక్షంలో ఏదో ఒక శుభామాసంలో బహుళ చతుర్ధి నుండి ఐన ప్రారంభించవచ్చు. ఈ వ్రతం చేయదలచిన వారు సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి గణపతిని పూజించాలి. ఒక పీటను సిధంచేసి దాని పైన ఒక మంచి వస్త్రం వేసి, బియ్యం పోసి, గంగా జలం, సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో మామిడి ఆకులతో, టెంకాయ తో కూడిన కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఎర్రని వస్త్రాన్ని ఉంచి గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలి. ఉండ్రాళ్ళను వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. పూజ తర్వాత చంద్ర దర్శనం చేసుకొని చంద్రునికి ఆర్గ్యం వదలాలి. అనంతరం కుటుంభ సభ్యులతో కల్సి తీర్ధ ప్రసాదాలను తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే సంకటాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: