Tuesday, May 10

వామనావతారం

అన్నీ అవతారాలలోకి వామనావతారం విశిష్టమైనదిగా చెప్పవచ్చు. అప్పటివరకూ సృష్టిలోని జీవరాసులన్నిటియందూ తనను తాను ప్రతిష్టించుకొన్న ఆ శ్రీహరి ప్రధమంగా మానవావతారాన్ని ధరించిన రూపమే వామనావతారం. అమృతపానం చేసిన దేవతలు రాక్షసులతో యుధ్ధం చేసి ఎంతో మందిని సంహరించారు. మరెందరినో ఓడించారు. ప్రహ్లాదుని మనుమడు వరోచనుడు. ఆ వరోచనుని కుమారుడు బలి. గురువైన శుక్రాచార్యుల వారు బలి చేత 'విశ్వజిత్ 'అనే యాగం చేయించాడు. రాక్షసులకీ బలమూ, తేజస్సు, లభించిది. యుధ్ధ పరికరాలన్నిటినీ పొందిన బలి, దానవ సైన్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇంద్రుని మీదకు యుధ్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడి రాజధానిని బలి చక్రవర్తి ఆక్రమించాడు. అదితి తన కుమారులైన దేవతలు సర్వ సంపదలూ కోల్పోయి బాధపడుతుంటే కుమిలిపోయింది. కశ్యపుడు అదితికి ధైర్యం చెప్తూ, " మాఘమాసంలో అమావాస్య గడిచిన తెల్లవారుజామున ఫాల్గుణ శుక్లపక్షం ప్రారంభం అవుతుంది. శుక్లపక్ష ప్రధమదివసాన తెల్లవారుజామునే వాసుదేవుడిని స్తుతించాలి " అని వ్రతమును ఉపదేసిస్తాడు.

వ్రత ఫలితంగా మహావిష్ణు వరం వలన అదితి గర్భవతి ఐనది.
భాద్రపద శుద్ద ద్వాదశి నాడు శ్రవణానక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో ఆ శ్రీమహావిష్ణువు, వామన అవతారం లో ఈ భూమిమీద అవతరించాడు.

ఉపనయన సమయమున సవిత్రుడు గాయత్రిని భోదించాడు. బృహస్పతి బ్రహ్మ సూత్రాలను, సోముడు దండాన్ని, భూమి కృష్ణాజినాన్ని, దివస్సు చ్చత్రాన్ని, తండ్రి కశ్యపుడు మేఖలను, తల్లి అదితి కౌపీనాన్ని, కుబేరుడు భిక్షాపాత్ర, సరస్వతి జపమాల, సప్తౠషులు కుశలను ఇచ్చారు. ఉపనయనం తరువాత అదితి సంతతి మేలు కోసం బలిచక్రవర్తి దగ్గరకు బయలుదేరాడు.

వామనుడు బలిచక్రవర్తిని 3అడుగుల నేలను దానంగా ఇవ్వమని అడిగాడు. బలి చక్రవర్తి పక్కనే ఉన్న గురువు శుక్రాచార్యులు వామనుడు సామాన్యుడు కాదని గ్రహించి, దానం ఇవ్వొద్దు అని బలి ని వారిస్తాడు. అంతరార్ధం తెలియని బలి దానం ఇవ్వడానికి సిద్దపడి, కమండలం నుండి నీరుని వదులుతున్న సమయంలో శుక్రాచర్యుడు ఒక చిన్న పురుగు రూపంలో ఆ కమండలం నుండి నీరు బైటకు రాకుండా అడ్డుపడుతాడు. ఒక్క చిన్న దర్భ తో ఆ శ్రీమహావిష్ణువు అడ్డుని తొలగిస్తాడు. అలా దానం ఇవ్వడంలో ఆటంకం తొలిగించాడు. మొదటి అడుగు తో ఈ భూమండలాన్ని, రెండవ అడుగుతో ఆకాశాన్ని పూర్తిచేసాడు. ఇక ఒక్కడుగు మిగిలి ఉంది చోటు ఏది అని బలిని అడుగగా, సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే వామన రూపంలో వచ్చాడని తెలుసుకొన్న బలి తన శిరస్సుపై మూడవ అడుగు పెట్టమని శిరస్సు వంచి అభివాదం చేసాడు. వామనడు తన మూడవ అడుగును బలి శిరస్సుపై పెట్టి పాతాళానికి అణచివేసాడు.

" ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై "

0 వినదగు నెవ్వరు చెప్పిన..: