శ్రీరామ చంద్రుడిని గుండెల్లో  ప్రతిష్టించుకొన్న భక్త శిఖామణి ఆంజనేయుడు. చిరంజీవి ఐన హనుమంతుడు  11 వ రుద్రావతారం. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర  నక్షత్రాన  ఆంజనేయుడు  జన్మించాడు .
వానరులైన  అంజనాదేవి  – కేసరి  దంపతులకు వాయుదేవుని  వల్ల శివాంశతో జన్మించినవాడు ఆంజనేయుడు. ఎర్రగా  ఉన్న సూర్యుడిని ఫలంగా భావించి దానిని అందుకొనేందుకు ప్రయత్నించాడు మారుతి. ఆనాడు  రాహుగ్రహణ కాలం. మారుతిని చూసి రాహువు భయపడి పారిపోయి ఇంద్రుడితో మొరపెట్టుకోగా ఆయన తన వజ్రాయుధం తో మారుతీ హనుమల ( చెక్కిళ్ళు ) పై కొట్టడంతో మూర్చపోతాడు. దీన్ని చూసిన వాయుదేవుడు తన కుమారుడైన ఆంజనేయుడు  వజ్రాయుధ ఘాతకానికి గురికావడం తో సహించలేక వాయు సంచారాన్నినిలిపివేశాడు. సమస్త జీవరాశి గాలి లేక కలవరపాటుకు గురైనది. గంధర్వులు, దేవతలు చివరకు బ్రహ్మదేవుడిని శరణు కోరగా, బ్రహ్మ తన అమృత హస్తాలతో  నిమరడంతో మేల్కొన్న మారుతి అప్పటినుండి హనుమంతునిగా పేరు గాంచాడు. ఆయన సూర్యుని నుంచి తేజస్సును, వ్యాకరణ , వేదశాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించాడు.
హనుమంతుడు అటు రామునికి భక్తునిగాను, సీతను రావణుడి చెర నుండి విడిపించేందుకు దూతగాను, రామ రావణ యుద్ధంలో  సేనానిగా రాముడికి చేదోడు వాదోడుగా ఉంటూ తన పాత్రను భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు.
సుగ్రీవుడు వెంట నిలిచి వాలి సంచరించలేని ఋష్యమూక పర్వతం పై నివాసం ఏర్పరచుకొని ఆయనకు రక్షణగా నిలిచాడు. సీతను వెతికే సమయంలో రామ లక్ష్మణుల వెంట నడిచాడు. సముద్రాన్ని దాటి సీతాదేవి జాడ తెల్సుకొన్నాడు. రాముడి ముద్రికను సీతమ్మకిచ్చి, ఆమె ఇచ్చిన చూడామణి ని రామచంద్రుడికి తెచ్చి ఇచ్చాడు. లంకా  దహనం చేసి కార్యశీలిగా పేరుగాంచాడు .
సీతమ్మ తలలో సింధూరాన్ని చూసి దాని వలన శ్రీరామునికి ఆయుషు వృద్ధి అని తన ఒంటి నిండా నింపుకొన్నాడు. అందువలన హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారు. మహేంద్రగిరి  పై తపస్సు చేసుకొంటూ అయోధ్య వదిలి వెళ్ళిన  ఆంజనేయుడికి సీతాదేవి శ్రీరామునికి తమలపాకులు ఇవ్వడం చూసి రాముడికి ఆరోగ్య వరూధిని తెలుసుకొని  తమలపాకులను దేహం నిండా కట్టుకొన్నాడు. హనుమంతుడిని తమలపాకులతో పూజించడానికి ఇది కూడా ఒక  కారణం. దీనివల్ల హనుమంతుడు శాంతిస్తాడట.
ఆంజనేయ కవచం, స్తుతి, చాలీసా, మంగళాష్టకం, పంచరత్నమాల, సుందరకాండ పటించడం చాల మంచిది.
యత్ర యత్ర రఘు నాద కీర్తనం ----- తత్ర తత్ర కృత మస్త కాంజలిం.

