సాక్షాత్ ఆది శంకర స్వరూపులు, ఆదిశంకరులు కారణజన్ములు. మానవజన్మ దుర్లభం. కానీ అవిద్య కారణంగా మోహాపాశాలతో, బంధనాలతో, ఉత్తమమైన జన్మని వ్యర్ధం చేసుకుంటున్నాడు మానవుడు. మన జన్మాంతర పుణ్య విశేశంగా, మానవాళికి ముక్తిమార్గాన్ని నిర్దేశిస్తూ, ఎన్నో స్త్రోత్రాలు, వేదాల సారాన్నంతా సంక్షిప్తపరుస్తూ, ప్రభోదాత్మకమైన ఉపదేశ గ్రంధాలు, ఆధ్యాత్మిక తత్త్వాన్ని వివరిస్తూ వ్రాసి మానవాళికి మహోపకారం చేశారు శ్రీ శంకరులు.
మానవ జన్మ నెత్తిన ప్రతి జీవిలో అంతర్గతంగా ప్రకాశించేది సచ్చిదానందమయుని తేజం, అదే ఆత్మచైతన్య పరమాత్మ. పరమాత్మని అన్వేషించడానికి మూడు మార్గాలు నిర్దేశించాయి వేదాలు. అవే భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలు. ఈ మూడు మార్గాల్లో, ఏదైనా ఒకదానిలో ప్రయాణించి, పరమాత్మని చేరుకోవాలనుకునే సాధకుడు ముందుగా సాధించవలసింది మనో నిర్మలత, నిశ్చలత, బుద్ధి శుద్దత, స్థిరత. స్థితప్రజ్ఞత్వం సాధించి కైవల్య సోపానాలను దాటి, దేవదేవునిలో లీనం కావాలంటే, జన్మరాహిత్యాన్ని పొందాలంటే ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి? అని స్పష్టంగా ప్రబోధాత్మకంగా ‘భజగోవిందం’ శ్లోకాల్లో వివరించారు ఆదిశంకరులు. అంతేకాదు మానవ జన్మయొక్క విలక్షణత్వం వివరిస్తూ, జన్మాంతర పుణ్యఫలంగా లభించిన జన్మని వ్యర్దం చేసుకోవద్దని, ఆత్మతత్వావగాహనపై మనసు నిలిపి, సాధించి తరించమని ఉద్భోదించారు.
‘భజగోవిందమ్’ శ్లోకాల్లో ‘12 శ్లోకాలు మాత్రమే శ్రీ శంకరుల రచన అనీ, మిగిలినవి వారి ఆదేశంతో శిష్యులు వ్రాసినవనీ అంటారు. భజగోవిందం శ్లోకాలని అంతా కాకపోయినా, కొంతయినా అర్ధం చేసుకుంటే ధన్యులం
1. భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే, కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే
ఓ ముర్ఖుడా! గోవిందుని భజింపుము, మరణకాలము ఆసన్నమైనపుడు, ఏ వ్యాకరణ సూత్రాలూ రక్షింపవు.
మరణమనేది పుట్టిన ప్రతి జీవికి అనివార్యం. జన్మ, జరా, మరణాలు అందరూ అనుభవించవలసినదే. ఈషణత్రయానికి లోబడిన మనిషి, తాను, తనవారు తనవి అన్నీ శాశ్వతమనే నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరణం తర్వాత మనతో ఏదీ రాదనే సత్యం అందరికీ తెలుసు. క్షణం సేపు ఈ విషయాన్ని మనసులో గుర్తుకు చేసుకున్నా, మరుక్షణం మాయకు లోబడి, నేను, నాది అనే బంధానికి బద్ధుడౌతున్నాడు. మనిషిగా పుట్టినందుకు, పరమాత్మకు కృతజ్ఞులమై, మరణ సమయంలో, భగవన్నామ స్మరణతో కన్నుమూస్తే జన్మ ధన్యం.
2. మూడ జహేహి ధనాగమ తృష్ణాం
కురు సుద్భుద్ధిం మనసి వితృష్ణాం
యల్లభసే నిజకర్మొపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం
మూఢుడా ! ధనార్జనకు జీవితకాలాన్ని వ్యర్ధం చేయకు. ధనం అగ్నితో సమానం. ఎంతవర్కు ప్రాప్తమో అంతవకేనని సంతృప్తిపడి, ఆర్జించిన ధనంతో పుణ్యకార్యాలు నిర్వహించు..
జీవజాలంలో మనిషే ఉత్తముడు. అందుకే సద్భుద్ధి అలవరచుకోవాలి. బాహ్య శరీర శుద్ధి కాదు ముఖ్యం. అంతఃశుద్ధి తప్పించి, పరమాత్మవైపు పరుగులు తీయించాలి. మాయలో పుట్టి మాయలో పెరిగినా, ఆ మాయని దాటటమే మనిషి కర్తవ్యం. డబ్బు సంపాదించాలి, కానీ మితిమీరిన ఆశతో అదే ధ్యేయంగా బతకకూడదు. ఆర్జించిన ధనం కొంతవరకైనా ధర్మ కార్యనిర్వహణకు వెచ్చిస్తే పొందే సంతృప్తి వర్ణించలేము. ఈ ఆనందాన్నిచ్చే దైవాన్ని మరచిపోరాదు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో భగవదార్పణగా చేస్తే లభించే ఫలితం అమోఘం. నిత్యం అవసానకాలంలో కూడా మనోచిత్తాలు పరమాత్మ నామస్మరణలో లీనమై ఉంటాయి. జన్మ చరితార్ధమవుతుంది
3.నళినీ దళగత జలమతి తరళం
తద్వత్ జీవిత మతిశయ చపలం
విద్ది వ్యాద్యభిమాగగ్రస్థం
లోకం శోకహతంచ సమస్తమ్ || భ||
తామరాకు మీద నీటి బొట్టు నిలవదు. అట్లాగే ఈ జీవితం కూడా క్షణికం. జీవితం చంచలం. ప్రపంచం రోగాలతో, అభిమానాలతో, శోకాలతో నిండి ఉంది.
తామరాకు మీద నీటి బొట్టు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. కానీ ఏ కొద్దిపాటి గాలి వీచినా జారిపోతుంది. మానవుని జీవితం అంతే. అనంతమైన కాలంలో మనిషి జీవితకాలం క్షణం. ఆ క్షణమాత్రానికే అహంకార మమకారాలతో మనిషి, మహిషియై పతనమవటం ఎంతవరకు సమంజసం. ఒక్క క్షణం ఆలోచించి, కాలం విలువ గ్రహిస్తే, పరతత్త్వ విచారణతో బ్రతుకు ధన్యమవుతుంది. ఈ లోకం శోకమయం. నశ్వరమైన శరీరం రోగాలకు నిలయం. సంసారం విషవలయం. బ్రతుకు భారం నుండి బయటపడాలంటే రోజులో కొద్ది సమయమైనా దైవచింతనకై వెచ్చించి, పుణ్యాత్ములమై, ధన్యాత్ములమై, దైవానుగ్రహం పొంది తరించాలి. ఇదే శ్రీ శంకరుల ఆదేశం.
4. నారీస్తన భర నాభి నివేశం
దృష్ట్యామాగా మోహావేశం
ఏ తన్మాంస వసాది వికారం
మనసి విచిన్తయ వారం వారమ్ ||భ||
యువతుల స్తనభారమును, నాభి ప్రదేశాన్ని చూసి మోహావేశాలకు లోనుకావద్దు. ఆ అందమంతా కేవలం మాంస నిర్మితం. తాత్కాలికం.
పై పై అంశాలు చూసి భ్రమపడకూడాదు. వికారాలకు లోనుకాగూడదు. ఆత్మ సౌందర్యాన్ని దర్శించగలగాలి. అందానికే అందం, ఆ అంతర్యామి సౌందర్యం. అలైకికమైన ఆనందాన్నిచ్చే, ఆ అద్భుతమైన అందాన్ని ఆరాధించి, అనంతాత్మకుడైన పరమాత్మే, మనలోని ఆత్మ అని తెలిసుకోవాలి. అవ్యక్తుడైన అనంతునిలో లీనమయే క్షణం కోసం ఎదురుచూడాలి. దేహం అశాశ్వతమని తెలుసు. బాహ్య సౌందర్యం అనిశ్చితమని తెలుసు. ఈ రోజు ఉన్నాం. రేపేమౌతామో అనే ఆలోచిస్తాం. కానీ మరుక్షణం మాయకు లోబడి వ్యామోహానికి బానిసలమై, సత్యాన్ని విస్మరిస్తున్నాం. అదే వద్దంటున్నారు భగవత్పాదులు. వారి ఉద్భోధను అర్ధం చేసుకుని ఆచరించటం మన కర్తవ్యం.
ఈ ప్రభోదం కేవలం పురుషులకే కాదు, స్త్రీలకు వర్తించేట్లు తెలుపారు శ్రీ శంకరులు,
5. యావద్విత్తోపార్జన సక్తః
యావన్ని జ పరివారోరక్తః
పశ్చాజ్జీవిత జర్జర దేహే
వార్తాకోపి సపృఛ్ఛతిగేహే ||భ||
నీవు ధనాన్ని ఆర్జించినంతకాలం నీ వారనుకున్న వారందరు అడుగులకు మడుగులొత్తుతారు. వృద్ధాప్యంలో, శరీరంలో శక్తి తగ్గినప్పుడు ఇంట్లో వాళ్ళే నిన్ను నిందిస్తారు.
ఉత్తమోత్తమమైన మానవజన్మ సార్ధకం చేసుకోవటం మనిషి బాధ్యత. శరీరంలో శక్తి ఉన్నప్పుడే ధ్యాన అనుష్టానాలతో పరతత్త్వాన్ని తెలుసుకోవాలి. సద్గురువు నాశ్రయించి, కాలాన్ని సత్యాన్వేషణకై వెచ్చించాలి. ఆధ్యాత్మిక సంపద నార్జించి, బ్రహ్మతత్త్వావగాహనకై గోవిందుని చరణాల నాశ్రయించాలి. బెల్లం కొద్దీ చీమలు అనే నానుడి అక్షర సత్యం. ధనం మూలం ఇదం జగత్.. అన్నట్లు మన దగ్గర డబ్బు దండిగా ఉన్నప్పుడు అందరూ నందిమాగధులే చుట్టూ చేరి భజించేవారే. ఆ డబ్బే లేకపోతే అందరికీ లోకువే. మనవారనుకున్న వారి నిర్లక్ష్యం, నిరసన అనుభవించి, ఆవేదన పడటం అవసరమా? సత్యాసత్య వివేక జ్ఞానంతో, విచక్షణతో నిత్యుడు, సత్యుడైన సర్వాంతర్యామిని మనసా వాచా కర్మణా కొలిస్తే అంతా శాంతే. సర్వం ప్రశాంతతే.
6. యావత్ పవనో నివసతి దేహే
తావత్ పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయో దేహాపాయే
భార్యాభిభ్యతి తస్మిన్ కాయే || భ||
ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నీ వారనుకున్న వారు కుశలం అడుగుతారు. ప్రాణంపోయిన శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది.
మరణానంతరం మనిషి శరీరం ఎందుకూ పనికిరాదు. ఈ విషయంలో మనిషి కంటే పశుపక్ష్యాదులే ఎంతో గొప్పవి. వాటి మృత దేహాలు ఏదో విధంగా మనిషికి ఉపయోగపడుతున్నాయి. పంజరం లోంచి పక్షి ఎగిరిపోయే పంజరం ఎందుకు? దేహం లోంచి ప్రాణం పక్షి లాగా ఎగిరిపోతే మృత దేహం ఎవరికీ అక్కరలేదు. ప్రాణం పోయిన మరుక్షణం మనవాళ్ళే మృత దేహాన్ని, అదే శరీరాన్ని ఎప్పుడెప్పుడు బయటపడేద్దామా అని చూస్తారు. ప్రాణం ఉన్నప్పుడు అపురూపంగా, ముద్దుగా చూసిన వారే ప్రాణం లేని కట్టెని కాల్చేస్తారు. అందుకే ఆత్మజ్యోతిని వెలిగించి, సర్వేంద్రియాలను సంగమించి, తురీయానం దానుభూతిని పొంది ముక్తిని కాదు, జీవన్ముక్తిని సాధించమంటున్నారు ఆదిశంకరులు.
7. బాలస్తావత్ క్రీడాపక్తః తరుణస్తావత్
తరుణీ సక్తః వృధ్దాస్తావత్
చిన్తాసక్తః
పరే బ్రహ్మణికో పినకస్తః ||భ||
బాల్యం అంతా ఆటపాటలతో గడిచిపోతుంది. యౌవనం ఇంద్రియ విషయం లోలత్వంతో గడిచిపోతుంది. వృద్ధాప్యం చింతలతో చిక్కుకుని పోతుంది. అందుకే పరంబ్రహ్మపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
ప్రయాణానికి ఒక గమ్యం ఉన్నట్లే, జీవన యానానికీ ఒక గమ్యం తప్పనిసరిగా ఉండాలి. ఆ గమ్యం పరమాత్మ దర్శనం, స్పర్శనం కావాలి. లేదా ముక్తి కావాలి. అందుకే విలువైన ఆయువును వృధా కానీక, మహితాత్ముల అడుగు జాడలలో నడచి ఆత్మ దర్శన భాగ్యాన్ని పొందాలి. దర్మయుక్తంగా చతుర్విధ ఆశ్రమ ధర్మాలను పాటించి కైవల్యాన్ని సాధించాలి.
అతి తక్కువైన వయస్సులో చిన్నతనం ఆటపాటలతో గడిచిపోతే , యుక్త వయస్సులో చినతనం ఆటపాటలతో గడిచిపోతే, యుక్త వయస్సు సంసార బంధంలో తల మునకలయిపోతుంది. ముసలితనం చింతలకు నిలయమై, చితిని చేరుస్తుంది. అందుకే ఆశ్రమ ధర్మాలను పరిమితంగా, యుక్తి యుక్తమ్గా నిర్వహిస్తే మనస్సు, చిత్తం ఎల్లవేళలా పరమత్మకు కైంకర్యం అవుతాయి. నియమితం కాని అతి మనిషిని చాంచల్యానికి గురిచేస్తుంది. ఆ స్థితిలో పరబ్రహ్మైక్యం ఎట్లా సాధ్యం!
8. కాతే కాన్తా కస్తే పుత్రః
సంసారో యమ తీవ విచిత్రః
కష్యత్వం కః కుత ఆయాతః
తత్వం చిన్తయ తదిహభ్రాతః ||భ||
నీ భార్య ఎవరు? పుత్రులెవరు? బహు చిత్రమైనది ఈ సంసారం. నీ వెవరివాడవు? ఎక్కడి నుండి వచ్చావు. సోదరా! తత్వచింతన చేయి,.
ఈ సంసారం ఒక ఘోర జనారణ్యమ్. మాయా ప్రపంచం శాశ్వతమని భ్రమసి మనిషి నా భార్య, నా పిల్లలు అని పాకులాడతారు. ఇవన్నీ అశాశ్వతం. ఆత్మ ఒక్కటే శాశ్వతం. అది పురాతనం, అమరం. ‘ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయః అన్నట్లు భార్య, పుత్రులు, బంధువులు అందరూ మనతో ఋణానుబంధంగా ముడిపడి ఉంటారు. జన్మతః పవిత్రుడు, జ్ఞాని అయిన జీవి, కాలంతో పాటు పెరిగి పెద్దవాడైన కొద్దీ మాయకు లోబడి, అజ్ఞానంలో, తాను శాశ్వతుడని తననుభవించే ఆనందాలు శాశ్వతమనీ, భ్రమపడి, విలువైన కాలాన్ని పరమాత్మ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఎల్లప్పుడూ గోవిందుని భజించి తరించమని హెచ్చరిస్తున్నారు శ్రీ శంకరులు.
9. సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలత్వం
నిశ్చలతత్త్వై జీవన్ముక్తిః
సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది.
భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.
ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.
10. వయసి గతేకః కామ వికారః
శుష్కే నీరేకః కాసారః
క్రీణే విత్తేకః పరివారో
జ్ఞాతే తత్త్వైకః సంసారః
వయస్సుడిగితే వ్యామోహమెక్కడుంటుంది! నీరు ఇంకితే చెరువు ఎక్కడుంటుంది! సిరిసంపదలు పోతే బంధువర్గం ఎక్కడ? తత్త్వజ్ఞానం సిద్ధించిన మోహానికి గురై దారి తప్పుతుంది. ఈ పరిస్థితికి కారణం వయసు. వయసు కలలాంటిది. చెరువులో నీరుంటే కప్పలు మొదలైన జీవాలు పుష్కలంగా చేరతాయి. ఆ నీరు ఇంకిపోతే ఏవీ ఉండవు. నిజం చెప్పాలంటే ఈ శరీరం ఒక్ చెరువు. ప్రాణంపోతే దేహమే ఉండదు. అందుకని, వయస్సుని సద్వినియోగం చేసుకుని, నిరంతరం భగవన్నామస్మరణ చేయాలి. ఐహిక సంపద సంచలనం, ఆ ధనం ఉన్నంతవరకే మనవారని జనం చుట్టూ చేరతారు. ఆ ధనమే పోతే ఎవరూ మిగలరు. అదే ఆధ్యాత్మిక సంపదైతే, పోగొట్టుకుంటామేమోనన్న భయమే ఉండదు. పవిత్రత, ఆధ్యాత్మికత్వం మన సంపదౌతే అన్నీ ఆనందాలే.
Subscribe to:
Post Comments (Atom)
1 వినదగు నెవ్వరు చెప్పిన..:
ontariga vintunnappudu entha bhaaguntayo andi, ee slokalu
Post a Comment