Friday, June 29

దక్షిణాయనం (జూలై 16 నుండి )

సంవత్సరమునకు రెండు ఆయనములు. ఉత్తరాయణం, దక్షిణాయనము.

నవగ్రహములకు, రాశులకు అధిపతి ఐన సూర్యభగవానుడు ఒక్కో రాశిలో ప్రవేశించుటను సంక్రమణం అంటారు. తెలుగు మాసములలో మాసమునకొక సంక్రమణము జరుగుతుంది. కాగా మకర రాశిలో భానుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయణము, కర్కాటకరాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయనము అంటారు.

సంక్రమణానికి సంక్రాంతి అని కూడ అర్ధం ఉంది. ఏడాదికి 12 సంక్రమణములు వస్తాయి. వీటిలో మకరసంక్రాంతి మత్రమే ఘనంగా జరుపుకుంటారు. దక్షిణాయనములోని పండుగలలో గురుపౌర్ణిమ, శ్రీకృష్ణాష్టమి, మంగళగౌరి వ్రతం, వినాయకచవితి, శరన్నవరాత్రులు, దీపావళి, అనంతపద్మనాభ చతుర్ధశి, సుబ్రహ్మణ్య షష్టి, ముక్కోటి వంటి పండుగలు, మాసములలో ఆషాఢము, శ్రావణము, ఆశ్వీయుజము, కార్తీకము, మార్గశిరము ప్రాధానములైనవి. ఈ దక్షిణాయాములో వర్ష, శరత్ ౠతువులు పూర్తికాలము ఉండగా, గ్రీష్మ హేమంత ౠతువులు నెలపాటు కాలమే ఉంటాయి.

ఈ ఆయనములో వర్ష, శరత్, హేమంత ఋతువులు ఆహ్లాదకరమైనవి. వర్షఋతువు ద్వార పృధ్వి పులకరించి, శరత్, హేమంత ౠతువుల ద్వార చల్లదన్నాన్ని ఇస్తుంది. ఈ ఆయనములోనే మన రాష్ట్రంలో వ్యవసాయం సాగుతుంది. ఈ ఆరుమాసాలలో సెప్టెంబరు వరకు సాగే నైరుతి ఋతుపవనముల ద్వారా సాధారణ వర్షపాతం నమోదవుతుండగా, అక్టోబరు నుండి బలంగా ఉండే ఈశాన్య ఋతుపవనాల ద్వారా తుఫానులు ఏర్పడి, జలాశయములు నిండుటకు ఉపయోగపడుతాయి.విద్యాలయాలలో సైతం ఈ నెలలలోనే విద్యాబోధన ఎక్కువగా సాగుతుంది. కృష్ణా, గోదావరి నదులకు 12సంవత్సరాలకొకసారి వచ్చే పుష్కరాలు ఈ దక్షిణాయనములోనే.

Thursday, June 28

తొలి ఏకాదశి

ప్రధమైకాదశి అను సంసంస్కృత పదాన్ని, తెలుగు వారు తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. చాతుర్మాస్యదీక్షాదినాల ఏకాదశుల్లో మొదటిది కావడంచే దీనికి ప్రధమైకాదశి అను పేరు వచ్చింది. బ్రహ్మ వైవర్తపురాణంలో దీనిని గురించిన వివరణ ఉంది. ప్రాయకంగా ఇది నిష్ఠాపరులకు ఉపవాసదినం. చాతుర్మాస్యవ్రతానికి ఆరంభం. ఈరోజునుండి 4నెలలు పురాణాలు పఠిస్తారు. విష్ణువుకి అత్యంత ప్రియమైనది. విష్ణు సంబంధంగా 2 గాధలు ఉన్నాయి. మొదటిది : ఈరోజు మొదలు విష్ణుమూర్తి 4నెలలు పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీకశుద్ధ ఏకాదశికి వెనక్కి తిరిగి వస్తాడని చెప్తారు. రెండవది : ఈరోజు నుండి, విష్ణువు 4నెలలపాటు క్షీరసముద్రంలో శేషశాయి గా పడుకొని, కార్తీకశుద్ధ ఏకాదశికి మేలుకొంటాడని పురాణాలు చెప్తున్నాయి.

రెండవ గాధ ప్రకారం, ఈ పండుగకు దేవశయని అనే పేరు పురాణాలు పేర్కొంటున్నాయి. గదాధరపద్ధతి దీనిని హరిశయనం అంటున్నది. ఈ సందర్భంలోనే దీనికి శయనైకాదశి అనే పేరు వచ్చింది. విష్ణు ఆలయాల్లో ఈరోజు రాత్రి విష్ణు శయనవ్రతాలు చేస్తారు. నారాయణుడిని ఆభరణాదులతో అలంకరించి జాజి పువ్వులతో పూజిస్తారు, పవళింపుసేవ చేస్తారు. చంద్రభాగానదీ తీరాన ఉన్న పండరీపురంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆషాడమాస శుక్లపక్ష ఏకాదశినాడు ఉపవాసం ఉండి చాతుర్మాస వ్రతకల్పం ప్రారంభించాలని, భగవంతుడు యుధిష్ఠురునకు చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో కలదు. శయనింప పెట్తిన విష్ణువుకు పూజ చాతుర్మాస్య వ్రతం మొదలకొని, ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, అష్టమి, కర్కాటక సంక్రాంతి మొదలగు పర్వాలనాడు ఉపవాసాలు ఉంటూ కార్తీక శుక్ల ద్వాదశికి ఆవ్రతం పూర్తిచేజాలి.

Thursday, June 14

శ్రీకృష్ణుని జననం గురించి కొన్ని అంశాలు (2)

మహాభారతంలో మౌసలపర్వం ఆధారంగా తేలే విషయం ఏమిటంటే, పరీక్షిత్తు పట్టాభిషేకం జరిగిన 36ఏళ్ళకి పూర్వమే “మహాభారత సంగ్రామం” జరిగింది. అదే సంవత్సరంలోఒక విశేషం జ్యోతిశ్శాస్త్ర రీత్యా సంభవించింది. ఒకే రోజులో మూడు తిధులు వచ్చాయి. రోజు ప్రారంభంలో త్రయోదశి ఉండి, అదే రోజు చివరికి అమావాస్య. ఇలా కొన్ని వందల సంవత్సరాలకి కాని సాధారణంగా సంభవించదు. ఇది జరిగినప్పుడు భయంకర యుద్ధాలు గాని, జననష్టం గాని జరగవచ్చు.

36 సంవత్సరాల తరువాత అంటే, శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన సంవత్సరంలోనూ ఇదే విపరీతం చూసి శ్రీకృష్ణుడు యాదవుల వినాశనాన్ని, రానున్న కలియుగాన్ని మహాభారతంలో తెలిపినట్లు కొన్ని శ్లోకాలు స్పష్టీకరిస్తున్నాయి.
అలాగే, భీష్మ నిర్యాణం శోభాకృత నామ సంవత్సరం. శుక్రవారం, రోహిణి నక్షత్రం, తృతీయ పాదం పగలు 2ఝాములకు జరిగింది.

మహాభారతం మొదలైన 67వ రోజు భీష్మ నిర్యాణం జరిగింది. అనగా కలి పూర్వం 36 వ సంవత్సరం (3138 బి.సి). ఆ సంవత్సరంలోనే ధర్మరాజు భారతవర్ష చక్రవర్తిగా పటాభిషిక్తుడయ్యాడు. ధర్మరాజు రాజ్యకాలం 64ఏళ్ళు. కలిపూర్వం 36సంవత్సరాలు..

ఈ ఆధారాలను బట్టి చూస్తే ఈ అంశాలన్ని సరిపోయే సంవత్సరం, నెల, తేది, ఖగోళ రీత్య లెక్కకట్టవచ్చు
ఇలా గణించి చూసినట్లైతే, శ్రీకృష్ణుడు జన్మించిన తేది 19.జూలై.3228 బి.సి(ఇప్పటి క్యాలెండర్ ప్రకారం) అని తెలుస్తుంది. తిధుల ప్రకారం ఆ రోజు అంటే జూలై 19, 3228 బి.సి నాటికి శ్రీముఖ నామ సంవత్సరం నడుస్తోంది. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, చతుర్ధ చరణం

అనేక సంస్కృత మూల గ్రంధాలలో ఉన్న శాస్త్రాధారాలు అన్నింటిలోనూ తేడాలు లేకుండా ఈ కాలం సరిగ్గా సరిపోతోంది. ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి...శ్రీకృష్ణుడు మహాపురుషుడు అనడానికి మరియు ఆయన ఎంతకాలం క్రితం ఈ గడ్డపై నివసించాడో తెలుసుకోడానికి?

****************హరే కృష్ణ***************

Sunday, June 10

శ్రీకృష్ణుని జననం గురించి కొన్ని అంశాలు (1)

(శ్రీకృష్ణుని జననం పై వేదవ్యాస్ గారు వ్రాసిన ఆర్టికల్ నుండి సేకరించిన సంక్షిప్త వివరణ)

శ్రీకృష్ణుని చరిత్ర చదివిన, తెలిసిన వాళ్ళందరికీ అలాంటి మనిషి నిజంగానే పుట్టి ఉంటారా లేక కల్పితమా అన్న సందేహం కలుగక మానదు. కాని, శ్రీకృష్ణుడు కేవలం వ్యాసమహాముని ఊహాజనిత పాత్ర కాదని, చారిత్రక పురుషుడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.
ఈ విషయాలన్నిటికంటే ముందు శ్రీకృష్ణుడు జీవించిన కాలం గురించి ప్రస్తావించుకోవాలి.
మహాభారతం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటేనే చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా ఏర్పడిన ఇతివృత్తం గల గ్రంధం అని అర్ధం. కొందరు మహాభారతం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో రాసిందని, లేక 1000 బి.సి లో రాసిందని వాదిస్తారు. వాళ్ళంతా ఇంకా పాశ్చాత్యుల బానిసత్వం పోని చరిత్రకారులే. వారి వాదనకు ఖచ్చితమైన ఆధారాలు ఉండవు.

చరిత్రలో ఒక విషయానికి సంబందించి కాల నిర్ణయం చేయాలంటే కొన్ని శాస్త్రీయ పద్దతులు ఉన్నాయి. అందులో
రేడియొ ధార్మిక పద్దతి, పురావస్తు పరిశోధనలో ఉపయోగిస్తారు. అయితే, మహాభారతం ఈ శాస్త్ర పరిశోధన కిందకు రాదు. రెండోది, గ్రహస్థితులను బట్టి, ఖగోళ శాస్త్రం ఆధారంగా కూదా కాలనిర్ణయం చేయవచ్చు అని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నిరూపించారు.

ఈ విషయంలో అతి ప్రాచీనమైన ప్రమాణ గ్రంధాలు చరిత్రకి ఆధారంగా పనికి వచ్చేవి. సంస్కృత మహాభారతం, విష్ణు పురాణం (సంహిత), భాగవతం, హరివంశం. ఇందులో సంస్కృత భాగవత నుండి మనకు తెలిసే విషయం ఏమిటంటే, ఏ రోజైతే శ్రీకృష్ణుడు తనువు త్యజించారో, సరిగ్గా ఆ రోజునే "కలియుగం" ప్రారంభమైంది. ఆరోజు ఏదై ఉంటుంది?


ఇక రెండో విషయం, శ్రీకృష్ణుని జనన కాలనిర్ణయం, భాగవతం దశమస్కంధం 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజున "ప్రజాపతి" నక్షత్రం ఉన్నదని తెలుస్తోంది. ప్రజాపతి నక్షత్రం అంటే, రోహిణి నక్షత్రం. విష్ణుపురాణం ఆధారంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రాణమాసంలో, బహుళపక్షంలో, అష్టమి తిధి ఉండగా జన్మించాని తెలుస్తోంది. ఈ వివరాలు తిధి, వార, నక్షత్రాలను తెలుపుతున్నాయి. మరి సంవత్సరం మాటేంటి? హరి వంశం, విష్ణు పురాణం నుండి కొన్ని ఆధారాలను బట్టి చూస్తే, కృష్ణుని తిధి, వారం, నక్షత్రం అన్నీ కూడా సరిగ్గా సరిపోతాయి. భాగవతం ప్రకారం అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు.

“సప్తర్షీణాంతు యవ్ పూర్వే, దృశ్యే తేహ్యుదితేదివి

తేతుపారిక్షితే కలె మాఘాస్వాసన్ మహర్షయః”

ఆనాడు మరో ఖగోళ విశేషం ఏంటంటే, సప్తమహర్షుల నక్షత్రాలు. యుధిష్టురుడి కాలంలో మఖా నక్షత్రంలో ఉన్నట్లు, శతాబ్దకాలం అనగా యుధిష్టరుడు రాజ్యపాలన పూర్తి చేసే కాలం దాక నిలిచి ఉన్నట్లు ఈ శ్లోకం మనకు తెలుపుతుంది
ఇదే విషయం విష్ణుపురాణంలోనూ రుజువవుతోంది. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన సంవత్సరమే పరీక్షిత్తు మహారాజు పట్టాభిషేకం జరిగింది. అదే ఏడు ధర్మరాజు రాజ్యపరిత్యాగం చేయడం జరిగింది

శివుడి దశావతారములు

శ్రీమహావిష్ణు దశావతారల గురించి తెలుసు, శివుడి దశావతారల గురించి ఇప్పటివరకు వినలేదు. ఇటీవల ఒక పుస్తకంలో చదివాను.(పార్వతి దశావతారాలు, దశమహావిద్యలని మనకు తెలుసు)

పరమేశ్వరుడి మొదటి అవతారము మహాకాలుడు
ద్వితీయావతారము తారకేశ్వరుడు
తృతీయావతారము బాలభువనేశ్వరుడు
చతుర్ధావతారము షోడశ విద్వేశ్వరుడు
పంచమావతారము భైరవుడు
షష్ట్యావతారము చినమస్త
సప్తమావతారము ధూమవంతుడు
అష్టమావతారము బగళాముఖుడు
నవమాతారము మాతంగుడు
దశమావతారము కమలుడు

ఈ అవతారల గురించి పూర్తి వివరణ తెలియదు (తెలుసుకోవాలి). అమ్మవారి అవతారలకు అనుగుణంగా అయ్యవారికి పేరు వచ్చిందా లేక, ఒక్కో అవతారానికి విశిష్టత ఉందేమొ తెలుసుకోవాలి. ఎవరికైన తెలిసిన ఎడల స్పష్టీకరించగలరు.

(ఆధారం : గాజుల సత్యనారాయణ గారి " దైవదర్శనం")

Monday, June 4

కమలాక్షు నర్చించు కరములు కరములు.....

కమలాక్షు నర్చించు కరములు కరములు,
శ్రీనాధు వర్ణించు జిహ్వజిహ్వ
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు,
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతువలగొను పదములు పదములు
పురుషోత్తముని మీదిబుద్ది బుద్ది

భగవంతుని సాహచర్యం నోచుకోని కన్నులు, నోరు, చేతులు, శిరస్సు, చెవులు, మనసు, పాదాలు, బుద్ది మొదలైన ఇంద్రియలకు సార్ధకత లేదు. అంతేకాదు ప్రహ్లాదుని అభిప్రాయంలో దేవదేవుని చింతనతో గడిపిన దినమే నిజమైన దినము. చక్రహస్తుని తెలియచేయు చదువే అసలైన చదువు. భూమండలానికి అధిపతి అయిన ఆ శ్రీహరిని గురించి చెప్పేవారే గురువు. హరి సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రోత్యహించేవాడే తండ్రి. చక్రి చింతనలేని జన్మము జన్మము కాదు. పండితుడనగా విష్ణు భక్తి కలిగినవాడు. అటువంటి సాధనాపరుడికి భగవంతుడు ఎక్కడ వెతికితే అక్కడ కనిపిస్తాడు (సర్వోపగతుండు)