Monday, July 25

శ్రీవిష్ణు సహస్రనామ ఫలస్తుతి

ఫలస్తుతిః

1. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః
నామ్నాం సహస్రం దివ్యానా మశేషేణ ప్రకీర్తితం

ఇట్లు మహాత్ముడైన కేశవుని యొక్క దివ్యములైన సహస్రనామములు సమగ్రముగా చెప్పబడినవి

2. య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్
నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః

ఏ మానవుడు నిత్యము ఈ స్తోత్రమును వినునో, కీర్తించునో అతను ఇహ, పర లోకములందు కూడా ఏ కొద్ది అశుభము కూడా పొందడు

3. వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్
వైశ్యో ధన సమృద్ధః స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్

ఈ స్తోత్రమును బ్రాహ్మణుడు చదివినచో వేదాంతాది ఙ్ఞానము, క్షత్రియుడు చదివినచో విజయము, వైశ్యుడు చదివినచో ధనసమృద్ధి, శూద్రుడు చదివినచో సుఖమును పొందును.

4. ధర్మార్ధీ ప్రాప్నుయాత్ ధర్మ మర్ధార్ధీ చార్ధ మాప్నుయాత్
కామా నవాప్నుయాత్ కామి ప్రజార్ధీ ప్రాప్నుయాత్ ప్రజాం

ధర్మమును కోరువాడు ధర్మమును పొందును, అర్ధమును కోరువాడు అర్ధమును, కామి, కామములను పొందును, సంతానమును కోరువాడు సంతానమును పొందును.

5. భక్తిమాన్ య స్సదోత్ఠాయ శుచి స్తద్గత మానసః
సహస్రం వాసుదేవస్య నామ్నామేత త్ప్రకీర్తయేత్

భక్తి కలవాడు నిత్యము వేకువనే నిద్రలేచి, సుచిగా, విష్ణువు మీద మనస్సు నిలిపి వాసుదేవుని యొక్క ఈ వెయ్యి నామములను పఠింపవలెను

6. యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్య మేవచ
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయ శ్చాప్నో త్యునుత్తమం

అట్టి భక్తుడు విపులమైన కీర్తిని పొందును. ప్రాధాన్యమును వహించును.అచంచలమైన సంపదను, అనుత్తమైన శ్రేయస్సును పొందును.

7. న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి
భవ త్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః

ఎప్పుడునూ, ఎచ్చటను భయమును పొందడు, వీర్యమును, తేజస్సును పొందును, రోగరహితుడిగా, తేజము, రూపము, బలము, గుణములతో కూడిన వాడగును.

8. రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్
భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః

రోగార్తుడు రోగమునుండి, బద్ధుడు బంధనము నుండి, భయార్తుడు భయమునుండి, ఆపదలో ఉన్నవాడు ఆపదలనుండి ముక్తులగును.

9. దుర్గా ణ్యతితరత్యాశు పురుషుః పురుషోత్తమం
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః

విష్ణునామ సహస్రమును భక్తి సమన్వితుడై ప్రతినిత్యము స్తోత్రము చేయు పురుషుడు వెంటనే కష్టములను దాటును.

10. వాసుదేవాశ్రయో మర్త్యో వాసు దేవపరాయణః
సర్వ పాప విశుద్ధత్మా యాతి బ్రహ్మ సనాతనం

వాసుదేవుని ఆశ్రయించిన, వాసుదేవునే సర్వశ్రేష్ఠునిగా భావించిన మానవుడు, సర్వపాపముల నుండి విశుద్ధమైన ఆత్మ కలవాడై సనాతనమైన ధర్మపధమును చేరును.

11. న వాసుదేవభక్తానా మశుభం విద్యతే క్వచిత్
జన్మ మృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే

వాసుదేవుని భక్తులకు ఎక్కడను అశుభం ఉండదు, జన్మ, మృత్యువు, ముసలితనము వ్యాధుల వలన వచ్చు భయము కలుగనే కలుగదు

12. ఇమం స్తవ మధీయానః శ్రధాభక్తి సమన్వితః
యుజేతాత్మా సుఖక్షాంతి శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః

శ్రద్ధాభక్తులతో కూడినవాడై ఈ స్తవమును చదివినవాడు సుఖము, క్షాంతి, సంపద, స్మృతి, కీర్తులతో కూడిన వాడగును.

