Tuesday, August 30

వినాయక చవితి


ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రస్సన్నవదనం ధ్యాయేత్ సర్వ విఙ్ఞూప శాంతయే

విద్యారంభే, వివాహేచ ప్రవేశనిర్గమే తథా
సంగ్రామే, సర్వకార్యేషు విఘ్నస్తశ్యన జాయతే

మనం ఏ శుభ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తే కాని మొదలుపెట్టం. వినాయకచవితి నాడు కూడా ముందుగా పసుపు విఘ్నేశ్వరుని అర్చించి వినాయక వ్రతం మొదలుపెట్టడం మన ఆనవాయితీ. వినాయక అర్చన శైవులకే పరిమితం కాదు. వైష్ణవ దేవాలయాల్లో కూడా గజముఖుడైన విష్వక్సేనుని ముందు దర్శించి తర్వాత దైవదర్శనం చేసుకోవడం ఆచారం. ఈ విధంగా గణపతి ఆరాధన మనకు శుభం చేకూర్చే అధిదేవత అన్న విశ్వాసంతోనే గణేశ జన్మతిథిని వినాయక చవితిని పర్వదినంగా దేశమంతటా ఆబాలగోపాలం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు గణపతికి ఇష్టమైన నైవేద్యములు.
గజాననుడి కధ :
వినాయకుని విశిష్ట రూపానికి ఆయన ఆరాధన, అర్చనలలోని అపూర్వ సంప్రదాయాల వెనుక అనేక పరమార్థాలున్నాయి. నలుగు పిండితో సృష్టించిన బాలునికి ప్రాణం పోసిన పార్వతీదేవి అజ్ఞానుసారం కైలాస ద్వారం వద్ద కాపలాగా ఉన్న వినాయకుని శిరస్సును శివుడు ఖండిస్తే తదుపరి నిజం తెలుసుకుని ఉత్తరముఖుడై నిద్రిస్తున్న ఏనుగు తలను తెప్పించి ఆ బాలుని సజీవునిగా చేయగా వినాయకుడు గజాననుడయ్యాడు. ఇదేకాక, ఏనుగు ముఖం గల గజముఖాసురుని సంహరించడానికి వినాయకుడు ఏనుగు ముఖంతో అవతరించి ఆ రాక్షసుని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చాడు.
ఎంత చూసినా తనివి తీరని వింతలు ప్రపంచంలో మూడు ఉన్నాయి. అవి సంపూర్ణ చంద్రబింబం, సముద్రం, ఏనుగు. చంద్రబింబాన్ని ఎంతసేపు చూసినా మనకు తృప్తి ఉండదు. అలాగే ఎగసిపడే కెరటాలతో కోలాహలంగా ఉండే సముద్ర దృశ్యం మనలను కట్టి పడేస్తుంది. భారీ శరీరంతో ఠీవిగా నిలబడి, బారెడు తొండం, మూరెడు దంతాలతో విన్యాసాలు చేసే గజరాను వింతగా వీలైనంత సేపు చూస్తూనే ఉంటారు. ఇలాంటి అంతులేని అవ్యాజానందాన్నివ్వడానికే వినాయకుడు గజరూపం దాల్చాడు.
ఏకదంతుడు ఎలా
య్యాడు?
సాధారణంగా ఏనుగుకు రెండు దంతాలుంటాయి. ఒకటే దంతమున్న ఏనుగు అంత అందంగా ఉండదు కదా? దీనిలో ఒక పరమ సత్యం నిగూఢమై ఉంది. పంచమ వేదమనబడే మహాభారతాన్ని వేదవ్యాసుడు ఆశువుగా చెపుతుంటే, వినాయకుడు దాన్ని వింటూ, తాళపత్రాలపై రచించవలసి వచ్చింది. అందుకోసం తన దంతానొక దానిని విరిచి దానిని ఘంటంగా వాడి మహాభారత రచన చేశాడు. ఇందులోని పరమార్థమేమంటే, జ్ఞాన సముపార్జన కోసం మనం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి. దంతాలు ఏనుగు అందాన్ని ఇనుమడింపజేస్తాయి. వాటిని అది ప్రాణప్రదం చూసుకుంటుంది. వాటిని రాపిడి చేసి మెరిసేలా చేసుకుంటుంది. అయినప్పటికి గణపతి దానిని విరిచి మహత్తరమైన మహాభారత కావ్యాన్ని రచించడానికి ఉపయోగించాడు.
మరో పురాణ గాథ ప్రకారం, కార్తవీర్యుని సంహరించిన పరశురాముడు శివుని దర్శించడానికి కైలాసం వెడతాడు. తల్లిదండ్రులైన శివ, పార్వతులు శయన మందిరంలో ఉన్నందున వారి ఏకాంతానికి భంగం కలుగతుందని విఘ్నేశ్వరుడు పరశురాముని లోనికి వెళ్లవద్దని అడ్డగిస్తాడు. వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. వినాయకుడు తన బలమైన తొండంతో పరశురాముని ఎత్తి పడేస్తాడు. ప్రతిగా పరశురాముడు తన పరశువుతో విఘ్నేశ్వరుని ఎదుర్కొనగా ఆ దెబ్బకు ఆయన దంతం ఒకటి విరిగిపోతుంది. ఆ విధంగా ఆయన ఏకదంతుడయ్యాడు.
మూషిక వాహనుడు
మూషికాసురుడు అనే రాక్షసుడు వినాయకునితో యుద్ధానికి తలపడి గందరగోళం సృష్టించగా పాశాంకుశధరుడు వానిని ఒక చిట్టెలుకగా మార్చి తన చెప్పుచేతల్లో పడి ఉండే వాహనంగా అణగద్రొక్కాడు.
టెంకాయ కొట్టడంలో అంతరార్ధం
మన కోరికలు నెరవేరితే వినాయకునికి టెంకాయ కొడతామని మొక్కుకుంటాం. దీనిలో కూడా ఒక పరమార్థం ఇమిడి ఉంది. తామ్ర, లోహ, స్వర్ణ అనే త్రిపురాలను ఆక్రమించిన ముగ్గురు రాక్షస రాజులు ప్రజలను పట్టి పీడిస్తుంటే ముక్కంటి వారిని సంహరించడానికి ప్రయత్నించినపుడల్లా ఏదో ఒక విఘ్నం సంభవించేది. విఘ్న రాజైన పుత్రుడు వినాయకుని సంప్రదించగా ఆయన సూచన ప్రకారం ముక్కంటికి ప్రతిరూపంగా మూడు రంధ్రాలున్న నారికేళముని ఛేదించి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి తదుపరి ఆ ముగ్గురు రాక్షసులను ఏ ఆటంకం లేకుండా సంహరించాడు. అందుకే సర్వవిఘ్నోపశాంతుడైన వినాయకుని దర్శన సమయంలో కొబ్బరికాయలను కొడతారు.
గుంజీలు
ఒకసారి వినాయకుడు మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకుపోయి మింగేశాడు. ఎంత ప్రాధేయపడినా దాన్ని విష్ణుమూర్తికి తిరిగి ఇవ్వలేదట. వినాయకుడు చూస్తే బాలుడు. అందుకని విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ముందు తన నాలుగు చేతులతో తన రెండు చెవులను పట్టుకుని, కూర్చుని, నిలబడి గుంజీలు తీస్తూ అతని చుట్టూ తిరుగుతూ నృత్యం చేయసాగాడు. ఆ వింతను చూసిన వినాయకుడు ఉండబట్టలేక, బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. అలా కడుపుబ్బ పకపక నవ్వడంతో వినాయకుని గొంతు నుండి ఆ చక్రం కాస్తా ఊడి బయటపడింది. వినాయకుని కనక మనం ప్రసన్నం చేసుకుంటే జీవితంలో దొరకనిదంటూ ఏమీ ఉండదు. పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి పొందవచ్చు. అందుకే వినాయకుని ముందు గుంజీలు తీస్తారు.
మట్టి తో చేసిన వినాయకుడినే పూజించుదాం.

21 రకాల పత్రి

వినాయక వ్రత పూజలో వాడే పత్రిలో చాల ప్రత్యేకత ఉంది. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తాము. అది ఒక పూజద్రవ్యమే కాక, పెద్ద ఓషధుల సమూహం అని చెప్పొచ్చు. పూర్వకాలంలో పిల్లలు చవితి ముందు రోజు, ఊరంతా తిరిగి ఆ 21 రకాల పత్రాలను సేకరించేవారు, అవి పూజకు ఉపయోగించుటకే కాక, పిల్లలు చెట్లను గుర్తు పట్టడానికి కూడ సహాయపడేది.
అందులో మొదటిది మాచీ పత్రం : ఈ పత్ర కషాయం వలన దద్దుర్లు, పుండ్లు తగ్గడమే కాక, కుష్టు వంటి వ్యాధులకు చక్కని ఓషది.2. బృహతీ పత్రం : శ్వాసకోశ సంబందిత వ్యాధులను తగ్గిస్తుంది.3. బిల్వ పత్రం / మారేడు : పరమశివునికి మహా ప్రీతికరమైనది, ఇది విరోచనాలు తగ్గటానికి వాడుతారు.
4. గరిక : గణప్పయ్య కు చాల ప్రీతి. రోజు పూలు ఉన్నా లేకపోయినా గరికతో పూజిస్తే చాలు వినాయకుడు సంత్రుప్తుడవుతాడు. గాయాలకు గరిక, ఉప్పు, పసుపు కలిపి రాస్తే తగ్గుతాయి.
5. దత్తూర పత్రం / ఉమ్మెత్త : లైంగిక వ్యాధులకు నివారిణి.6. రేగు పత్రం : అజీర్తి, చర్మ వ్యాధులకు చక్కటి మందు.7. కరవీర పత్రం / గన్నేరు : దురదల నివారణకు ఉపయోగిస్తారు.8. విష్ణుక్రాంత పత్రం : జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మందు.9. దాడిమీ / దాన్నిమ్మ పత్రం : జీర్ణకోశ వ్యాధులకు మందు.10. మరువక పత్రం : పూల మధ్య వేసి కడ్తారు, దీన్నే మరువం అంటాం. మంచి వాసన వస్తూ ఉంటుంది. జుట్టు కి బలాన్ని చేకురుస్తుంది, జీర్ణపుష్టికి మంచిది.
11. వావిలాకు : కీళ్ళనొప్పులకు మంచి మందు12. జాజి పత్రం : నోటిపూతకు, వాతానికి, పైత్యానికి మంచిది.13. శమీ పత్రం : కుష్ఠువ్యాధులకు మంచి మందు14. అశ్వత్ధ పత్రం : శ్వాసకోశ వ్యాధుల నివారణకు మంచిది15. మద్ది ఆకు : గాయాలు, పుండ్లు వంటివాటికి మంచిది16. జిల్లేడు ఆకు : విషాన్ని హరిస్తుంది. 17. గండకీ పత్రం : ఇందులో కూడ చాలమంచి ఓషద గుణాలు ఉన్నాయి18. ఉత్తరేణి : జీర్ణ సంబంధిత వ్యాదులకు దివ్య ఓషధి

19. తులసి 20. దేవదారు 21. మామిడాకులు

Friday, August 26

రుద్రాక్ష

మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. పురాణ కథ: "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం.

రుద్రాక్షల గురించి వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణం, మరియు రుద్రాక్ష జబలోపనిషత్ లలో వివరంగా చర్చింపబడింది. శివపురాణం ప్రకారం రుద్రాక్ష పుట్టుక ఇలా ఉంది.
రాక్షసరాజైన త్రిపురాసురుడు వరబలం వలన అత్యంత శక్తివంతుడై, దేవతలకు కంటకుడిగా మారాడు. దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి తమ బాధలు మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడూ త్రిపురాసుర సంహారం కోసం అత్యంత శక్తిమంతమైన ' అఘోరాస్త్రం ' తయారుచేయదలచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా సమాధిలోకి వెళ్ళిన పరమశివుడు చాలా కాలం తరువాత కళ్ళు తెరచినప్పుడు శివుని కన్నుల నుండి కొన్ని ఆశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి. రుద్రాక్ష చెట్టు నుండి వచ్చే ఫలాలలో ఉండే బీజములే మనం రుద్రాక్షలని అంటాము.

పరమశివుని త్రినేత్రములు సూర్య, చంద్ర, అగ్ని రూపాలు. అందులో సూర్యనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు గోధుమరంగులో ఉంటాయి. ఇవి పన్నెండు రకాలు. చంద్రనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు లేత ఎరుపురంగులో ఉంటాయి. ఇవి మొత్తం 16 రకాలు. అగ్ని నేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు నల్లగా ఉంటాయి. ఇవి మొత్తం 10 రకాలు. సూర్యనేత్రం నుండిపుట్టిన గోధుమరంగు రుద్రాక్షలను లేత గోధుమరంగు రుద్రాక్షలు, ముదురు గోధుమరంగు రుద్రాక్షలు గా విభజించ వచ్చు. అన్ని రకాల రుద్రాక్షలు కలిపి మొత్తం ముప్పైఎనిమిది రకాల రుద్రాక్షలు మనకు దొరుకుతున్నాయి.
ఎవరైతే 108 రుద్రాక్షలను ధరిస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని, వారి 21 తరాలవారు శివలోక సాయుజ్యం పొందుతారని, ఎవరైతే 1100 రుద్రాక్షలని ధరించినా, 555 రుద్రాక్షలను కిరీటంలా ధరించినా, 320 రుద్రాక్షలను జంధ్యంగా మూడు వరుసలో ధరించినా వారు పరమశివునితో సమానమని పురాణాలు చెప్తున్నాయి.

రుద్రాక్షలు - రకాలు
ముందుగా చెప్పినట్టు మనకు మొత్తం 38 రకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. రుద్రాక్షల విలువ వాటీ ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. మినుము గింజప్రమాణం గల రుద్రాక్షలకు చాలా రోగనిరోధక శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనకు శ్రేష్ఠమైనవని శాస్త్రం. భారతదేశంలో దిగువ హిమాలయాలలో లభించే రుద్రాక్షలు పరిమాణంలో చిన్నవి. నేపాల్ లో లభించే రుద్రాక్షలు పెద్దవిగా ఉంటాయి.
"పత్రి" అనే రుద్రాక్ష చదునుగా ఉండే ఒక విషేషమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ప్రస్తుతం అంత విరివిగ లభించటంలేదు.


ప్రత్యేకమైన రుద్రాక్షలలో చెప్పుకోదగినవి "గౌరీ-శంకర రుద్రాక్ష", "గణేష రుద్రాక్ష"


వివిధ రుద్రాక్షలను వాటి ' ముఖాల ' ద్వారా గుర్తించవచ్చు. ఒక రుద్రాక్ష ఎన్ని ముఖాలదో తెలుకోవాటానికి సులభమైన మార్గం ఏమిటంటే ! ఆ రుద్రాక్షమీద ఎన్ని గీతలున్నాయో అది అన్ని ముఖాల రుద్రాక్ష.

పురాణాలు వివిధ రుద్రాక్షలను వివిధ దేవతలతో పోల్చారు.
ముఖాలు - దేవత - సంబంధిత గ్రహం
1 ముఖి - శివుడు / సూర్యుడు - సూర్యుడు
2 ముఖి - అర్ధనారీశ్వరుడు - చంద్రుడు
3 ముఖి - అగ్ని - కుజుడు
4 ముఖి - బ్రహ్మ - బుధుడు

5 ముఖి - కాలాగ్ని రుద్ర - గురుడు
6 ముఖి - కార్తికేయుడు - శుక్రుడు
7 ముఖి - అనంగ - శని
8 ముఖి - గణేష - రాహు

9 ముఖి - భైరవుడు - కేతు

10 ముఖి - విష్ణుమూర్తి - బుధుడు

11 ముఖి - ఏకాదశ రుద్రులు - కుజుడు/గురుడు
12 ముఖి - ఆదిత్యుడు - సూర్యుడు
13 ముఖి - కార్తికేయుడు - కుజుడు
14 ముఖి - శివుడు / హనుమంతుడు శని

21 ముఖి - కుబేరుడు
గమనించవలసింది ఏమిటంటే రుద్రాక్షలు ధరించటం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు.

ముఖాలు : ఫలితాలు

1 ముఖి : సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.
2 ముఖి : సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపుచేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.

3 ముఖి : సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం
4 ముఖి : ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది

5 ముఖి : కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.

6 ముఖి : కుడి చేతికి కట్టుకుంటే లోబిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి
7 ముఖి : ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది

8 ముఖి : ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ

9 ముఖి : వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది

10 ముఖి : నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది

11 ముఖి : సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది
12 ముఖి : రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది
13 ముఖి : అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది
14 ముఖి : శని సంబంధిత సమస్యలకు మంచిది.

Saturday, August 20

శ్రీ కృష్ణాష్టకమ్

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్దురుమ్

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్దురుమ్


కుటిలాలకసంయుక్తం - పూర్ణ చంద్రనిభాననం
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్దురుమ్

మన్దారగంధంసంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్దురుమ్


ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్దురుమ్

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్దురుమ్


గోపికానాం కుచద్వన్ద్వ కుంకుమాంకితవక్షసం
శ్రీ నికేతనం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్

శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్దురుమ్

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ య: పఠేత్
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి

ఇతి శ్రీ కృష్ణాష్టకమ్

Friday, August 19

శ్రీకృష్ణాష్టమి

ద్వాపర యుగం, శుక్ల నామ సంవత్సరంలో, శ్రావణమాసం, బహుళపక్షం, రోహిణి నక్షత్రం. అష్టమినాడు, రెండు ఝాముల రాత్రివేళ, మేనమామ గండంతో చిన్నికృష్ణుడు జన్మించాడు. జయంతి అంటే రాత్రి అనే అర్ధాన్ని బ్రహ్మాండపురాణం తెలుపుతోంది. కృష్ణుడు జన్మించిన అష్టమికి కొందరు ప్రాధాన్యం ఇస్తే, మరికొంతమంది రోహిణి నక్షత్రానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ కారణాలవల్ల ఒకరోజు అటుఇటు కృష్ణాష్టమిని జరుపుకొంటారు.


కృష్ణాష్టమి రోజు చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలని, బంగారు లేదా వెండితో తయారుచేసిన చంద్రబింబాన్ని వెండి/బంగారు పాత్రలో ఉంచి పూజించి ఆర్ఘ్యమిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని పెద్దలంటారు. తరువాత శ్రీకృష్ణుని పూజ చేయాలి.
లీలామానుషధారుడైన ఆ బాలకృష్ణుని బాల్యక్రీడలను మాత్రమే భక్తులు ఎక్కువగా స్మరించుకొంటారు, అందుకు గుర్తుగా ఉట్లు కొట్టడం, చిన్నపిల్లలను కృష్ణునిలా అలంకరించి వారి పాదాలతో చిన్నిచిన్ని అడుగులు వేయించి, ఆ బాల కృష్ణుని అడుగులవలే భావించి, కృష్ణుడే తమ ఇంటికి వచ్చాడనే తీయ్యని అనుభూతిలో మునిగిపోతారు.

ఈ రోజున స్వామికి నైవేద్యంలో మినపపిండితో పంచదారను కలిపి చెసిన పదార్ధాన్ని పెడుతారు. మరికొందరు శొంఠి, బెల్లంపానకం, నెయ్యితో కలిపి చేసిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెడ్తారు. ఆరో ఏట గోపికా వస్త్రాపహరణం, ఏడో ఏటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం చేసిన కన్నయ్య జన్మించినది అర్ధరాత్రి కాబట్టి జన్మదినోత్సవాన్ని అర్ధరాత్రి జరుపుకోవడం పద్దతి. కృష్ణ విగ్రహాన్ని పొన్నపూలతో పూజ, 16 పిండివంటలతొ నైవెద్యం పెట్టడం ఆచారం.

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానస రాజహంసః||
ప్రాణ ప్రయాణ సమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||
ఓ కృష్ణా! మరణ సమయంలో నిన్ను స్మరిస్తూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది. కాని! ఆ వేళ కఫవాత పైత్యాలతో కంఠం మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శత్రు అభేద్యమైన 'నీ పాద పద్మ వజ్రపంజర'మందు ఉంచుతున్నాను తండ్రీ...!

Thursday, August 18

విగ్రహారాధన

విగ్రహారాధనను కొంతమంది ప్రముఖులే ఖండించారు. అంటే విగ్రహారాధన పనికిరాదనా దాని అర్ధం. కాదు ఎందుకంటే పెద్దలు పెట్టిన ఏ పద్దతి, శాస్త్రం తప్పు కాదు. అందులో ఏదో అర్ధం నిగూఢంగా దాగి ఉంటుంది. దానిని గ్రహించి మనం దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ' అన్న వ్యక్తుల మాటలు పట్టించుకోరాదు.

మొత్తం భగవంతుని ఉపాసించే పద్దతులు నాలుగు. అది ప్రతీకోపాసన, ప్రతిమోపాసన, విభూతోపాసన, విరాటోపాసన. ప్రతీకోపాసన అనగా ఆధ్యాత్మిక రంగంలో ఒకటో తరగతి. ఏదో ప్రతీకను (పసుపుముద్దో, కొయ్యముక్కో ఇలా) పెట్టి దానినే దైవంగా పూజించటం. రెండవది ప్రతిమోపాసన ఇది ఈ వ్యాసంలో మనం చర్చిస్తున్న విగ్రహారాధన. ఒక ప్రతిమను పెట్టి దానిని దైవంగా పూజించటం. ఇది ఆధ్యాత్మిక రంగంలో రెండవ తరగతి. ఎంత గొప్ప వ్యక్తి అయినా క్రింది తరగతులు చదివే కదా ఉన్నత విద్యకు పోయేది. ఈ విగ్రహారాధన సాధకుని మనస్సును దైవంపై స్థిరపర్చుతుంది. మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

ఆంజనేయ ప్రపంచంలో ఎక్కువగా భక్తులను ఆదుకొనేది విగ్రహారాధనే. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుపతి వెంకన్న, కాశీ విశ్వేశ్వరుడు, అయ్యప్పస్వామి అందరూ కలియుగంలో విగ్రహరూపంలో వెలసి భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతున్నవారే. దానిలో ఏ ఆకర్షణ, శక్తి లేకపోతే ఇన్ని లక్షల మంది భక్తులు, అన్ని కోట్లు సమర్పించుకొని తమ కోర్కెలు నెరవేర్చుకొంటున్నారు. ఇలా చెప్పుకుపోతే ప్రపంచంలో చాలా శక్తివంతమైన ప్రత్యక్ష నిదర్శనం గల విగ్రహాలు ఉన్నాయి. శ్రీరామదాసు లాంటి మహాభక్తులు కూడా మొదట ప్రతిమను పట్టుకొని పునీతులైన వారే. విగ్రహారాధనను ఖండించిన వారు తమ అహంకారాన్ని ఖండించుకోలేని వారే! వివేకానంద స్వామివారు ఒకసారి దేశాన్ని పర్యటిస్తూ విగ్రహారాధన అంటే మండిపడే ఓ రాజు ఉన్నదేశానికి వచ్చారు. ఆయన ఆ రాజును సంస్కరించాలని అనుకొన్నారు. "మీరు ఎన్ని చెప్పండి. విగ్రహం అంటే ఓ బొమ్మ. మట్టి లోహం తప్ప అందులో మరే విశేషమూ లేదు. యోగం ద్వారా భగవంతుని చేరుకోవటమే నిజమైన మార్గం" అన్నారు. దానికి వివేకానందుడు చిరునవ్వు నవ్వి ఆ రాజుగారి చిత్రపటాన్ని తెప్పించారు. అందరూ చూస్తూ ఉండగా ఆయన దివానును పిలిచి "ఈ పటంపై ఉమ్మేయ్" అన్నారు. ఆయన గడగడ వణుకుతూ "అపచారం అపచారం " అన్నాడు. ఇది రాజుగారికి కూడా కోపం తెప్పించింది. అప్పుడు వివేకానందుడు ఇలా అన్నాడు. ఈ బొమ్మలో ఏముంది రంగులేకదా! కాకపోతే ఇందులో రాజుగారి విగ్రహాన్ని చూసి భయపడుతున్నారు. అలాగే ఓ భక్తుడు కూడా మట్టి విగ్రహంలో కూడా తను మట్టిని చూడటం లేదు ఆ భగవంతుడ్నే చూస్తున్నాడు" అనగా ఆ రాజు గారు సిగ్గుపడ్డారు. నవవిధ భక్తిలో కూడా అర్చన ఒక భాగం. "అజ్ఞానాం భవనార్ధాయ ప్రతిమాః పరికల్పితా" (సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్ధమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది) అని దీని అర్ధం. కావున విగ్రహారాధన చేయకుండా భగవంతుని చేరుట దుర్లభం. దీనికి భక్తి ప్రధానం.

భవాని ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మొదటి సాధన ఇది. తమ ఇష్టదైవాన్ని విగ్రహరూపంలో పూజించటం పరబ్రహ్మను పూజించటమే అవుతుంది. దాని ద్వారా మనోనిగ్రహం పొంది తదుపరి నిర్గుణోపాసన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. సర్వవ్యాప్తి అయిన భగవంతుని శిలా, మృత్తిక, లోహ, దారుకలతో విగ్రహాలుగా మలచి మంత్ర తంత్ర సంస్కారములతో ఆవాహన చేసి, మంత్రతంత్ర విధులతో సామాన్యమైన భక్తులు పూజించి భగవంతుని అనుగ్రహం పొందుట శాస్త్ర సంబంధమై ఉన్నది. విగ్రహమనగా విశేషంగా గ్రహించునది. దైవశక్తిని గ్రహించునది. భగవద్గీత "ఉపాసింపవీలులేని భగవత్ తత్వాన్ని సామాన్య భక్తులు ఉపాసించటానికి విగ్రహారాధనే మేలు" అన్నది.

విగ్రహాలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇంట్లో నాలుగు నుంచి పన్నెండు అంగుళాల విగ్రహాలే ఉంచాలి. ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇక విభూతోపాసన, విరాటోపాసన అన్నది భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెల్పే ఆఖరి ఆధ్యాత్మిక దశలు.

Wednesday, August 17

కనకధారా స్తోత్రం(తాత్పర్యము)

కనకధార స్తోత్రం చాల శక్తివంతమైనది. స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. మా నాన్నగారు రోజు రైలు లో నెల్లూరు వస్తున్నారు. ఒక ముస్లిం అతను మా నాన్న పక్కన కూర్చొని, కనకధారస్తోత్రం పుస్తకం తీసి చదువుతున్నారు, మా నాన్న అది చూసి ఆశ్యర్యపోయారు. సాధారణం గా ముస్లింలు మన పుస్తకాలూ చదవరు కదా, తనని డిగితే, "కనకధార స్తోత్రం" చదివితే ధనముకు ఇబ్బంది వుండదు అని ఎవరో చెప్పారట, అప్పటినుండి చదువుతున్నాను, అంతా మంచే జరిగింది అని సమాధానం ఇచ్చారట.నమ్మకం వుండాలే కానీ మతాలు అడ్డురావు కదా.
శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద యేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. "స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది " అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం. ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది.

అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః
మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక

ముగ్ధాముహు ర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః
పెద్ద నల్లకలువపైనుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక

ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః
నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక.

భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య
హారావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాః
భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక

కాలాంబుదాలి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక

ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః
ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం
ఆనందహేతు రధికం మధువిధ్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః
సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ
పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక

దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే
దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై
వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము.

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము

నమోస్తు హేమాంభుజ పీఠికాయై
నమోస్తు భూమణ్డల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై
బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై
తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యోతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్ధ సంపదః
సంతనోతి వచనాఞ్గ మానసై
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును

సరసిజనిలయే సరోజ హస్తే
ధవళతమాం శుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం
కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం
దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను.

కమలే కమలాక్ష వల్లభేత్వం
కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః
అవలోకయ మా మకిఞ్చనానాం
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః
శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము.

స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాగినో
భవంతి తే భువి బుధ భావితాశయాః
ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు.

సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమోభవేత్
శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును.

Friday, August 12

శ్రావణాల పౌర్ణిమ / రక్షాబంధనం

శ్రావణాల పౌర్ణిమ ను రక్షాబంధనం / రాఖీ(రక్ష) / జంధ్యాల పండుగ గా పిలుచుకొంటాము., అన్నతమ్ములకు అక్కచెళ్ళెళ్ళు కట్టే రక్ష. ఈ రక్షబంధనమనునది నిన్న మొన్న వచ్చినది కాదు. ఎప్పటినుండో మన సంప్రదాయంలో ఉన్నదే. భవిష్యోత్తరపురాణంలో రక్షాబంధన ప్రస్తావన ఉంది. కాకపొతే ఇప్పుడు సంబరంగా జరుపుకొంటున్నాము. రాజులు యుద్ధాలకు వెళ్ళేముందు, ఎదైన కార్యం తలపెట్టే ముందు పూజలో ఉంచిన రక్షను కట్టుకొని మొదలుపెట్టి తప్పకుండా విజేయులయ్యేవారు.
అసలెందుకు శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమనే రక్షాబంధనంగా చేస్తాం?? మాములు పౌర్ణములు ఎందుకు చేయము? త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టి కారకుడు, విష్ణు స్థితి కారకుడు(రక్షణ కల్పించుట), శివుడు లయకారకుడు. విష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. అది ఏ పౌర్ణమి తిధి రోజున ఉంటుందో, ఆ రోజున విష్ణువును ధ్యానిస్తు రాఖీ(రక్ష) కట్టడంకోసం శ్రావణాలపూర్ణిమను నిర్ణయించారు పెద్దవాళ్ళు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసమాన్యమైన విష్ణు శక్తి ఉంటుంది. మరొక కధనం--"రాకా" అంటే, తనకున్న 15 కళలతో నిండుగాఉన్న చంద్రుడు ఉన్న పూర్ణిమ అని అర్ధం. ఈ "రాక" రోజున కట్టే రక్షనే "రాకీ" (రాకా సంబంధం ఉన్న రక్ష అని) అని పేరు, కాలక్రమేణా రాఖీ గా వాడుకలోకి వచ్చింది.

శ్రావణాలపౌర్ణమినాడు రోజులో ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చా?
కట్టకూడదు. మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే రాఖీ కట్టాలని శాస్త్రాలు చెపుతున్నాయి. మనం చేసే ప్రతీపనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి, రక్ష కట్టించుకొన్నవారిని కాపాడాలన్నదే దాని ఉద్దేశ్యం.

ఇప్పుడంటే అక్కచెళ్ళెళ్ళు మాత్రమే అన్నతమ్ములకు రక్ష కడుతున్నారు. పూర్వకాలంలో భార్య భర్త కి కూడ రక్ష కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కట్టడమే దీనికి నిదర్శనం.
ఇంకో కధనం మనందరికి తెలిసిందే, పురుషోత్తముడితో తలపడటానికి సిద్ధపడ్డాడు అలెగ్జాండర్. ఈ విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య, పురుషోత్తముడి ఆశ్రయం సంపాదించింది. పురుషోత్తముడికి సోదరి లేదన్న విషయం తెలుసుకొన్న రుక్సానా బేగం, శ్రావణాలపౌర్ణమి నాడు పురుషోత్తమునికి రాఖీ కట్టింది. బహుమానంగా భర్త ప్రాణములు కాపాడమని కోరింది. తనచేతికి ఉన్న రక్షకారణంగా అలెగ్జాండర్ ను చంపకుండా వదిలేసాడు పురుషోత్తముడు.

పొద్దునే లేచి, తల్లంటు స్నానం చేసి. "రక్ష" ను పూజలో ఉంచి, అన్నతమ్ములకు తిలకం దిద్ది, రక్షను కట్టాలి. అది అన్నతమ్ములకు రక్ష గానూ, అక్కచెళ్ళెళ్ళ పట్ల వారి భాద్యతకు ప్రతీక.
" యేనబద్ధో బలీ రాజ దానవేంద్రో మహాబలః
తేన త్వామసి బధ్నామి రక్షే మాచల మాచస"
"రాక్షసరాజైన బలి చక్రవర్తి శ్రీహరి చేత బంధించబడి, తిరిగి అతనిచేతే రక్షణ పొందాడో, అలాగే ఓ రాఖీ, నేను కడుతున్న రాఖీలో ఉన్న శక్తి చలించకుండా కట్టించుకోనేవారికి రక్షగా ఉండాలి" అని అర్ధం. ఈరోజున కొత్త యఙ్ఞోపవీతములను కూడా ధరిస్తారు. హయగ్రీవ జయంతి కూడా ఈరోజే.

Thursday, August 11

శివతాండవస్తోత్రం

ఈ శివతాండవస్తోత్రాన్ని రావణబ్రహ్మ పరమశివుడుని గురించి ఆశువుగా చెప్పాడని ప్రతీతి. రావణబ్రహ్మ భక్తి తత్పరతకి ఈ స్తోత్రం ఒక మచ్చుతునక.

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధ్దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
మదాంధసిందురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:

కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ

నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగుద్ధురంధరః

ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధూవ్రతం
స్మరాంతకం పురాంతకమ్ భవాంతకమ్ మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

కదానిలింపనిర్ఝరీ నికుంజకోతరేవసన్
విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
విలోలలోలలౌర్చనో లలాలబాలలగ్నహః
శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖిః భవావ్యహం

నిమగ్ని నిత్యమేవముక్తముక్తమోత్తమం స్తవం
పఠన్స్మరంబృవనరో విశుద్ధిమేతిసంతతం
హరేగురౌ సుభక్తిమాసుయాతినాం యధాగతిం
విమోహనం హి దేహినాంసు శంకరస్య చింతనం

ఫలస్తుతి:
పూజావసానసమయే దశవక్తంగీతం
యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే
తస్యస్థిరాం రదగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీంసదైవసుముఖీం ప్రదదాతి శంభుః

Tuesday, August 2

గరుడ పంచమి


నాగారాధనకు సంబంధించిన ముఖ్యరోజులలో కార్తీకశుద్ధ పంచమి " గరుడ పంచమి" / "నాగ పంచమి" గా ప్రసిద్ది. కొన్ని ప్రాంతాలలొ శ్రావణమాసంలో ఆచరిస్తారు. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడిని సుపర్ణుడు అను పేరు సార్ధకమైనది.

గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినత ల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ, వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఒ పందెం వేసుకొన్నారు, గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం.
కద్రువ తన కపటబుద్దితో. సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా. దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు.
కొద్దికాలం తరువాత గర్బవతి ఐన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి, సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుడుడు తల్లి దాశ్యం చూడలేక, దాశ్యవిముక్తి కోసం అమృతం తెచ్చివమ్మన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి, అమ్మకు దాశ్యం నుండి విముక్తి కలిగిచ్చాడు. అమృతభాండాన్ని తీసుకొని వెళ్తున్న గరుత్మంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకొనబోగా, తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికే ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు.
దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనించండి. ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉంటాడు, ఇందలి అంతరార్ధం " స్వామి నా కర్తవ్యనిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే" అని. ఆ విధంగానే మనము కూడ అనుక్షణం కర్తవ్య నిర్వహణకు సిద్ధంగా ఉండాలి.

నాగులనుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కాపాడుకొనేందుకు చేసే పూజ నాగపంచమి, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.
గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మనికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ/నాగ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు.