మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి ప్రత్యేకత, ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి విశేషాల గురించి భూదేవి కి వివరించారు.
తిధులు వాటి విశిష్టత :
పాడ్యమి :
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి, ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
విదియ :
అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడు పుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.
తదియ :
గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది.
చవితి:
వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.
పంచమి:
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగాదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాల ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు.
షష్టి :
కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు.
సప్తమి:
సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
అష్టమి:
దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమాకృతులను, దుర్గా దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.
నవమి:
దుర్గాదేవి కి ప్రీతికరమైనది. ఆ తిధి నాడు దుర్గ ను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.
దశమి:
దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి.
ఏకాదశి:
కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
ద్వాదశి:
విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి, వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవు నెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.
త్రయోదశి:
ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే , ఫలం చేకూరుతుంది.
చతుర్దశి:
రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిధి శివుడికి ప్రీతికరం.
అమావాస్య:
పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతాన సౌక్యం అనుగ్రహిస్తారు.
పౌర్ణమి:
పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉంది రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్దిస్తాయి.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment