Friday, June 3

బ్రహ్మోత్సవాలు (1)


శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనది బ్రహ్మోత్సవం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీమన్నరాయణుడే తిరుమలపై ప్రత్యక్షంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్షమున శ్రవణా నక్షత్రమునందు, చక్రస్నానమును సంకల్పించి 9రోజులముందుగా ధ్వజారోహణము చేస్తారు. తరువాతి 9రోజులు ఆయా నిర్ణీత వాహనములలో శ్రీ స్వామివారికి ఉత్సవములు జరుగును. 3 సంవత్సరాలకు ఒకమారు అధిక మాసము వచ్చినప్పుడు, 2పర్యాయములు బ్రహ్మోత్సవాలు జరుగును. అంటే,కన్యామాసము ఆశ్వయుజ మాసము ఐనప్పుడు ఆశ్వయుజమాసము నందు, విజయదశమినుండి 9 రోజులును, కన్యామాసము భాద్రపద మాసమైనపుదు భాద్రపద, ఆశ్వయుజ మాసములందు 2 బ్రహ్మోత్సవమలు జరుగును. చతుర్ముఖబ్రహ్మ స్వయముగా ఈ బ్రహ్మోత్సవము జరిపించినట్లు వరాహ పురాణము నందు చెప్పబడినది.

మొదటిసారిగా ఈ ఉత్సవములు క్రీస్తుశకము 830వ సంవత్సరంలో జరిగినట్లు శిలాశాసనములు ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య స్థాపన తరువాత, సుమారు 1404 సంవత్సరంలో విజయనగర రాజ్యాధిపతి రెండవ హరిహరరాయలు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించినట్లు శాసనములు ద్వారా తెలియుచున్నది. ఈ ఉత్సవాలకై నూరు ఫణములు దేవస్థాన ఖజానాకు ప్రతీ సంవత్సరం జమయగునట్లు రాయలు ఆదేశించెను. శ్రీ ముల్లై తిరువేంకటజియరు అను వైష్ణవ పీఠాధిపతిని నియమించెను.

వేంకటేశ్వర స్వామితో సాళువ నరసింహుని కుటుంబంగా భావించబడిన శిల్పం.
ఇది అలిపిరిలోని మండపాలలో ఉంది. (ఎడమనుండి కుడికి సాళువగుండ, సాళువనరసింహుడు, తల్లి మల్లాంబికా, వేంకటేశ్వరస్వామి, పుత్రులు : కుమార నరసింహుడు, పెరియతంగమన్, చిక్కతంగమన్)

తరువాతి కాలంలో సాళువ నరసింహరాయలు శ్రీనివాసునికి చేసిన సేవలు అమోఘం. 1417 సంవత్సరములో డొలోత్సవములు 5రోజులు జరుగునట్లు ప్రారంభించెను. వేంకటేశ్వరుని తెప్పోత్సవమును కూడా సాళువ నరసింహరాయలే ప్రవేశపెట్టెను. ఈయన కాలంలో ఆరున్నొక్క బ్రహ్మోత్సవాలు జరుగుట ఆచారముగా ఉండెడిది. ఏడవరోజు శ్రీవారికి, ఉత్సవదేవేరులకు 4అప్పపడులు (అప్పాలు)నైవేద్యము పెట్టి, 4 తిరువీధుల మూల్లలో కట్టబడిన ఎత్తైన మంటపమునందు ఉత్సవమూర్తులకు నైవేద్యము ఇచ్చునటుల ఏర్పాటు చేయబడినది.(ఈ అప్పపడి నైవేద్యం సాళువరాయలు, అతని ముగ్గురు కుమారుల ఙ్ఞాపకార్ధం ఏర్పాటుచేసారు) 1539వ సంవత్సరంలో తిరుపతి నగరపాకకుడైన పెరియసామిశెట్టి, ఉత్తన నల్లూరు అను గ్రామమును ఆ దేవదేవుడికి సర్వమాన్యముగా ఇచ్చి, ఆ ఆదాయములో గోవిందరాజుస్వామి వారికి సంవత్సరములో 2నెలల్లోనూ, మిగిలిన 10 నెలలలో తిరుమల శ్రీనివాసునికే బ్రహ్మోత్సవములు చేయునటుల ఏర్పాటు చేసెను. ఆ రోజులలో బ్రహ్మోత్సవాలు 12రోజులు జరిగేవి.
ఆ తరువాత కొద్దికాలానికి అన్నమాచార్యుల కుమారుడైన తాళ్ళపాక తిరుమలయ్యకు విజయనగరాధీశుడైన సదాశివరాయలు, ముత్యాలపట్టు అను గ్రామమును దానముగా ఇచ్చాడు. తిరుమలయ్య ఆ గ్రామమును శ్రీనివాసునికి 3-7-1545 లో ధర్మముగా ఇచ్చి బ్రహ్మోత్సవములు ఏర్పాటుచేసెను.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: