తిరుమలలో శ్రీవెంకటేశ్వరునికి జరిగే నిత్య సేవల గురించి మనం వినే ఉంటాం. ప్రతీ ఒక్కరు అన్నింటీని చూడలేకపోయినా, కనీసం చూసినవారి ద్వారా అయినా లేక పుస్తకాల ద్వారా అయినా తెల్సుకుని ఉంటారు.
నిత్యసేవల గురించి పూర్తి వివరణతో ఇటీవల(2012లో) తి.తి.దే. వారు విడుదల చేసిన " గోవిందం - పరమానందం" పుస్తకం బాగుంది. సేవల గురించిన వివరణ చాలా చక్కగా అందించారు. తి.తి.దే వారు అందించిన సేవల వివరాలను నేను ఇక్కడ అందిస్తున్నాను.
కౌసల్యా సుప్రజా రామ | పూర్వాసంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ట నరశార్దూల | కర్తవ్యం దైవ మాహ్నికం||
తరతరాలుగా, హైందవ జాతిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర శ్రీవేంకటేశ్వరస్తవం ఈ సుప్రభాతం. 29శ్లోకములున్న సుప్రభాతాన్ని, 11శ్లోకాలున్న స్తోత్రాన్ని, 16శ్లోకాలున్న ప్రపత్తిని, 14శ్లోకాలున్న మంగళాశాసనాన్ని, 15వ శతాబ్దంలో మనవాళ మహాముని శిష్యులైన ప్రతివాదభయంకరాణ్ణన్ స్వామి రచించారు. వీరి అసలు పేరు హస్తిగిరినాధన్. ఈ దివ్యగానాన్ని ఎక్కడ విన్నా, మనస్సు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటుంది. అలౌకికాననందంతో, శ్రీవారి సామీప్య సాన్నిధ్యాన్ని అనుభవిస్తుంది. అంతటి మహత్తు కలిగిన ఈ సుప్రభాత గీతాన్ని, తిరుమలలో సుప్రభాత సేవ జరిగే విధానాన్ని గురించి తెలుసుకుందాం.
ప్రతిరోజూ బ్రాహ్మిముహుర్తాన (తెల్లవారుఝాము 2.30-3.00 గంటల మధ్య) తిరుమల ఆలయంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. అ సమయంలో సన్నిధిగొల్ల స్నానాదికాలు పూర్తిచేసుకుని, తిరునామం ధరించి, దివిటీ పట్టుకుని, తిరుమల ఉత్తర మాడవీధిలోని అర్చకుల ఇంటికి వెళతాడు. శ్రీవారి కైంకర్యపరులైన వైఖానస అర్చకులు అప్పటికే స్నానసంధ్యావందనాది అనుష్టానాలను పుర్తిచేసుకుని సిద్ధంగా ఉంటారు.
సన్నిధిగొల్ల వారికి నమస్కరించి, వారిని శ్రీవారి ఆలయానికి ఆహ్వానిస్తాడు. వారు శ్రీవారి బంగారువాకిలిని తెరిచే పరికరమైన కుంచెకోల అనే కొడవలి వంటి ఇనుపకొక్కీని భుజంపై పెట్టుకుని, తాళంచెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధిగొల్లను అనుసరిస్తారు.
ఇలా అర్చకస్వాములు మహద్వారం వద్దకు చేరగానే నగారామండపంలో పెద్ద పలకగంట (నౌబత్ఖానా)ను హెచ్చరికగా మ్రొగిస్తారు. ఆఘంటానాదంతో మహాద్వారం తెరువబడుతుంది. సన్నిధిగొల్లను అనుసరిస్తున్న అర్చకులు ప్రధానద్వార దేవతలకు మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయప్రవేశం చేస్తారు. వారివద్ద ఉన్న కుంచెకోలను, తాళంచెవులను, ధ్వజస్తంభం వద్ద ఉన్న క్షేత్రపాలకశిలకు భక్తితో తాకించి, నమస్కరించి, ద్వజస్తంభానికి ప్రదక్షిణగా వెండివాకిలిని దాటి బంగారువాకిలి ముందు మౌనంగా స్వామివార్ని ధ్యానం చేస్తూంటారు.
వారిని అక్కడవదిలి, సన్నిధిగొల్ల మరల శ్రీవారి సన్నిధివీధిలోని బేడి ఆంజనేయస్వామిగుడివద్ద ఉన్న శ్రీమాన్ పెద్దజియ్యంగార్ మఠానికి వస్తాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న జియ్యంగారిని, లేదా వారి పరిచారకుడైన ఏకాంగినీ ఆహ్వానించి ఆలయానికి వెంటబెట్టుకుని వస్తాడు. ఆ సమయానికి ఆలయ అధికారి, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు, బంగారు వాకిళ్ల ముందు నిలిచిఉంటారు. అలాగే తాళ్లపాక అన్నమయ్య వంశీయులొకరు తంబుర చేత ధరించి, మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీతరుసుమును చెల్లించిన భక్తులు బంగారువాకిలి ముందుకు అనుమతిస్తారు.
ఆర్చకులు, జియ్యంగార్, ఆలయ అధికారులు, వేదపండితులు, తాళ్లపాకవారు, సన్నిధిగొల్ల, సుప్రభాతసేవా భక్తులు వీళ్లందరి సమక్షంలో అర్చకులు తమదగ్గర ఉన్న కుంచెకోలతో బంగారువాకిలికి గల చిన్న రంధ్రం ద్వార లోపల వేసిఉన్న గడియను తీస్తారు. తరువాత గడియకు వేయబడిన తాళాన్ని అర్చకులు తమవద్ద ఉన్న తాళాలతో తీస్తారు. అటు తరువాత సన్నిధిగొల్ల పేష్కారు దగ్గర గల సీలువేసిన చిన్నసంచిలో ఉన్న తాళంచెవులతో, సీలువేయబడిఉన్న మూడు పెద్దతాళాలను అందరికీ చూపించి తీస్తాడు.
బంగారు వాకిలి తెరుచుకుని సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోనికి ప్రవేశిస్స్తారు. మరుక్షణం శ్రీహరి అర్చకులు మధురస్వరమో "కౌసల్యా సుప్రజా రామా" అంటూ సుప్రభాతాన్ని ఆలపిస్తూ బంగారువాకిలిలోకి ప్రవేశిస్తారు. ఏకాంగి, మహంతుమఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్లెరాన్ని అందుకుని లోనికి వెళ్ళుతారు. బంగారువాకిళ్ళు దగ్గరకు మూయబడుతాయి.
బంగారు వాకిలి ముందు ఉన్న వేదపండితులు, అర్చకులు ప్రారంభించిన సుప్రభాతగీతాన్ని అందుకుని శ్రుతిశుభగంగా ఆలపిస్తారు. స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తైన తరువాత, అన్నమయ్య వంశీయులు బంగారువాకిలి ముందు నిలబడి, అన్నమయ్య రచించిన ఒక మేలుకొలుపు కీర్తనను భూపాలరాగంలో గానం చేస్తారు.
సుప్రభాతంలో శ్రుతికలిపి, అన్నమయ్య మేలుకొలుపు పాటను ఆలకిస్తూ, భక్తిప్రపత్తులతో మైమరిచి ఉన్న భక్తులు బంగారు వాకిళను ఎప్పుడు తెరుస్తారో, శ్రీవారి దివ్యమంగళరూపం ఎప్పుడు దర్శిస్తామో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేచిఉంటారు.
బంగారువాకిలిని దగ్గరగా మూసిన సన్నిధిగొల్ల వద్ద ఉన్న దివిటివెలుగులో, అర్చకులు రాములవారిమేడకు వేసిఉన్న తలుపు తాళాలను తీసి, శయనమండపంలో పానుపుపై ఉన్న భోగశ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు. దివిటెతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగొల్ల, కులశేఖరపడి వద్ద నిలచి, ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలిదర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి అర్చకస్వాములు, ఏకాంగి, కులశేఖరపడి దాటి లోపలకు ప్రవేశిస్తారు.
గొల్లచేతిలో ఉన్న దివిటీని అందుకుని ఏకాంగి సన్నిధి లోని దీపాలను వెలిగించగా, సన్నిధిగొల్ల రాములవారి మేడలోని దీపాలను వెలిగిస్తాడు. తరువాత అర్చకులు శ్రీవారికి పాదనమస్కారం చెసి, శయనమండపంలో బంగారు పట్టుపరుపు పై పవళించి ఉన్న భోగశ్రీనివాసమూర్తిని సమీపించి, నమస్కరించి, చప్పట్లు చరిచి, మేల్కొనవలసిందిగా ప్రార్ధిస్తారు. అంతట భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మూలమూర్తి సన్నిధిలో వేంపుచేవు చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment