Saturday, December 17

తిరుప్పావై, ధనుర్మాసం

ద్రావిడ భాషలో ‘తిరు’ అనగా పవిత్రమైన, ‘పావై’ అనగా ‘వ్రతము / ప్రబంధం’ అని అర్థం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో విష్ణునామ సంకీర్తననే ‘నోము’గా నెంచి, రోజుకొక్క ‘పాశురము’ (కీర్తన) చొప్పున నెలరోజులలో ముప్పది పాశురాలతో సేవించిన సాక్షాత్ భూదేవి అవతారమూర్తియైన ‘ఆండాళ్’ (గోదాదేవి) రచించిన దివ్య ప్రబంధమే ‘తిరుప్పావై’.


'ధనుర్మాసం’ అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. 'ధనుః’ అనగా దేనికొరకు ప్రార్థించెదమో అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ‘మార్గశీర్షం’ అంటే శ్రేష్ఠమైన ఉపాయం. అంటే నిష్కామకర్మ, ఆత్మజ్ఞానం, భగవద్భక్తి - ఈ త్రివిధ సోపానాలతో దైవాన్ని చేరుటకు సరైన ఉపాయం మార్గశీర్ష వ్రతం. దీనినే ‘శ్రీవ్రతం’ అనీ, ‘సిరినోము’ అనీ కూడా అంటారు.
‘‘వేదాల ఉపనిషత్తుల సారభూతమే తిరుప్పావై’’ అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించియున్నారు. ఉపనిషత్తులే ‘గోదాదేవి’ నోట సర్వసులభ రీతిలో వెలువడినవనీ, ‘తిరుప్పావై’ మహావిష్ణువు పాదపద్మాలను అందుకోటానికి మార్గదర్శకములనీ చెప్పబడినవి.
‘తిరుప్పావై’గా వినుతికెక్కిన ముఫ్పైపాశురాలను మూడు దశలుగా వర్గీకరించవచ్చును. అభిముఖ్యదశ, ఆశ్రయణదశ, అనుభవదశ. అభిముఖ్యదశగా చెప్పబడే మొదటి అయిదు పాశురాలలో వ్రతపూర్వరంగం, వ్రతాంగాలు, వరుణాహ్వానం, కర్మసిద్ధాంత ప్రసక్తి, నామసంక్తీరన వున్నవి. ‘ఆశ్రయణదశ’గా పేర్కొనదగిన ఆరవపాశురం నుంచి పదిహేనవ పాశురం వరకు గోపికలను మేల్కొల్పి వ్రతాచరణకు ఆహ్వానించటం. వ్రతాచరణగావించటం. ఇక ‘అనుభవదశ’గా చెప్పబడే పదహారవ పాశురం నుండి ముప్ఫైఐదవ పాశురంవరకు యశోదను, బలరాముని సన్నద్ధం చేసి నీలాదేవి రూపంలో శ్రీకృష్ణుని స్తుతించి, మంగళాశాసనం చేసి వేడుకొని జన్మజన్మల పర్యంతం కృష్ణసేవలోనే తరింపచేయుమని, శరణాగతి చేయటం కానవస్తుంది.

‘గోదాదేవి’ నామసార్థకతలోనూ పరమార్థమున్నది. ‘కోదై’ అనగా ‘పూలదండ’ అని అర్థం. గోదాదేవిని పెంచిన విష్ణుచిత్తుడు మాలాకారుడు కనుక. మాలాకారుని తనయగా ‘కోదై’గా పిలువబడి. ‘కోదై’ క్రమంగా ‘గోదా’గా పరిణితి చెందింది. ‘గాఃదదాతతిగోదా’ (చక్కని దాక్కులనిచ్చునది ‘గోదా’) అనే అర్థం దృష్ట్యా సుమధుర భక్తిరస పాశురాలను ప్రవచించింది కనుక ‘గోదా’గా సార్థకనామ ధేయురాలైనది గోదాదేవి. తనతండ్రి వటపత్ర శాయికి సమర్పించే పూలదండలను తొలుత తాను ధరించి అద్దంలో చూచుకొని మురిసిపోయి మరలా వానిని యథాప్రకారం ‘పూలసజ్జ’లో వుంచెడిది. ఈ మూలలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆమె ధరించి, ఇచ్చిన మాలలే స్వామికి ప్రీతిపాత్రములయ్యేవి. ‘ఆముక్త’ అనగా అలంకరించుకొని తీయబడిన అ, ‘మాల్య’ అనగా పూలదండను ‘ద’ అనగా ఇచ్చునది అని అర్థం. అందుకే గోదాదేవికి ‘ఆముక్తమాల్యద’ అని పేరు కలిగింది. దీనినే తమిళులు ‘శూడికొడుత్త నాచ్చియార్’ (తాల్చి ఇచ్చిన అమ్మ) అని అంటారు.

దినమున కొక కీర్తన చొప్పున దేవదేవునిపై ముప్పది కీర్తనలు రచించి స్వామి వారికి ‘పూలమాల’తో బాటు ‘కవితామాల’ను కూడా అర్పించి, నిష్ఠతో ధనుర్మాస వ్రతమాచరించి గోపికలనే ఆదర్శంగా తీసుకొని, తానున్న విల్లి పుత్తూరునే ‘రేపల్లె’గా భావించి, తానూ ఓ గోపికనై ధనుర్మాస వ్రత పరిసమాప్తితో స్వామి కృపకు పాత్రురాలై రంగనాథునే పరిణయమాడి సర్వభోగాలనుభవించి ‘ఆండాళ్’ (కాపాడునది)గా ఆరాధనీయురాలైనది.

‘తిరుప్పావై’ను వైష్ణవాలయాలలో విధిగా పారాణం చేయటం ఆచారం ఉంది. తిరుమలలో వేంకటేశ్వరుని ఆలయంలో ధనుర్మాసకాలంలో సుప్రభాతానికి మారుగా ఈ ‘తిరుప్పావై’ గానం చేయబడుటను మట్టి ఈ ‘తిరుప్పావై’ ఎంతటి ప్రస్తికెక్కిందో చెప్పవచ్చును. ధనుర్మాసంలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేసినవారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వచనం. తిరుప్పావై వ్రతంలో స్వామి నివేదనకు ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని కొన్ని పాశురాలకు నైవేద్యాలు ప్రత్యేకంగా చేస్తారు. పారాయణం తరువాత కట్టెపొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం, పయసాన్నం, అప్పాలు నైవేద్యంగా పెడుతారు.

విశేష పాశురం రోజు కట్టె పొంగలి తో పాటు దద్దోజనం, పులిహోర కూడా చేస్తారు. కూడారై పాశురం రోజున ప్రత్యేకముగా నెయ్యి, బాదంపప్పు, కొబ్బరిపాలు, గసగసాలు తదితర సుగంధ ద్రవ్యాలు, బియ్యం, పాలు, బెల్లం తో చేసే అక్కారవడిశెల్ అను ప్రసాదం చేయడం సంప్రదాయం.
భక్తియోగం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని, నిరూపించిన ఆరాధనా తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన రీతిగా ఈ ‘తిరుప్పావై’ పారాయణ చేసిన వారికి, తిరుప్పావైగాన శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర ముక్తి ప్రదాయకం కాగలదనీ ఆకాంక్షిస్తూ ఆండాళ్‌ను ఇలాప్రార్ధిదాం
‘పాలడ్యే విశ్వంభరాం, గోదాం వందే శ్రీ రంగనాయకీం’.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: