ప్రస్తుతం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం, తిరుమలలో జరుగు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9రోజులపాటు అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. ఈ 9 రోజులు ముల్లోకాలలోని దేవతలూ, దివ్య శరీరాలతో మహర్షులూ తిరుమలలోనే ఉంటారు. తిరుమల "గోవిందా, గోవిందా "అంటూ ఆ నారాయణుడి నామస్మరణతో మారుమ్రోగిపోతూంటుంది. సర్వసేనాధిపతి విష్వక్సేనుల వారికి తిరువీధులలో వైభవంగా ఊరేగింపు నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. విష్వక్సేనుల వారిని పల్లకీలో కూర్చొండబెట్టి, ఉత్సవాలకు బ్రహ్మాది దేవతలకు ఆహ్వానించడానికై, తిరుమల మాడ వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున రాత్రి పెద శేషవాహనం. శ్రీవారికి ఆదిశేషుడు అత్యంత ప్రియభక్తుడు.ఆదిశేషునికి ఉన్నంత కైంకర్యనిరతి మరెవరికి లేదు. ఆదిశేషుడే స్వయముగా శేషాద్రిగా వెలసి స్వామివారిని తన శిరస్సుపై సర్వవేళలా ఉంచుకుంటూ జగత్ కళ్యానానికి తోడ్పడుతున్నడు. అంతటి ప్రియభక్తుడైన ఆదిశేషుని పై మాడవీధులలో ఊరేగి వెళ్ళడం శ్రీవారికి అత్యంత ప్రియం.
రెండవరోజు రాత్రి హంసవాహనసేవ. హంస పవిత్రతకు మరోరూపం. భగవంతుడు హంసరూపాన్ని ఎన్నుకుని వేదాలని ఉపదేశించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. మూడవరోజు ఉదయం సింహవాహనం పై శ్రీవారు తన భక్తులకు దర్శనమిస్తాడు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైన ఈ సింహరూపంలోనే నరసిం హరూపంలో కశిపుడిని సం హరించాడు. అదేరోజున ముత్యపు పందిరి వాహనంపై కూడా ఆ దేవదేవుడు కొలువుదీరి భక్తకోటిని కటాక్షిస్తాడు.
4వ రోజు కల్పవృక్ష, సర్వభూపాల వాహనోత్సవాలు జరుగుతాయి. శ్రీవారు ఆ రోజు నయనాందకర రీతిలో దర్శనం ఇస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులను తరింపచేస్తారు. ఎంతటి ముగ్ధమనోహరరూపం, వర్ణించనలవి కానిది. ఆ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలలో అతి విశిష్టమైన గరుడోత్సవం జరుగుతుంది. గరుడుడు శ్రీవారి ప్రధమ భక్తుడు. శ్రీవారి ఆఙ్ఞ కోసం జాగురూకుడై ఉంటాడు. వేదాలే గరుడుడని శాస్త్రోక్తి. ఆనందనిలయంలో శ్రీ శ్రీనివాసుడు ఉభయదేవేరులతో కూడి బ్రహ్మోత్సవాల 10 రోజులూ తిరుమాడవీధులలో వివిధ వాహనోత్సవాలలో దర్శనమిచ్చి భక్తకోటిని తరింపచేస్తాడు.
ముక్కోటి దేవతలు ఆదృశ్యరూపాలలో శ్రీవారిని సేవిస్తూ, ప్రతీరోజు జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొంటూ, తమ భక్తిని నివేదిస్తారు. మరొక విశేషమేమిటంటే, భక్తుల కోరికలను ఆయా దేవతలు తెలుసుకుని వారే తీరుస్తారు. శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చిన భక్తుల మనోభీష్టాలు తెలుసుకొని తమ విధులద్వారా నిర్ణయించబడిన విధంగా వీలైన కోరికలు తామే తీర్చి, శ్రీనివాసుని ప్రసన్నతకు లోనవుతారు. ఈ విధముగా ఆయా దేవతలు చేయుట కూడా శ్రీనివాసుని ఉద్దేశ్య ప్రేరణ పూరితముగానే అని గ్రహించవలెను. ఆ శ్రీవారి లీలలు చిత్రవిచిత్రములు గదా.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment