శివారాధనను భక్తులు తమకు ఇష్టమైన రీతిలో వివిధరకాలుగా చేస్తారు. ఈ విధంగానే చేయాలి అనే నియమము లేదు. అందులో ఎటువంటి తప్పు లేదు. శివుడు భక్తవశంకరుడు. భక్తులు ఏ విధంగా పిలిచినా, ఆరాదించినా పలుకుతాడు. శివపంచాక్షరిని జపానుష్టాను పద్దతి ద్వార చేయుట మొదటి పద్దతి. మహన్యాస విధానం ద్వార చేయుట రెండవ పద్దతి. రుద్రాభిషేకము ద్వార శివారాధన చేయుట మూడవ పద్దతి.
పంచాక్షరిలోని 5 అక్షరములు పంచభూతములకు ప్రతీకలు. శివపంచాక్షరీ మంత్రము 5 కోణములు కల నక్షత్రముగా వర్ణించబడినది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటిరకము కాగా, భోగభాగ్యములు ఇచ్చు మంత్రము రెండవరకము. పంచాక్షరిలోని 5 అక్షరములునూ వాటి వాటి తత్వములను సాధన చేయువారికి 5 రంగులలో 5 తత్వములు దర్శనమిచ్చును. 1. తెల్లటి ముత్యము వంటి పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము 2. పగడము వంటి అరుణకాంతి. 3. పసుపుపచ్చని బంగారుకంతి 4. నీలవర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి 5. శుద్ధధవళ కాంతి. భ్రూమద్యములో 5 రంగుల జ్యోతి ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా చెప్పినారు. విష్ణువు కు సహస్రనామమనిన ప్రీతి, గణపతికి మోదకములన్న ప్రీతి, సూర్యభగవానునికి నమస్కారములంటె ఇష్టము, చంద్రుడికి ఆర్ఘ్యం ప్రీతి, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును.
బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు, భవిష్యత్ సృష్టికోసం ప్రతీ జాతి అంటే సమస్త జీవరాసులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశమునందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్రజలములను, నదీజలములను పోసెను. గాయత్రీమంత్రముతో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవాహింపచేసెను. దీనినే పూర్ణకుంభం అంటారు. ఈ పూర్ణకుంభంలోని అమృతమునే భూమిపైకి నిరంతరంగా మహర్షులు అభిషేకించారు. ఆ అభిషేకము కైలాశగిరి వద్ద జరుపుటచే అది పరమపవిత్ర స్థానమైనది. శ్రావణపూర్ణిమనాడు అమర్నాధ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతిసహజంగా ఏర్పడును.
ఆ పూర్ణకుంభం బోర్లించగా అందునుండి ఇద్దరు మహామునులు అవతరించారు. మొదటివాడైన వశిష్టుడు తెల్లని తేజస్సుతో ఉండగా, రెండవ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు. పూర్ణకుంభమున అమృతజలముతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేసిన మంచిది. ఏకాదశ రుద్రులకు, వైష్ణవ పరమైన ఏకాదశీ తిధికి సన్నిహిత సంబంధము ఉండుట వలన, శివకేశవులు ఒకరే అని గుర్తించవలెను.
ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో మన ఇంటిలో రుద్రాభిషేకం చేయించడం మంచిది.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment