Sunday, July 15

ఆది శంకరలు, భజగోవిందం (2)

11. మాకురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం
మాయామయమిద మఖిలం హిత్వా

బ్రహ్మపరం త్వం ప్రవిశ విదిత్వా


నీకు ధనముంది. నీవారున్నారు. యౌవనంలో ఉన్నానని గర్వపడకు. ఇవన్నీ కాలగతిలో హరించిపోతాయి. అంతా మాయయే. అందుకే బ్రహ్మపదాన్ని పొంది తరించు.
డబ్బు ఉంటే చాలు ఎన్ని ఆనందాలైనా అందుకోవచ్చు అనే తలంపు కేవలం మూర్ఖత్వమే. ధనబలం కాక జనబలం ఉన్నదని మిడిసిపడకూడదు. యౌవన బలగర్వం అసలు ఉండకూడదు. ఈ దృశ్య ప్రపంచం పరిణామశీలం. ప్రపంచవాసనల భ్రాంతిలో బ్రతకటం వ్యర్ధం. సర్వ ప్రపంచం అంతటా పరమాత్మ యొక్క చైతన్య తేజస్సు వ్యర్ధం. సర్వ ప్రపంచం అంతటా పరమాత్మ యొక్క చైతన్య తేజస్సు నిండి ఉందనే గ్రహింపు కలగాలి. అప్పుడే బ్రహ్మపదం చేరాలనే తపన మొదలై, అదే తపస్సవుతుంది. పరమాత్మ ప్రసాదితమైన ఈ శరీరం, శరీరంలోని అణువణువు, ఆయన కైంకర్యానికై వినియోగించడం మన కర్తవ్యం. ఆ నిత్య సాధనే శాశ్వతానందాన్నిచ్చే బ్రహ్మపదానికి చేరుస్తుంది.

12. దినయామిన్యౌ సాయంప్రాతః
శిశిర వసన్తే పునరా యాతః

కాలః క్రీడతిగచ్ఛ త్యాయుః

తదపినముంచ త్యాశా వాయుః


పగలు రాత్రి, ఉదయం అస్తమయం, శిశిరం వసంతం వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. కాలం ఆటలాడుతుంటే, జీవితం జీర్ణించి పోతుంటుంది. అది తెలిసినా మనిషి ఆశను వదలలేకపోతున్నాడు.


కాలం అనంతం. కాల పరిభ్రమణంలో మనందరం కేవలం కాలం యాత్రికులం. ఎన్ని జన్మలు గడిచాయో, ఇంకెన్ని జన్మలు గడవాలో చెప్పలేం. అనంతం. కాల పరిభ్రమణంలో మనం నీటిబొట్లం. ప్రస్తుత జీవితకాలం క్షణభంగురం. అది అందరికీ తెలుసు. అయినా మనలోని ఆశ ఆకాశమంత. అదే మాయ. ఆ మాయకు లోబడి కర్త, కర్మ అన్నీ మనమే నన్న అహంకారం మనల్ని ముంచేస్తుంది. ఈ జన్మలో మనం అనుభవించే సుఖదుఃఖాలు ప్రారబ్ధ కర్మానుభవాలు. అందుకే తప్పనిసరైన కర్మలను అనుభవిస్తూనే జన్మరాహిత్యానికై ప్రయత్నం చేయాలి. వివేకం, విచక్షణ చేయగల మనస్సు మనకు పరమాత్మ ప్రసాదించిన వరం.. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుని, దైవసాన్నిధ్యాన్ని కాక, దైవంలో ఐక్యం కావటానికి కృషిచేయాలి. అప్పుడే చరించగలం.

13. కాతే కాన్తా ధనగత చిన్తా

వాతుల కింతపనాస్తి నియన్తా

త్రిజగతి సజ్జన సంగతి రేకా
భవతి భవార్ణవ తరణే నౌకా


కాంతా కనకాల కోసం ఎందుకు విలపించడం. ధర్మాన్ని రక్షించి, పాలించే నియంత లేడనుకున్నావా! మూడు లోకాల్లోనూ సజ్జన సాంగత్య మొకటే భవసాగరాన్ని దాటించే నావ.

పరమాత్మ మనిషికి మనస్సు. బుద్ధి ఎందుకిచ్చాడు? తానెవరో తెలిసికోవడానికి, కాని మనిషి అవివేకంతో, బలహీనమైన మనోబుద్ధులతో ధనదారాసుతుల కోసం చింతిస్తూ, శ్రమిస్తూ బ్రతుకును, కాలాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాడు. జగత్తు, జగత్తులోని జీవులు అంతా అశాశ్వతమని తెలిసినా, మాయామోహాంధకారంలో మునిగిన మనిషి తప్పుదారి పడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో విచక్షణతో ఏమాత్రం ఆలోచించగలిగినా మనిషిని మంచి మార్గానికి మళ్ళించగలిగేది సజ్జన సాంగత్యం. సాధు సత్పురుషుల సేవ మనిషిలో మంచిని పెంచి, దైవీ గుణాలను వెలికి తెస్తుంది. ఈ సంసారం ఒక సాగరం. ఎన్ని జన్మలెత్తినా, సంసారం అనే సముద్రంలో అవధి కనిపించక, పరిధీ తెలియక జీవుడు తపించ వలసిందే. అందుకే సంసార జలధిని దాటడానికి సజ్జనుడనే నౌక కావాలి. ఆ సజ్జనుడే సద్గురువై మన చేయి పట్టి ముక్తివైపు నడిపిస్తాడు


14. జటిలో ముండీలుంచిత కేశః

కాషాయాంబర బహుకృత వేషః

పశ్యన్నపిచ నపశ్యతి మూఢోః

హ్యదర నిమిత్తో బహుకృత వేషః


జడలు ధరించి, గుండు గీయించుకుని, జుట్టు విప్పుకుని, కాషాయబట్టలు ధరించి, ఎందరో తిరుగుతుంటారు. వారు కేవలం పొట్టకూటికోసం వేషాలు ధరించినవారు.


నిజానికి సన్యాసమనేది మోక్షసాధనే, కానీ సన్యసించటం అంటే అందరినీ విడిచి వెళ్ళటం కాదు. అందరిమీద ఉన్న మమకారం జయించడం. బాహ్యానికి సర్వసంగపరిత్యాగిలా కనపడినా అంతరంగంలో పరిత్యాగభావన లేకపోతే ప్రయోజనం లేదు. మనోవాక్కాయ కర్మలా, త్రికరణ శుద్ధిగా సన్యాస జీవితం గడపాలి. కామక్రోధాదులను నిగ్రహించినవాడే నిజమైన సన్యాసి. చక్షురేంద్రియాలను నియంత్రించగలిగిన వాడే నిజమైన సన్యాసి. ఆత్మనాత్మ వివేకంతో, సత్యాసత్య విచక్షణతో పరిపూర్ణమైన వైరాగ్యం సాధించినవాడే నిజమైన సన్యాసి. బాహ్యవేషాడంబరాల కన్నా, అంతరంగ పరిణతి, అంతర్యాగ నిరతి ముఖ్యం. సన్యసించకుండానే, సంసారంలో ఉంటూనే, ధర్మనిరతితో ధన్యులైన మహాపురుషులు ఎందరో!


15. అంగం గళితం ఫలితం ముండం
దశన విహీనం జాతం తుండమ్

వృద్ధోయాతి గృహీత్వా దండం

తదపిన ముంచ త్యాశాపిండమ్

శరీరం శిష్కించింది. తల నెరసిపోయింది. పళ్ళు ఊడిపోయాయి. ముసలితనం పైబడింది. మూడో కాలుగా కర్ర వచ్చింది. కానీ కోరికలు మాత్రం వదలడం లేదు. బాల్య, యౌవన, కౌమార దశలను వృధాగా గడిపి వృద్ధాప్యంలో శక్తి ఉడిగి, చింతించే వారెందరో! ఆ దశలో ఆశలు చెలరేగితే ఇంద్రియాలు ఏవీ సహకరించవు. సత్సంగం, సద్గ్రంధ పఠనం , సదాచారం పాటించడం వల్ల దానథర్మ నిరతుడై, నిత్యా నిత్య వివేక జ్ఞానం కలుగుతుంది. ఇంకా వయసెంతో ఉంది. దైవచింతనకి, బ్రహ్మానందానుభవానికి చాలా సమయముంది. అని భావించడం నిజమైన అజ్ఞానం. పరమాత్మ కూడా శాసించలేనికి కాలం మాత్రమే. మరుక్షణం ఏం జరుగబోతోంది అనేది మానవ మేథస్సుకు అతీతం. కాలానికి అవిశ్రాంతమైన పయనం. అందుకే సమయం సానుకూలంగా ఉండగానే సదుపయోగం చేసుకుని, ఆధ్యాత్మిక పరిణతికై సాధన చేయడం ధర్మం.


16. అగ్రేవహ్నిః పృష్టేభానూ

రాత్రౌచుబుక సమర్పిత జానుః
కరతల భిక్షిస్తరుతలవాస
స్తదపిన ముంచత్యాశా పాశః

అగ్నిముందు కూర్చున్నా, సూర్యుని వేడికి నిలబడినా, చలికి ముడుచుకుని పడుకొని, భిక్షమెత్తుకుని, చెట్టుకింద నివశిస్తున్నా మనిషిలో ఆశ చావదు. ప్రతివాడూ ఆనందంగా బతకాలనుకోవడం సహజం. కానీ ఆ ఆనందతత్త్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడు. ప్రయత్నించడం కూడా ఎంతో కష్టమనుకుంటాడు. కోరికలు ఆకాశాన్నంటుతాయి. ఆ కోరికలు తీరడానికి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా లభిస్తుంది? అందుకే శరీరంలో పటుత్వం ఉండగానే సాధన చేయాలి. మనస్సుని మెల్లమెల్లగా కోరికల వలయం నుండి తప్పించి, అద్భుతమైన ఆత్మానందాన్ని అనుభవించేలా సాధన చెయ్యాలి. మనస్సులో కలిగే సంకల్పాలే కోరికలకి పునాదులు. ఆ పునాదుల్లో కూరుకుని పోకుండా ఉండాలంటే ముందు మనస్సు సంకల్పరహితం కావాలి. సంకల్పరహితం కావాలంటే, మనస్సును ప్రలోభపెట్టే ఆలోచనలని, ఆశలని నిగ్రహించాలి. ఇది సాధకుని సాధనలో మొదటి మెట్టు.

17. కురుతే గంగా సాగర గమనం

వ్రతపరిపాలన మథవాదానం
జ్ఞాన విహీనః సర్వమతేన
ముక్తిం నభజతి జన్మశతేన

మనిషి గంగలో మునిగినా, వ్రతాలు, దానధర్మాలు చేసినా, జ్ఞానం పొందకుండా ఎన్ని జన్మలెత్తినా ముక్తిపొందలేడు. ఆత్మ స్వయం ప్రకాశం. ఆత్మ జ్ఞానంలోనే పరమశాంతి ఉంది. ప్రకాశించే సూర్యుని మేఘం మూసేసినట్లు, ఆత్మని అజ్ఞానం అంతంచేసి, జ్ఞానం పొందాలంటే ఎంతో సాధన అవసరం. ముందు బాహ్యేంద్రియాలను, ఆపై అంతరింద్రియాలను కట్టుదిట్టం చేసి, మనోచిత్తాలను లయం చేసి, భగవద్ధర్శనాభిలాషతో చేసే సాధన చాలా ముఖ్యం. శాస్త్రాలు చదివినంత మాత్రాన జన్మరాహిత్యం దొరకదు. స్వధర్మాచరణతో, బంధవిముక్తుడై విరక్తుడై చేసే సాధన తప్పక మోక్షాన్నిస్తుంది.

18. సురమందిర తరుమూల నివాసః

శయ్యాభూతల మజినం వాసః
సర్వపరిగ్రహ భోగత్యాగం

కన్య సుఖం నకరోతి విరాగః

దేవాలయాలు దర్శించి, చెట్ల కింద నివశించి, మృగచర్మాన్ని చుట్తుకుని, నేలమీద పడుకున్నంత మాత్రాన వైరాగ్యం కలుగదు. భోగాలను త్యజించి, సర్వం త్యాగం చేస్తే, వైరాగ్యం ఎందుకు కలుగదు.

19. యోగ రతేవా భోగరతేవా

సంగర తోవా సంగ విహీనః

యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి వందత్యేవ

యోగాన్ని అనుష్టించవచ్చు. భోగాలను అనుభవించవచ్చు. జనుల మధ్య నివశింపవచ్చు. లేదా ఏకాంతంగా ఉండనూ వచ్చు. ఇన్ని చేసినా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ బ్రహ్మలో లీనం అయి ఉంటుందో వారే ఆనందమయులు.

ఆనందమే తానైన ఆత్మ జ్ఞానికి సర్వం శివమయం. ఆత్మవిష్ణుని దృష్టి ఎల్లవేళలా పరమాత్మపైన ఉంటుంది. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమని నిర్వహించినవాడు అంతా అద్వైత ఆనందమే. అప్పుడే బహిరంతరాలలో పవిత్రత ఏర్పడుతుంది. పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. పవిత్రమైన మనస్సే పరమేశ్వరునికి ఆలయమై, జీవదేవ భ్రాంతి నశించి జన్మరాహిత్యం పొందవచ్చు.


20. భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవకణికాపీతా
సకృదపిమేన మురారి సమర్చా
క్రియతే తస్యయ మేనన చర్చా

భగవద్గీతను కొంచెమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కైనా త్రాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా ఎవరు పూజిస్తారో, వారికి యమునితో వివాదమే ఉండదు.


భగవద్గీత పరమ పవిత్రమైనది. సాక్షాత్ పరమాత్మ వాక్కు. మోక్షగామి అయిన మనిషి ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? తరించే మార్గమేది? వివరంగా చెప్పబడింది. మానవాళి మనుగడపై మహితాత్ముడైన పురుషోత్తమునికున్న ఆదరణ భగవద్గీత తెలుపుతోంది. గీతాపారాయణం మనిషిలో అజ్ఞానం దూరం చేసి స్థితప్రజ్ఞుని చేస్తుంది. లోకపావని గంగ, ధాత్రిని పవిత్రం చేస్తుంది. గంగ ఒడ్డునే వేదం పుట్టిందంటారు. నిత్యం వేద మంత్రోచ్ఛారణ జరుగుతుంటుంది. ఎందరో మహాత్ములు తపస్సు చేసి తరించారు. అటువంటి నిర్మలజలం ఒక్క చుక్క మన నోట పడినా చాలు జన్మ ధన్యం. నిత్యం మురాంతకుడైన మురళీధరుని పూజించాలి. మోక్ష ప్రదాత అయిన పరమాత్మని స్తుతించడం మనిషి ధర్మం. స్తుతులకు లొంగని వారుంటారా?


అందులో కరుణాళుడైన పరమాత్మ! అయితే పూజలు కానీ, స్తుతులు కానీ అనన్య చింతనతో చేయాలి. అప్పుడే జీవాత్మ అవ్యయుడై, అద్వైత భావన ప్రబలమై మృత్యుభయం వీడి తరిస్తుంది.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: