పుష్యమాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే ఏకాదశే వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అనికూడా పిలుస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది ఈ వైకుంఠ ఏకాదశి. ఈ రోజున వైకుంఠంలో మూడుకోట్ల దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించి సేవించుకుంటారు. అందువలన దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో ఏదాదికి 4మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. అవి, అనంతపద్మనాభవ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి ద్వాదశి రోజున, నాల్గవది రధసప్తమి నాటి మధ్యాహ్నం. ఇందులో వైకుంఠ ఏకాదశి నాడు జరిగే చక్రస్నానంలో ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్ధాలు సూక్ష్మరూపంలో స్వామి పుష్కరిణిలో దర్శనం ఇస్తాయి.
దేవాలయాలలో మామూలు రోజుల్లో ఉత్తరద్వారాలు మూసివుంచుతారు. ముక్కోటి ఏకాదశినాడు మాత్రమే ఈ ద్వారాలు తెరుస్తారు. భక్తులు సూర్యోదయానికి ముందే లేచి స్నానసంధ్యాదులుముగించుకొని ఉత్తరద్వారం ద్వారా దేవాలయంలోకి వెళ్ళి దైవదర్శనం చేసుకొంటారు. ఈరోజున దైవదర్శనం చేసుకుంటే ఆపరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని భక్తుల నమ్మిక. భద్రాచలంలోనూ, తిరుమలలోనూ తదితర వైష్ణవదేవాలయాల్లో ఈ ఉత్తరద్వార దర్శనం విశేషంగా జరుగుతుంది.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బంగారు వాకిలిలో జేగంటలున్న ప్రదేశానికి ఎడమప్రక్కగా ముక్కోటి ప్రదిక్షణం అని వ్రాసి వుంటుంది. దేవాలయంలో మూలవిరాట్టుకి చుట్టూరావున్న నాలుగువైపుల గోడలకి సరిగ్గా సమాంతరంగా మరోప్రాకారం వుంది. ఆ నాలుగు గోడలకీ, ఈనాలుగు గోడలకీ మధ్యవున్న ప్రదిక్షణాకారపు త్రోవనే ముక్కోటి ప్రదిక్షణం అంటారు. ముక్కోటి ఏకాదశిరోజున దేవాలయంలోని కి ప్రవేశించి ఈ ప్రదిక్షణ చేసి భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారని నమ్మిక.
ఏకాదశి రోజున అన్నం ముట్టకూడదు . బ్రహ్మ తల నుండి ఒక స్వేద బిందువు నేల మీద పది వెంటనే రాక్షశ రూపం దాల్చింది . "ఓ బ్రహ్మదేవ నాకు నివాస స్థానం చూపించు " అని ప్రార్ధించగా , ఏకాదశి నాడు మానవుల చేత భుజించబడే అన్నం ద్వారా వారి కడుపులో స్థావరం ఏర్పర్చుకో అని బ్రహ్మ ఆదేశించాడు . అందుకే ఈరోజు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. పద్మ పురాణం ప్రకారం , విష్ణువు యొక్క శక్తి ముర అనే దానవుడిని సంహరించి దేవతలకు రక్షణ కల్పిచింది. సంతృప్తుడైన మహావిష్ణువు ఆ శక్తి కి " ఏకాదశి " అని నామకరణం చేసారు . ఎవరైతే ప్రతీ సంవత్సరం, ముర ని సంహరించిన రోజున ఏకాదశిని పూజిస్తారో వారు వైకుంటానికి చేరుతారని అభయం ఇచ్చాడు.
Subscribe to:
Post Comments (Atom)
1 వినదగు నెవ్వరు చెప్పిన..:
Thanks for the post
?!
Post a Comment