Wednesday, June 22

శ్రీలక్ష్మీదేవి

క్షీరసాగర మధన సందర్భంలో హాలాహలం పుట్టడం, దానిని పరమశివుడు సేవించి నీలకంఠుడు కావడం జరిగింది. అది మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. ఆ రోజు శివరాత్రి అయినది. ఐరావతం, కౌస్థుభం, పారిజాతం, అప్సరసలు ఇవన్నీ జన్మించాక, ఫాల్గునశుద్ధపూర్ణిమ - ఉత్తరాఫల్గునీ నక్షత్రం ఉన్న శుభదినాన శ్రీలక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు. ఈరోజు లక్ష్మీదేవి ఆవిర్భావమే కాక లక్ష్మీనారాయణుల పాణిగ్రహణ మహోత్సవము జరిగిన మహత్తరమైన రోజు. ఫాల్గున మాసానికి "తపస్యమాసం" అని పేరు. అంటే తపస్సునందు యోగ్యమైనది అని అర్ధము.

లక్ష్మీ తత్వం :
అందరూ సిరిసంపదలు కోరుతూంటారు. అవి కోరగానే వచ్చేవి కావు. అవి వరింప దగిన వారినే వరించి వస్తాయి. అంటే వాటికై మనం కొన్ని అర్హతలు కల్గిఉండాలి. లక్ష్మీ అంటే ధనం ఒక్కటే కాదు, 8 విధాలైన కోరికలను లక్ష్ములుగానే వ్యవహరిస్తున్నాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గృహలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, మోక్షలక్ష్మి.
లక్ష్మీదేవి ఎక్కడ ఉండదంటే :
"యత్ర నాస్తి హరేఃపూజా, తదీయ గుణకీర్తనం
నోత్యుకశ్య ప్రశంసాయం నయామి తస్యమందిరం"
శ్రీహరి యొక్క పూజ, కీర్తన, ఉత్సుకత లేని వారి ఇంట నేను ప్రవేశించను అని లక్ష్మిదేవియే స్వయముగా చెప్పినది.మిట్టమధ్యాహ్నం దాక నిద్ర పోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం. గురువులను, తల్లితండ్రులను దూషించడం, దూషణలు చేసేవారి ఇంట లక్ష్మీదేవి ఉండదు.

"సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ"
సంపద కలుగునపుడు కొబ్బరి కాయలోనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజు మాయమగు విధముననే మాయమయిపోవును. చిత్తశుద్ది ఉన్నచోటనే విత్తశుద్ది ఉంటుంది.
లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కవిధానంలో ప్రకటితమైనది. (1) స్వాయంభువ మన్వంతరంలో దైత్య గర్భంలో బృగుమహర్షికి కూతురైనది. అప్పుడు అమ్మవారి పేరు "భార్గవి". ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత అయిన సన్నివేశం. (2) స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి అవతరించింది. (3) ఔత్తమ మన్వంతరంలో జలరాశినుండి (4) తామస మన్వంతరంలో భూమినుండి (5) రైవత మన్వంతరంలో బిల్వవృక్షము నుండి (6) చాక్షుష మన్వంతరంలో సహస్రదళపద్మం నుండి (7) వైవస్వత మన్వంతరంలో (ఇప్పుడు జరుగుతున్న మనువు కాలంలో) ఇంద్రునికి దుర్వాశుని శాపం కారణంగా, నశించిన సంపదలను అనుగ్రహిస్తూ, మహర్షుల ప్రార్ధనతో క్షీరాసాగర మధనంలో ఆవిర్భవించింది. ఫాల్గున చతుర్దశితో కూడిన పూర్ణిమ - ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో జరిగింది కావున ఆ రోజునే శ్రీలక్ష్మీ జయంతిగా జరుపుకొంటాము.
శ - ఆనందం, ర - తేజస్సు, ఈ - లక్ష్మి, కనుకనే ఆనందతేజస్సులు అమ్మరూపం. లక్ష్మీదేవియే స్వాహా రూపంతో దేవతలకు "హవ్యాన్ని", స్వధా రూపంతో పిత్రుదేవతలకు "కవ్యాన్ని" (పితృదేవతలకియ్యదగిన అన్నము) చేరుస్తుంది.
లక్ష్మీ స్థానాలు :
కన్యలు, ముత్తైదువులు, ఆభరణాలు, పసుపు, కుంకుమ, గోశాల, పర్వతాలు, చదువు, నదులు, సరోవరాలు, మంచిమాటలు, వికసించిన పద్మాలు ఇలా వస్తురూపేనా, స్థలరూపేనా, వ్యక్తిరూపేనా అమ్మవారు మనతోనే ఉంటారు. "ఆశ, శ్రద్ధ, ధృతి, కాంతి, విజయం, వినయం, సహనం" అనేవి సప్తశ్రీలు. ఈ సప్తశ్రీలను ముందుండి నడిపించేది "పురోగా" అనే లక్ష్మి. కనుక అష్టశ్రీలు మనలో స్థిరంగా ఉండాలంటే శ్రీదేవిని ఉపాసిస్తూ, సత్యధర్మాలని పాటిస్తూండాలి.
లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీసూక్తంలో 15 ఋక్కులు ఉన్నాయి. శ్రీసూక్తం దేవి మూర్తులన్నింటికీ ప్రతీక. దీనిలోని ఒక్కోమంత్రం ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. నియమానుసారం జపించి హోమం చేయడంద్వారా ఫలితాన్ని పొందవచ్చు అని పెద్దల సారాంశం. అవి (1) దారిద్ర్యనాశం (2) దుఖఃనాశం (3) కష్టహరణం (4) అన్నమవస్త్రసమృద్ధి (5) సుఖసంసార జీవనం (6) సౌభాగ్యం (7) ధనప్రాప్తి (8) ఉన్నతాధికార ప్రాప్తి (9) భాగ్యం (10) భోగం (11) ఆనందం (12) వంశవృద్ధి (13) దేవి దర్శనానుగ్రహం (14) ముఖ్తి (15) భోగమోక్షరూపమైన జీవన్ముక్తి.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో "మంచి" అనేది ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏదైనా అది లక్ష్మీ అమ్మవారి స్వరూపమే.

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

Anonymous said...

గాయత్రి గారు నమస్కారమలు. బగలాముఖి డాలరు ఎక్కడ దొరుకుతుంది.

గాయత్రి said...

క్షమించండి, నాకు తెలీదండి.