13. న్యక్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతిః
భవంతి కృతపుణ్యనాం భక్తానాం పురుషోత్తమే

పుణ్యము చేసిన భక్తులకు పురుషోత్తముని యందు కోపము, మాత్సర్యము, లోభము, అశుభమైన మతి ( చెడు అలోచనలు లాంటివి) కలుగవు

14. ద్యౌః సచంద్రార్క నక్షత్రం ఖం దిసో భూర్మహోదధిః
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః

మహాత్ముడైన వాసుదేవుని యొక్క వీర్యము చే ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, స్వర్గము, దిక్కులు, భూమి, సముద్రము ధరింపబడుచున్నవి

15. ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం
జగ ద్వశే వర్త తేదం కృష్ణస్య సచరాచరం

దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, ఉరగులు, రాక్షసులతో కూడిన చరాచరమైన ఈ జగత్తయంతయు కృష్ణుని యొక్క వశమునందుండును

16. ఇంద్రియాణి మనోబుద్ధిః సత్వం తేజో బలం ధృతిః
వాసుదేవాత్మకా న్యాహుః క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవచ

ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, సత్వము, తేజస్సు, బలము, ధైర్యము, క్షేత్రము, క్షేత్రఙ్ఞుడు అనునవి వాసుదేవాత్మకములు అని అంటారు

17. సర్వాగమానా మాచారః ప్రధమం పరికల్ప్యతే
ఆచరః ప్రధమో ధర్మో ధర్మస్య ప్రభు రచ్యుతః

అన్ని ఆగములకు ముందుగా ఆచారము ముఖ్యమైనదిగా చెప్పబడినది. కనుకనే ఆచారమే ప్రధానమైన కర్మ. అట్టి ధర్మమునకు అదిపతి అచ్యుతుడు

18. ఋషయః పితరో దేవాః మహాభూతాని ధాతవః
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం

ఋషులు, పితృదేవతలు, దేవతలు,, పృధివ్యాధి మహాభూతములు, సప్తధాతువులు మొదలైనవి, జంగమ స్థావరాత్మకము ఐన ఈ జగత్తు నారాయణుని నుండి ఉద్భవించినది

19. యోగో ఙ్ఞానం తధా సాంఖ్యం విద్యాః శిల్పాది కర్మచ
వేదా శ్శాస్త్రాణి విఙ్ఞాన మేతత్సర్వం జనార్దనాత్

యోగము, ఙ్ఞానము, సాంఖ్యము, విద్యలు, శిల్పాది కళలు, వేదములు, శాస్త్రములు, విఙ్ఞానము ఇవ్వన్నియు జనార్దనుని నుండే వచ్చును.

20. ఏకో విష్ణుః మహద్ భూతం పృధక్ భూతా న్యనేకశః
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుజ్త్కే విశ్వ భుగవ్యయ

విష్ణువు ఒక్కడే మహాద్భూతము. అతనే పలుమార్లు వేరు వేరు జీవులుగా మారి, ముల్లోకముల యందు వ్యాపించి, భూతాత్మ అయి, వ్యయము లేనివాడిగా, విశ్వమును భుజించుచు, అనుభవించుచు ఉండును

21. ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితం
పఠేద్య ఇచ్చేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ

ఏ పురుషుడు శ్రేయస్సును, సుఖమును పొందగోరునో అతను వ్యాసమహర్షి చే కీర్తించబడిన విష్ణువు యొక్క ఈ స్తోత్రమును పఠింపవలెను

22. విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభవావ్యయం
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవం

విశ్వేశ్వరుడును, పుట్టుక లేనివాడును, జగత్తు యొక్క సృష్టికి/నాశనమునకు కారణుడును, తామర పువ్వుల వంటి కన్నులు కలవాడును అగు శ్రీ మహా విష్ణువును ఎవరు భజింతురో వారు పరాభవమును పొందరు

అర్జున ఉవాచ :

23. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ
భక్తానా మనురక్తానాం త్రాతా భవజనార్దన

పద్మపత్రముల వలె విశాలమైన కన్నులు కలవాడా, పద్మమును నాభి యందు కలవాడా, సురోత్తముడా, ఓ జనార్దనుడా, నీ మీద అనురాగము కలిగిన భక్తులకు నీవు రక్షకుడవు కమ్ము

శ్రీ భగవానువాచ:

24. యో మాం నామ సహస్రేణ స్తొతు మిచ్చతి పాండవ
సోహ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః

" స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి "

ఓ పాండవుడా (అర్జునుడు) ఎవడు నన్ను ఈ సహస్రనామ స్తోత్రముతో స్తుతింప గోరునో అతనిచే నెను ఒకే ఒక శ్లోకమును చదువుటచే స్తుతింపబడిన వాడను అగుదును. అందుకు సందేహం అక్కరలేదు

వ్యాస ఉవాచ:

25. వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం
సర్వభూతనివాసో సి వాసుదేవ నమో స్తుతే

" శ్రీ వాసుదేవ నమో స్తుత ఓం నమ ఇతి "

3లోకములు వాసుదేవుని యొక్క సంబంధం వలన వాసిగాంచుచ్చున్నవి. ఓ వాసుదేవుడా, నీవు సర్వ భూతములకు నివాస స్థానుడవు. నీకు నా నమస్కారము.

పార్వత్యువాచా :

26. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండి తైర్నిత్యం శ్రోతుమిచ్చా మ్యహం ప్రభో

విష్ణు సహస్రనామము తేలికగా పండితులచే నిత్యము ఏ ఉపాయముచె పఠింపబడునో దానిని నెను వినగోరుచున్నాను.
ఓ ప్రభు, సెలవియ్యుము..

ఈశ్వర ఉవాచ :

27. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

" శ్రీ రామనామ వరానన ఓమ్నమ ఇతి "

ఓ సుముఖీ, " శ్రీరామ రామ రామ" అను మంత్రము జపించినచో అది సహస్రనామ పారాయణతో సమానమైన ఫలమును ఇచ్చును.

బ్రహ్మోవాచ :

28. నమో స్త్వనంతాయ సహస్ర మూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరు బాహువే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటీ యుగ ధారిణే నమః

సహస్ర మూర్తులు కలవాడును, సహస్ర పాదములు, సహస్రాక్షులు, సహస్ర శిరస్సులు, సహస్ర బాహువులు, సహస్ర నామములు కలవాడును, సహస్రకోటి యుగములను ధరించినవాడును, శాశ్వతుడైన పురుషుడగు వాడును అగు అనంతునకు నా నమస్కారము

సంజయ ఉవాచ :

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధరుర్ధరః
తత్ర శ్రీ ర్విజయో భూతి ర్ర్ధువా నీతి ర్మతి ర్మమ

ఎచ్చట యోగేశ్వరుడైన కృష్ణుడును, ధనుర్ధారి ఐన అర్జునుడు ఉందురో అచ్చట శ్రీ, విజయము, భగవదైశ్వర్యము, నీతి తప్పక ఉండును అని నా ఉద్దేశ్యము.

శ్రీ భగవానువాచ :

అనన్యా శ్చితయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహం

ఇతర విషయములను విడిచివైచి, ఎవరు నన్నే ఏకాగ్రముగా ధ్యానించునో అట్టివారియొక్క యోగ క్షేమములను నేను వహింతును.

పరిత్రాణాయా సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే

సాధువులను రక్షించుటకును, దుష్కార్యములు చేయువారిని నశింపచేయుటకును, ధర్మమును స్థాపించుటుకు యుగ యుగములందును నే అవతరించుదును

ఆర్తా విషణ్ణాఆ శిధిలాశ్చ భీతాః
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః
సంకీర్త్త్య నారాయణ శబ్ధమాత్రం
విముక్త దుఃఖాః సుఖినో భవంతి

ఆర్తులను, దుఖితులను, శారీరకముగాను, మానసికంగాను చితికిపోయినవారిని, భయార్తులకు, ఘోరమైన వ్యాధులచే పీడింపబడువారిను నారాయణుని పేరును తలచినంతనే వారు దుఖ విముక్తులై సుఖమును పొందుదురు.

కాయేన వాచా మనసేంద్రియై ర్వా
బుద్ధ్యత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణా యేతి సమర్పయామి.

శరీరము, మాట, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, ఆత్మ, ప్రకృతి సిద్ధమైన స్వభావముచే ఏయే పనులను నేను చేయుచున్నానో వాని ఫలము నంతటిని పరుడగు నారాయణునకే సమర్పించుచున్నాను.

1 వినదగు నెవ్వరు చెప్పిన..:

చెప్పాలంటే...... said...

chaalaa chakkagaa ardhaalu chepparu thanks andi