Monday, December 12

స్వయంభూ లింగం, మేళ్ళ చెరువు

మేళ్ళ చెరువు ఒక కుగ్రామం. విజయవాడ హైదరాబాద్ రూట్ లో కోదాడకు 23కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీశంభులింగేశ్వర స్వామి స్వయంభూ లింగం. అక్కడ చెప్పుకునే కథను బట్టి స్వామి మొదట వరంగల్లు దగ్గర వెలిసారుట. ఒకకోయ వాడు చూసి ఆవు కొవ్వుతో దీపం వెలిగించి ఆవుతోలుతో తోరణాలు కట్టి పూజ చేసేవాడు. ఆది నచ్చక స్వామి భూమిలోంచి ఈ మేళ్ళ చెరువు వరకూ ఆకారం పెంచి ఇక్కడ వెలిసారు. ఒక ఆవు నిత్యం ఈ లింగం మీద పాలు ధారగా వదిలేదిట. అది చూసి లింగాన్ని తెగ్గొట్టి పారేస్తే మళ్ళీ మొలిచిందని, ఇలా 11 సార్లు జరిగాక, ఒకసారి లింగన్న అనేవాని కలలో స్వామి కనబడి తనజోలికి రాకుండా చూడమని చెప్పారుట. తను వచ్చి లింగం చుట్టూ బాగుచేసి, చిన్న గుడిలా కట్టి పూజ చేసేవాడు.

1230 లో కాకతీయ రాజులు ఆగమశాస్త్ర పద్ధతిలో గుడి కట్టించి నిత్య ధూపదీప నైవేద్యాదులకు కొంత భూమి దానం చేసి ఆప్రకారం శిలాశాసనం చెక్కించారు. ఈ గుడికట్టేముందు ఈ లింగాన్ని తీసి వేరే చోట ప్రతిష్ట చేదామని ప్రయత్నించారు. 75 అడుగుల లోతున తవ్వినా లింగం మొదలు కనపడక, చివరికి వున్నచోటే గుడిని కట్టించారట. ఈ లింగం వరంగల్ నుంచి ఇక్కడవరకూ భూమిలో ఉన్దని కొందరు అన్నారు. ఆతర్వాత గత 72 సంవత్సరాలుగా 12 ఏళ్ళకొక అంగుళం చొప్పున లింగం పెరుగుతూ ఉందని, స్థల పురాణం.

ఈ లింగానికి నెత్తిమీద ఒక రంధ్రం ఉంది. అందులోంచి నిరంతరం పాతాళ గంగ ఊరుతూంటుంది. విశేషం ఏమిటంటే రంధ్రందాటి నీరు పొంగదట. చిన జియ్యరు స్వామి పరిక్షించి అది సత్యం అని ధృవీకరించారని చెబుతారు.

ఈ లింగం వెనుకవైపు పార్వతి ఉన్నారు. అందుకు నిదర్శనంగా లింగం వెనుకవైపున అల్లిన జడలా కనపడుతుంది.

ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ అధీనంలో నడపబడుతోంది. ఆశ్యర్యం ఏంటయ్యా అంటే, ఇంత ప్రసిద్ధమైన స్థలపురాణం గల ఈ ఆలయం చాలామందికి తెలియకపోవడం. ఇది గాక మేళ్ళ చెరువు గ్రామంలో భద్ర కాళీసమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం కూడా ఉంది, దీనిని గురించి ఒక చిత్రమైన కథ వ్యాప్తిలో ఉంది.

500 సంవత్సరాలక్రితం వీరభద్రస్వామి మానవరూపంలో ఈ గ్రామంకు వచ్చి ఉగ్రంగా తాండవం చెసేవాడుట. ఆ సమయంలో ఆయన కాళ్ళక్రిందపడి చాలామంది గాయపడటమో, మరణించడమో జరిగేది. గ్రామస్తులు ఆయనను గొలుసులతో ఒక స్తంబానికి కట్టేసారని, మర్నాడు ఉదయం చూసేసరికి నిజరూపంతో నృత్యభంగిమలో గొలుసులతో సహా శిలగా మారిపోయాదని చెప్తారు. నడుంచుట్టూ రాతి గొలుసులు, ఆయన పాదాలు ఎడంగా నాట్యభంగిమలో ఉంటాయి. అప్పటికి గాని తాము కట్టింది వీరభద్రస్వామినని గ్రామస్తులకు తెలియలేదుట. ఆతర్వాత కాకతీయ రాజులు గుడికట్టించి నిత్య ధూపదీప నైవేద్యాలు ఏర్పాటుచేసారని చెప్తారు.

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

Rajendra said...

How can we take a print? It is not supporting for save.

Regards
Rahendra Kumar Gurrala
rajendra.gurrala@gmail.com

గాయత్రి said...

i think its not support to print in this template. which post u want to take a print out? let me know..