Friday, November 25

మణిద్వీప వర్ణన (2)

వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది. ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.

చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.

శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.

శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.

విశాఖపట్టణంలోని, లలితాపీఠంలో మణిద్వీప నిర్మాణం చేసి, అమ్మవారికి పూజలు అందిస్తున్నారు. నేను ఈ పీఠాన్ని దర్శించుకున్నాను. మణిద్వీపంలో అమ్మవారి అలంకారములు, కుంకుమార్చన చాలా బాగ చేస్తారు.
{ విషయసేకరణ : శ్రీలలిత సహస్రనామం, శ్రీలలితా పీఠం, విశాఖపట్టణం వారి ప్రచురణ }

0 వినదగు నెవ్వరు చెప్పిన..: