Friday, March 30

జై శ్రీరాం



నూతన సంవత్సరం, చైత్ర మాసం, ఉగాది వచ్చిందంటే శ్రీరాముని తలవని వారుండరు. శ్రీరామ చంద్ర స్మరణ అంటే శ్రీమద్రామాయణ స్మరణయే. జరుగుచున్నది “నందన”నామ సంవత్సరం. ఆ పదానికి అర్ధం “ఆనందింపచేయునది”. తల్లిదండ్రులను ఆనందింపచేసే పుత్రుని నందుడంటారు. దశరధ నందనుడు, కౌసల్యా నందనుడు అని రామచంద్రుడిని పిలవడం అంతరార్ధం ఇదే.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట పంపమనన్నప్పుడు దశరధుడు మనస్పూర్థిగా పంపలేకపోయాడు. కాని, కౌసల్య మాత్రం ఆనందంగా పంపగలిగిన దానిని మనసులో ఉంచుకుని, విశ్వామిత్రుడొక ఉషఃకాలమున రామలక్షణులను
“ కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం”
కౌసల్యకు జనించిన సత్పురుషుడవు, నరశ్రేష్టుడవైన ఓ రామా, ప్రాతస్సంధ్య ఏర్పడనున్నది. కనుక చేయవలసిన నిత్యకృత్యమును ఆచరించవలసియున్నది కనుక లెమ్మని నిద్రలేపాడు.
ఇక్కడ కౌసల్యా సుప్రజా అంటే కౌసల్య యొక్క సుపుత్రుడు / అన్ని సద్గుణాలు కలిగిన పుత్రుడు కలది కౌసల్యా అని అర్ధం. ఎవరికైన తొలిగురువులు తల్లితండ్రులే. కనుక వారి వచనాన్ని జవదాటరాదు.

రామాయణం మహా కావ్యం సర్వవేదార్ధసమ్మతం
సర్వపాపప్రశమనం దుష్టగ్రహనివారణం
వాల్మీకి రామాయణం గురించి ఇలా అన్నారు “ రామాయణం మహా కావ్యం. సర్వవేదసారం. సమస్త పాపాలను నశింపచేసేది. దుష్టగ్రహబాధలను తొలగిస్తుంది. ఇటువంటి గ్రంధం అందరిచే చదువదగినది లేక వినదగినది అని చెబుతూ మహర్షి, ఈ గ్రంధాన్ని వినదగ సమయాలను, ఫలితాలను కూడ చెప్పారు.

కార్తీక, మాఘ, చైత్రమాసాలలో శుక్ల పక్షాన పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది దినములు రామాయణ కధామృతం శ్రవణం చేయతగినది. ఈ సమయాన పారాయణ ఫలప్రదమైనది.
ఘొరమైన కలియుగాన ఈ తొమ్మిది రోజులు రామాయణ పఠనమును గాని, శ్రవణమును గాని తప్పక చేయాలి.
రాముడిని చూడనివాడు, రాముని దృస్టికి రానివాడు లోక నిందకు గురియవుతాడు. అందుకే మేనమామ ఇంటి నుండి తిరిగి వచ్చిన భరతుడు రాజ్యలోభాకృష్ణుడు గాక, రామదర్శన భాగ్యమునకు తపించిపోయి, తల్లి చేసిన పాపంలో తనకూ భాగమున్నదని, కౌసల్య అనుమానికి స్థానమివ్వరాదని, ఆమెవద్ద తనను తననేక విధాలుగా నిందించుకుని, అడవికేగి రామదర్శన భాగ్యమునొంది, ఆయన పాదుకలను తెచ్చి రాజ్యపరిపాలన గావించి తంద్రికి తగ్గ పుత్రుడని, “నందను”డంటే ఇలా ఉండాలని నిరూపించుకొన్నాడు.

రామాయణం నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.

దశరధుడి నుండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం

కౌసల్యా, కైకేయి నుండి స్థితప్రఙ్ఞత

రామయ్య తండ్రి నుండి, తల్లి తండ్రుల మాటను ఆచరించడం

సీతమ్మ తల్లి, భర్త అడుగుజాడలలో నడవడం. ఆపద సమయాలలో మనోదైర్యంతో ఉండటం.

లక్ష్మణుడు, స్వామి భక్తి, రామాయణం మొత్తం పరిశిలిస్తే, రాముడి బాల్యం నుండి అన్నని విడవని తమ్ముడు, సుఖమైన దుఖమైన.

ఆంజనేయుడు, స్వామి భక్తి కి ప్రతీక, ఏ సంధర్భంలో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి, ఇపుడు మనం వేల కొలది బ్బు ధారపోసి నేర్చుకొనే కమ్యునికేషన్ స్కిల్స్ అనేవి ఆంజనేయుడి ద్వార నేర్చుకొవాలి.

రావణాసురుడు, మనకు రావణాసురుడు దుష్టుడిగా కనిపించినా, అతను తన రాజ్య ప్రజలకు దుష్టుడు కాదు, శతృవు కాదు. మంచి రాజ్య పాలకుడు, కార్యశీలుడు. అంతకము మించి శంకరుడి భక్తుడు. మహత్తేజస్సు కలవాడు. అంతకంటే గొప్ప విషయం, సీతమ్మను తాకనేలేదు. జీవి తపన పడిపోయాడు, ఆ శ్రీమన్నారయణుడి దరిచేరడానికి.

మందోదరి, మహా ఇల్లాలు.

ఇలా ఒక్కో పాత్ర ఒక్కో పాఠాన్ని నేర్పుతుంది.ఎటు చూసిన రామాయణం మహా సుందరమైనది. ఆంతా సుందరమే. “ప్రపంచంలోని అన్ని గ్రంధాలు తగులబడిన పర్వాలేదు, రామాయణం ఒక్కటి ఉంటే చాలు” అని ఓ మహానుభావుడు అన్నట్లు, మనం నిత్యం పారయణ చేయవలసిన మహత్ గ్రంధం రామాయణం.
ఆ ఇప్పటినుండే ఎం చదువుతాంలే అనుకొంటే, పెద్ద వయస్సు వచ్చేసరికి నేర్చుకొనేది ఏమి ఉండదు. కాబట్టి, ఈ క్షణం నుండి రామ నామంతో , వీలైన ప్రతి క్షణాన్ని స్మరించండి.
జై శ్రీరాం....

విషయ సేకరణ : కొంత ఋషిపీఠం నుండి, కొంత స్వీయ లిఖితము.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: