Tuesday, March 24

ఉగాది , తెలుగు సంవత్సరాది.(మార్చి 27)

యుగము + ఆది...ఉగాది, తెలుగు సంప్రదాయం ప్రకారం మనం జరుపుకొనే నూతన సంవత్సరం. తెలుగు సంవత్సరం పేరు "విరోధినామ" సంవత్సరం. చైత్రశుద్ద పాడ్యమి రోజున ఉగాది గా తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

రామాయణ కాలం లో ఉత్తరాయణం మొదటి రోజును ఉగాదిగా జరుపుకొనే వారు. కొద్దికాలం తర్వాత వరాహమిహిరుడు అనే మహర్షి చైత్రశుద్ద పాడ్యమి నాడు ఉగాది ని జరపడం ప్రారంబించారు. అప్పటినుండి అదే ఆనవాయితి గా మారింది.
ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణం పండగ ప్రత్యేకత. పొద్దునే లేచి, తలంటు స్నానాలు చేసి, పూజ జరిపి, ఉగాది పచ్చడి తింటే కాని మరేది తినం. అలాగే పంచాంగం వింటాం. రాశిఫలాలు ఎలా ఉన్నాయి, పంటలు, వర్షాలు మొదలైన వాటి గురించి తెల్సుకొంటాం.
షడ్రుచుల
కలయకే ఉగాదిపచ్చడి. (బెల్లం/తీపి, వేప పువ్వు /చేదు, మిరపకాయ/కారం, చింతపండు/పులుపు, మామిడికాయ/వగరు, ఉప్పు) మన జీవితం లో వచ్చే ఎగుడు/దిగుడులు, శుఖ సంతోషాలను ఒకేలా తీసుకోవాలని ( సంతోషం వచ్చినపుడు పొంగిపోయే, దుఖం వస్తే కుంగిపోవడం లా కాకుండా ) ఉగాది పచ్చడి లో ని అంతరార్ధం.

Thursday, March 12

అన్నమాచార్య కీర్తనలు

రాగం: ఆభోగి
ప|| అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

చ|| కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

చ|| జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక ||

చ|| మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక ||

----------------------------------------------

రాగం: హిందోళం

ప|| అదివో అల్లదివో శ్రీహరివాసము |
పదివేల శేషుల పడగల మయము ||

చ|| అదె వేంకటాచల మఖిలోన్నతము |
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్య నివాసమఖిల మునులకు |
అదె చూడడదె మ్రొక్కుడా నందమయము ||

చ|| చెంగట నల్లదివో శేషాచలము |
నింగినున్న దేవతల నిజనివాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము |
బంగారు శిఖిరాల బహు బ్రహ్మమయము ||

చ|| కైవల్య పదము వేంకట నగమదివో |
శ్రీవేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో |
పావనములకెల్ల పావనమయము ||

-------------------------------------------------

ప|| అన్ని మంత్రములు నిందే యావహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ||

చ|| నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము |
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ||

చ|| రంగగు వాసుదేవ మంత్రము ధౄవుండు జపించె
సంగవించె కౄష్ణ మంత్రము అర్జునుడును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠియించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ||

చ|| ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరానాథుడె గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము |
నన్ను గావ గలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము ||