పద్మావతీశ్రీనివాసుల వివాహం:
అది విన్న ఆకాశరాజు, ధరణీదేవి, మహదానందంతో బృహస్పతిని రప్పించి, వధూవరుల నక్షత్రాల ప్రకారం తగిన మూహూర్తం పెట్టమని చెప్పిరి. బృహస్పతి ఉత్తరఫల్గునీ నక్షత్రం మంచిదని, వైశాఖమాసంలో వివాహం జరిపించమని చెప్పెను.
ఆకాశరాజు విశ్వకర్మను ఆహ్వానించి పుర అలంకారము అప్పగించెను. కుబేరుడు కోశాగారము నింపెను. అంగరంగ వైభోగముగా కన్యాదానము, మాంగల్యధారణ, హోమాదులను జరిపించిన ఆకాశరాజు, వృషభాద్రికి తన కూతురుని అల్లునితో పంపెను. ఆకాశరాజు ప్రేమాదరాలకు మెచ్చిన శ్రీనివాసుడు వరం కోరుకోమనగా "నీ యందు భక్తిని, ఎల్లపుడూ నీ సేవ చేసుకొను భాగ్యమును నాకనుగ్రహించు" అని కోరెను. శ్రీనివాసుడు, ఆకాశరాజు కోరికెను అనుగ్రహించెను.
తొండమానుని వృత్తాంతం :
బ్రహ్మాండనాయకుడిని 100సంవత్సరాలు అనన్యమైన భక్తితో సేవించిన రంగదాసు తిరిగి, దంపతులైన ,మహారాజు సువీరుడు, నందిని కి తొండమానుడుగా జన్మించాడు. ఇతను విష్ణుభక్తుడు. పాండ్యరాజ పుత్రిక పద్మను వివాహము చేసుకొనెను. ఒకరోజు వెంకటాద్రి సమీపములో వేటకు వెళ్ళాడు, అక్కడ ఒక మదపుటేనుగును చూచి, దానిని పట్టుకొందామని ప్రయత్నములో సువర్ణముఖీ నదిని దాటి చాలదూరం వెళ్ళాడు. తిరిగివచ్చు సమయంలో పంచవర్ణముల కల చిలుకను చూసి, దాని వెంటపడగా, అది "శ్రీనివాసా" అంటూ రివ్వున వేంకటాద్రికి చేరింది. అక్కడ ఉన్న బోయవాడిని అడుగగా, అది శ్రీనివాసుడికి ఇష్టమైన చిలుక అని, దాన్ని ఎవ్వరు పట్టుకోలేరు అని, నేను స్వామి దర్శనానికి వెళ్తున్నానని చెప్పెను". తొండమానుడు అతనితో కలిసి స్వామిని దర్శించుకొన్నాడు. తొండమానుడు శ్రీనివాసుని సేవలో చరితార్ధమైనాడు. శ్రీనివాసుడు ఒకసారి తొండమానుడికి కలలో కనిపించి " ద్వారగోపుర ప్రాకారాలను నీవు కట్టించుము. నీ వంశములో ముందు తరాలలో నారాయణుడు అనువాడు విమానము నిర్మించి, స్వర్ణముతో అలంకరించగలడు" అని సెలవిచ్చెను. ఆ దేవదేవుడి ఆఙ్ఞానుసారం తొండమానుడు ప్రాకారమును నిర్మించి, వైఖానస ఆగమశాస్త్ర ప్రకారము పూజలు చేయించాడు.
ఈ విధముగా వరాహ పురాణములో శ్రీనివాసుని అవతార విశేషాలను, వేంకటాచలములోని అనేక తీర్థాల ప్రాముఖ్యాన్ని, వేంకటేశ్వర వైభవాన్ని ఇల ఎన్నో విషయాలను పొందుపరిచారు.
Subscribe to:
Post Comments (Atom)
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment