Sunday, October 30

ద్వాదశజ్యోతిర్లింగాలు (1)

మహాశివుడిని విగ్రహ రూపంలో దేవాలయాలలో పూజించటం బహు అరుదు. మనకు ఆ భోళాశంకరుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. అటువంటి లింగాలలో ద్వాదశజ్యోతిర్లింగాలు అత్యంత ప్రసిద్ధమైనవి. అవి..

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.


1. సోమనాధేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటది "సోమేశ్వర లింగం". ఇది మిక్కిలి ప్రఖ్యాతి చెందిన పురాతనమైన శైవ క్షేత్రం. పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం (సౌరాష్ట్రం) లోని ప్రభాస పట్టణంలో ఈ ఆలయం ఉన్నది. సరస్వతీ నది ఇక్కడ సాగర సంగమం చేస్తుంది. ఈ సాగర సంగమంలోనే చంద్ర భగవానుడు స్నానం చేసి, శివారాధన చేసి, శాప విముక్తి పొందినాడు.
దక్ష ప్రజాపతి కుమార్తెలు నూరుమంది. అందరిలోనూ పెద్ద కుమార్తె "సతీదేవి" శివుని భార్య. మిగిలిన కుమర్తెలలొ 27 మందిని (అశ్విని, భరణి మొదలగు నక్షత్రములు) చంద్రునుకి ఇచ్చి వివాహం చేశాడు. సవతులు అందరిలోనూ చిన్నదగు రేవతి యందు చంద్రునకు మిక్కిలి ప్రేమ యుండుట వలన, మిగిలిన వారు తమ తండ్రికి ఫిర్యాదు చేశారు. అంతట దక్ష ప్రజాపతి చంద్రునకు "క్షయ వ్యాధిని పొందు" అని శాపం ఇచ్చాడు. నారద ముని సలహాతో, చంద్రుడు ప్రభాసమునకు పోయి 40 దినములు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు. అంత పర్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ట చేసి, పూజించిన, నీకు శాపఫలం క్షీణించగలదు. మొదటి 15 దినములు నా వర ప్రభావంబున వృద్ది పొంది, తరువాత 15 దినములు దక్ష ప్రజాపతి శాప ఫలంబున క్షీణించగలవు అని తెలియజేసాడు. చంద్రుడికి సోముడు అనే పేరు ఉంది. సోముడు చేత అర్పించబడిన ఈశ్వరుడు కాబట్టి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ సోమేశ్వరలింగాన్ని పూజించే వారికి సకల పాపములు, క్షయ మొదలగు వ్యాధులు తొలగిపోతాయి

2. శ్రీశైల మల్లికార్జునుడు

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైయిన భ్రమరాంబికాదేవి, ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైల మల్లికార్జునుడు మనకు శ్రీశైలంలో దర్శనమిస్తారు. దక్షిణ భారతదేశాన, ఆంద్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా, కృష్ణానదీ తీరాన నల్లమల కొండల్లో 'శ్రీశైలం' క్షేత్రం ఉంది. ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చాలా విశాలమైంది. కోటగోడల్లాంటి అతి పెద్ద గోడలపై కుడ్యచిత్రాలు తీరి వుంటాయి. స్థంభాలతో సహా వాస్తుశిల్పంలో సంపన్నత, దర్పం తొణికిసలాడుతుంటాయి. విజయనగర రాజులనాటి వాస్తుకళకు ఇది నిదర్శనం.
మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానములు. శివరాత్రినాటి రాత్రి స్వామి వారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి - 360 మూరల గుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టడం / మంగళపాగా అని అంటారు. ఈ వస్త్రాన్ని రోజుకొక మూర చొప్పున 360 రోజులు నేస్తారని చెప్పుకుంటారు. మంగళ పాగా రాత్రి వేళ లింగోద్భవ సమయానికి నేత ముగుస్తుంది. పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడట. తరవాత ఈ మంగళపాగాను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు.
ఇక్కడకు ఇక 3 కి. మీ. దూరంలో కృష్ణా నది ఉత్తార వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అని అంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకు గల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలో వున్న ' లింగాల గట్టు ' వగైరాలను దర్శించుకుని గాని మరలరు.
ఆలయం చుట్టూ ప్రాకారం గోడలు చాల ఎత్తుగాను వివిధ గోపురాల్తో శోభిల్లుతుంటాయి. ప్రాకారనిర్మాణానికి వినియోగించబడిన రాళ్ళు సుమారు 20 అ. వైశాల్యంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు, రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు - భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగా శివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీ చక్రప్రతిష్ట చేశారని ప్రతీతి. చైత్రమాసంలో ' అంబ తిరునాళ్ళ ' అని గొప్ప ఉత్సవం జరుగుతుంది.
వెనుక వైపున భ్రమరాంబికాలయంతో పాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.
"మల్లికార్జునస్వామిని చేతులతో తాకి పునర్జన్మ లేకుండా ముక్తిని పొందవచ్చు". "కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో దైవదర్శనం ముక్తిదాయకాలు".
" శ్రీశైలం యొక్క శిఖర దర్శనమే సమస్త పాపహరణం జన్మరాహిత్య" మని వేదోక్తి .

3. మహాకాళేశ్వరుడు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన " శ్రీ మహాకాళేశ్వర స్వామి " జ్యోతిర్లింగరూపమున దర్శనమిస్తారు.
ఈ ఆలయం మూడు అంతస్తులుండి, ఏడు గోపురాలుండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు, రెండవ అంతస్తులో ఓం కారేశ్వరుడు, మూడ వ అంతస్తులో నాగచంద్రేశ్వరుడు కొలువై వుంటారు. ఈ మూడవ అంతస్తు మాత్రం నాగపంచమి నాడు మాత్రమే తెరిచి పూజాది కాలు చేస్తూవుంటారు. మిగిలిన రోజుల్లో ఈ అంతస్తు మూసివుంటుంది. ఇక ఈ ఆలయంలో 3 అడుగుల వ్యాసంతో 21/2 అడుగుల ఎత్తున్న జ్యోతిర్లింగే శ్వరుడు పశ్చిమ దిక్కుగా ప్రతిష్టితు డయ్యాడు. ఇక్కడ చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది. పూర్వం ఒక సాధువు స్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి అభిషేకించి వెళ్ళిపోయేవాడట. ఆయనని ఎవరూ దర్శించలేకపోయారు. ఇప్పుడుడు మాత్రం ఇక్కడ అగ్నిహోమం లోనున్చి వచ్చిన భస్మంతో స్వామిని అభిషేకిస్తున్నారు. .
ఇక్కడ తాంత్రిక విద్యలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అఘోరకులు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. వీరిని చూడడానికి కొంత భయం కలుగుతుంది. వీరి ఉపాసనా చర్యలు కూడా మనకి భయం పుట్టిస్తాయి.

4. ఓంకారేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది "ఓంకార లింగము". మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇండోర్ కు సుమారు 80కి.మీ దూరంలో "ఓంకారేశ్వర లింగము" ఉంది. దీనినే అమలేశ్వర లింగము అని కూడా అంటారు.
పర్వతములన్నిటి యందు " మేరువు " అను పర్వతము గొప్పది. మేరువు మీద మంగళప్రదుడైన శివమూర్తి ప్రమధగాణాలతో గౌరీ సామేతంగ నివసించియున్నాడు. వింధ్యుడు అనే పర్వత రాజుకు మేరువ రాజుకు ఉన్నంత గొప్పతనము పొందవలెనని సంకల్పముతో, "ఓం నమః శివాయ" మంత్ర జపం చేయుట మిన్నునంట ఎత్తు పెరుగుచుండును. దీనిని చూచిన అగస్త్యముని చేయినడ్డుపెట్టి "వింధ్య రాజా! నేను కైలాసపతితో సంప్రదించి, నీకు ప్రసన్నుడగునట్లుగా చేయుదును. నీవు పెరగక నిలిచియుండు" అని చెప్పెను. అగస్త్య ముని పరమేశ్వరునితో "స్వామీ నీ అనుగ్రహమును సంపాదించుకోరి, వింధ్యా పర్వత రాజు మిన్నునంటగా పెరుగుచున్నాడు, అతని కోరికను ఫలింప జేయుము" అని ప్రార్ధించాడు. శంకరుడు వింధ్యునకు ప్రత్యక్షమై, వింధ్య పర్వతరాజు అభీష్టము అనుసరించి, ఆ పర్వతము పై సువర్ణ రూప లింగముగా వెలిశాడు.

1 వినదగు నెవ్వరు చెప్పిన..:

కిరణ్ కుమార్.వాకాడ said...

చాలా బాగుంది సార్...
జ్యోతిర్లి0గాలు గురుంచి చాలా చక్కగా వివరించారు.
మిగిలిన జ్యోతిర్లి0గాల గురుంచి కూడా తెలుపగలరు..!