Thursday, August 18

విగ్రహారాధన

విగ్రహారాధనను కొంతమంది ప్రముఖులే ఖండించారు. అంటే విగ్రహారాధన పనికిరాదనా దాని అర్ధం. కాదు ఎందుకంటే పెద్దలు పెట్టిన ఏ పద్దతి, శాస్త్రం తప్పు కాదు. అందులో ఏదో అర్ధం నిగూఢంగా దాగి ఉంటుంది. దానిని గ్రహించి మనం దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ' అన్న వ్యక్తుల మాటలు పట్టించుకోరాదు.

మొత్తం భగవంతుని ఉపాసించే పద్దతులు నాలుగు. అది ప్రతీకోపాసన, ప్రతిమోపాసన, విభూతోపాసన, విరాటోపాసన. ప్రతీకోపాసన అనగా ఆధ్యాత్మిక రంగంలో ఒకటో తరగతి. ఏదో ప్రతీకను (పసుపుముద్దో, కొయ్యముక్కో ఇలా) పెట్టి దానినే దైవంగా పూజించటం. రెండవది ప్రతిమోపాసన ఇది ఈ వ్యాసంలో మనం చర్చిస్తున్న విగ్రహారాధన. ఒక ప్రతిమను పెట్టి దానిని దైవంగా పూజించటం. ఇది ఆధ్యాత్మిక రంగంలో రెండవ తరగతి. ఎంత గొప్ప వ్యక్తి అయినా క్రింది తరగతులు చదివే కదా ఉన్నత విద్యకు పోయేది. ఈ విగ్రహారాధన సాధకుని మనస్సును దైవంపై స్థిరపర్చుతుంది. మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

ఆంజనేయ ప్రపంచంలో ఎక్కువగా భక్తులను ఆదుకొనేది విగ్రహారాధనే. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుపతి వెంకన్న, కాశీ విశ్వేశ్వరుడు, అయ్యప్పస్వామి అందరూ కలియుగంలో విగ్రహరూపంలో వెలసి భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతున్నవారే. దానిలో ఏ ఆకర్షణ, శక్తి లేకపోతే ఇన్ని లక్షల మంది భక్తులు, అన్ని కోట్లు సమర్పించుకొని తమ కోర్కెలు నెరవేర్చుకొంటున్నారు. ఇలా చెప్పుకుపోతే ప్రపంచంలో చాలా శక్తివంతమైన ప్రత్యక్ష నిదర్శనం గల విగ్రహాలు ఉన్నాయి. శ్రీరామదాసు లాంటి మహాభక్తులు కూడా మొదట ప్రతిమను పట్టుకొని పునీతులైన వారే. విగ్రహారాధనను ఖండించిన వారు తమ అహంకారాన్ని ఖండించుకోలేని వారే! వివేకానంద స్వామివారు ఒకసారి దేశాన్ని పర్యటిస్తూ విగ్రహారాధన అంటే మండిపడే ఓ రాజు ఉన్నదేశానికి వచ్చారు. ఆయన ఆ రాజును సంస్కరించాలని అనుకొన్నారు. "మీరు ఎన్ని చెప్పండి. విగ్రహం అంటే ఓ బొమ్మ. మట్టి లోహం తప్ప అందులో మరే విశేషమూ లేదు. యోగం ద్వారా భగవంతుని చేరుకోవటమే నిజమైన మార్గం" అన్నారు. దానికి వివేకానందుడు చిరునవ్వు నవ్వి ఆ రాజుగారి చిత్రపటాన్ని తెప్పించారు. అందరూ చూస్తూ ఉండగా ఆయన దివానును పిలిచి "ఈ పటంపై ఉమ్మేయ్" అన్నారు. ఆయన గడగడ వణుకుతూ "అపచారం అపచారం " అన్నాడు. ఇది రాజుగారికి కూడా కోపం తెప్పించింది. అప్పుడు వివేకానందుడు ఇలా అన్నాడు. ఈ బొమ్మలో ఏముంది రంగులేకదా! కాకపోతే ఇందులో రాజుగారి విగ్రహాన్ని చూసి భయపడుతున్నారు. అలాగే ఓ భక్తుడు కూడా మట్టి విగ్రహంలో కూడా తను మట్టిని చూడటం లేదు ఆ భగవంతుడ్నే చూస్తున్నాడు" అనగా ఆ రాజు గారు సిగ్గుపడ్డారు. నవవిధ భక్తిలో కూడా అర్చన ఒక భాగం. "అజ్ఞానాం భవనార్ధాయ ప్రతిమాః పరికల్పితా" (సామాన్యులకు నిర్గుణాకారుడైన ఆ పరబ్రహ్మోపాసనార్ధమై మొదటి మెట్టుగా విగ్రహారాధన కల్పించబడినది) అని దీని అర్ధం. కావున విగ్రహారాధన చేయకుండా భగవంతుని చేరుట దుర్లభం. దీనికి భక్తి ప్రధానం.

భవాని ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మొదటి సాధన ఇది. తమ ఇష్టదైవాన్ని విగ్రహరూపంలో పూజించటం పరబ్రహ్మను పూజించటమే అవుతుంది. దాని ద్వారా మనోనిగ్రహం పొంది తదుపరి నిర్గుణోపాసన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. సర్వవ్యాప్తి అయిన భగవంతుని శిలా, మృత్తిక, లోహ, దారుకలతో విగ్రహాలుగా మలచి మంత్ర తంత్ర సంస్కారములతో ఆవాహన చేసి, మంత్రతంత్ర విధులతో సామాన్యమైన భక్తులు పూజించి భగవంతుని అనుగ్రహం పొందుట శాస్త్ర సంబంధమై ఉన్నది. విగ్రహమనగా విశేషంగా గ్రహించునది. దైవశక్తిని గ్రహించునది. భగవద్గీత "ఉపాసింపవీలులేని భగవత్ తత్వాన్ని సామాన్య భక్తులు ఉపాసించటానికి విగ్రహారాధనే మేలు" అన్నది.

విగ్రహాలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇంట్లో నాలుగు నుంచి పన్నెండు అంగుళాల విగ్రహాలే ఉంచాలి. ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇక విభూతోపాసన, విరాటోపాసన అన్నది భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెల్పే ఆఖరి ఆధ్యాత్మిక దశలు.

4 వినదగు నెవ్వరు చెప్పిన..:

Indian Minerva said...

విభూతోపాసన అంటే ఇతరజీవుల్లో దేవుణ్ణి చూడటం అనుకుంటున్నాను.

ఈ విరాటోపాసన అర్ధం కాలేదు వివరించగలరు.

G.P.V.Prasad said...

కొన్ని పంచుకుంటే పెరుగుతాయి కొన్ని అనుభవిస్తే తెలుస్తాయి. బాగుంది , ఇది దేవుణ్ణి నమ్మిన వారికి మరి దేవుడ లేడు అనే వారికి ఎలా చెప్పాలి?

గాయత్రి said...

అనుభవిస్తే తెలుస్తాయి అన్నారు కద, దేవుడిని నమ్మని వారికి కూడ జీవితంలో ఒక్కసారి, ఏదో తెలియని శక్తి ఉంది, అదే అన్నింటీకి మూలం అని ఖచ్చితంగ తెలుస్తుంది.

గాయత్రి said...

@indian minerva..
నాకు తెలిసినంత వరకు, విరాటోపాసన అంటే దేవాలయం లో మూలవిరాట్టు ని పూజించడం. అదే దేవాలయం లో ఉత్సవమూర్తి ని అక్కడ ఇక్కడ తిప్పుతారు కాని విరాట్రుపాన్ని కదపరు. నిజానికి జప, తర్పనం, హోమం అన్ని ఆ విరాట్రుపానికే చేస్తారు. మనం పెట్టిన నమస్కారం అన్ని కూడ ఆ విరాట్రుపానికే వెళ్తాయి.