Sunday, February 10

శంఖం

శంఖం సంపదలకు ప్రతీక. భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలము అనే అర్ధం ఉంది. జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణంలో చెప్పబడినది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణుమూర్తి దుష్టశక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. ఆనాటి నుండి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.

ఫురాతనా కాలంలో శంఖాన్ని ప్రతి ఇంట్లోనూ స్థాపించి పూజించేవారు. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని వినియోగిస్తారు. ఫూజా, ఆరాధన అనుష్టాలు, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతోపాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు. దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయని చెప్తారు. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని 6నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు. భౌద్ధం, చైనీస్ బుద్ధిజంలో శంఖధ్వనిని కష్టాలపై విజయంగా పేర్నొన్నారు.

శంఖాలలో పలురకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 

కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాదం వినిపిస్తుంది. శాస్త్రపరంగా చూస్తే మొలాస్కా అనే జీవులు ఆత్మరక్షణ కోసం ఏర్పరచుకున్న కవచమే శంఖం. ఆలా రూపొందిన శంఖాలను ధార్మిక జీవనంలో ఉపయోగిస్తున్నాం. తీర్థాన్ని శంఖంలో పోసి సేవిచడం వలన అందులోని ధాతువుల కారణంగా ఎనలేని మేలు జరుగుతుందని చెప్తారు. అందుకే శంఖం ఆధ్యాత్మికంగానే కాక వైఙ్ఞానికంగానూ మేలైనదిగా చెప్తారు.