ప్రతి తెలుగు మాసాలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఒకటి శుక్లపక్షంలోను మరొకటి కృష్ణపక్షంలోను వస్తాయి. చాలామంది అనాదిగా ఈరెండు ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు వెళ్ళకుండా భోజనం చెయ్యడం అనుశృతంగా పాటిస్తున్న ఆచారం. దీనినే ద్వాదశి పారణ అని కూడా అంటారు. ద్వాదశి పారణకు ఒక అతిథికి తమతో బాటు భోజనం పెట్టడం, మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం కూడా పాటిస్తూంటారు. ఇలా ఏడాదిపొడుగునా సుమారు ఇరవైనాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యరిత్యా శరీరానికి చాలా మంచిదని, ఆవిధంగా జీర్ణకోశానికి విశ్రాంతి ఇవ్వడం వల్ల అనేక రుగ్మతలు రాకుండా కాపాడుకోవచ్చునని వైద్యపరంగా నమ్మకం.
అధ్యాత్మికంగా ఈ ఏకాదశి ఉపవాస దీక్ష శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతిపాత్రమైనదని, వారిని శ్రీహరి సదా కాపాడుతాడని కూడా నమ్మిక. అయితే ఇలా ఇరవైనాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండడం చాలామందికి కుదరకపోవచ్చు. కొందరైతే ఉపవాసం ఉండలేకపోవచ్చు. మరి వారికేమిటి తరుణోపాయం? ఇదే సందేహం ఒకసారి భీమునికి కలిగింది. శ్రీకృష్ణుడు భీముణ్ణి ఏకాదశి ఉపవాశ దీక్ష పట్టమని సలహా ఇచ్చినప్పుడు భీముడు "బావా! అసలే నేను వృకోదరుణ్ణి. ఆకలికి ఉండలేను. అలాంటి నన్ను ఉపవాసం ఉండమంటే ఉండగలనా? ఏదైనా తరుణోపాయం వుందా" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో "బావా వృకోదరా! చింతించకు. ఏడాది పొడుగునా ఏకాదశి దీక్ష పట్టలేని వారు జ్యేష్ట శుద్ధ ఏకాదశినాడు నిర్జల ఉపవాసం చేస్తే సంవత్సరమంతా అన్ని ఏకాదశుల దీక్ష పట్టిన ఫలితం దక్కుతుంది. కాని ఆఒక్కరోజు మంచినీరైనా ముట్టకూడదు" అని తరుణోపాయం శలవిచ్చాడుట.
Sunday, May 27
Subscribe to:
Posts (Atom)