Tuesday, August 30

వినాయక చవితి


ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రస్సన్నవదనం ధ్యాయేత్ సర్వ విఙ్ఞూప శాంతయే

విద్యారంభే, వివాహేచ ప్రవేశనిర్గమే తథా
సంగ్రామే, సర్వకార్యేషు విఘ్నస్తశ్యన జాయతే

మనం ఏ శుభ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తే కాని మొదలుపెట్టం. వినాయకచవితి నాడు కూడా ముందుగా పసుపు విఘ్నేశ్వరుని అర్చించి వినాయక వ్రతం మొదలుపెట్టడం మన ఆనవాయితీ. వినాయక అర్చన శైవులకే పరిమితం కాదు. వైష్ణవ దేవాలయాల్లో కూడా గజముఖుడైన విష్వక్సేనుని ముందు దర్శించి తర్వాత దైవదర్శనం చేసుకోవడం ఆచారం. ఈ విధంగా గణపతి ఆరాధన మనకు శుభం చేకూర్చే అధిదేవత అన్న విశ్వాసంతోనే గణేశ జన్మతిథిని వినాయక చవితిని పర్వదినంగా దేశమంతటా ఆబాలగోపాలం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు గణపతికి ఇష్టమైన నైవేద్యములు.
గజాననుడి కధ :
వినాయకుని విశిష్ట రూపానికి ఆయన ఆరాధన, అర్చనలలోని అపూర్వ సంప్రదాయాల వెనుక అనేక పరమార్థాలున్నాయి. నలుగు పిండితో సృష్టించిన బాలునికి ప్రాణం పోసిన పార్వతీదేవి అజ్ఞానుసారం కైలాస ద్వారం వద్ద కాపలాగా ఉన్న వినాయకుని శిరస్సును శివుడు ఖండిస్తే తదుపరి నిజం తెలుసుకుని ఉత్తరముఖుడై నిద్రిస్తున్న ఏనుగు తలను తెప్పించి ఆ బాలుని సజీవునిగా చేయగా వినాయకుడు గజాననుడయ్యాడు. ఇదేకాక, ఏనుగు ముఖం గల గజముఖాసురుని సంహరించడానికి వినాయకుడు ఏనుగు ముఖంతో అవతరించి ఆ రాక్షసుని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చాడు.
ఎంత చూసినా తనివి తీరని వింతలు ప్రపంచంలో మూడు ఉన్నాయి. అవి సంపూర్ణ చంద్రబింబం, సముద్రం, ఏనుగు. చంద్రబింబాన్ని ఎంతసేపు చూసినా మనకు తృప్తి ఉండదు. అలాగే ఎగసిపడే కెరటాలతో కోలాహలంగా ఉండే సముద్ర దృశ్యం మనలను కట్టి పడేస్తుంది. భారీ శరీరంతో ఠీవిగా నిలబడి, బారెడు తొండం, మూరెడు దంతాలతో విన్యాసాలు చేసే గజరాను వింతగా వీలైనంత సేపు చూస్తూనే ఉంటారు. ఇలాంటి అంతులేని అవ్యాజానందాన్నివ్వడానికే వినాయకుడు గజరూపం దాల్చాడు.
ఏకదంతుడు ఎలా
య్యాడు?
సాధారణంగా ఏనుగుకు రెండు దంతాలుంటాయి. ఒకటే దంతమున్న ఏనుగు అంత అందంగా ఉండదు కదా? దీనిలో ఒక పరమ సత్యం నిగూఢమై ఉంది. పంచమ వేదమనబడే మహాభారతాన్ని వేదవ్యాసుడు ఆశువుగా చెపుతుంటే, వినాయకుడు దాన్ని వింటూ, తాళపత్రాలపై రచించవలసి వచ్చింది. అందుకోసం తన దంతానొక దానిని విరిచి దానిని ఘంటంగా వాడి మహాభారత రచన చేశాడు. ఇందులోని పరమార్థమేమంటే, జ్ఞాన సముపార్జన కోసం మనం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి. దంతాలు ఏనుగు అందాన్ని ఇనుమడింపజేస్తాయి. వాటిని అది ప్రాణప్రదం చూసుకుంటుంది. వాటిని రాపిడి చేసి మెరిసేలా చేసుకుంటుంది. అయినప్పటికి గణపతి దానిని విరిచి మహత్తరమైన మహాభారత కావ్యాన్ని రచించడానికి ఉపయోగించాడు.
మరో పురాణ గాథ ప్రకారం, కార్తవీర్యుని సంహరించిన పరశురాముడు శివుని దర్శించడానికి కైలాసం వెడతాడు. తల్లిదండ్రులైన శివ, పార్వతులు శయన మందిరంలో ఉన్నందున వారి ఏకాంతానికి భంగం కలుగతుందని విఘ్నేశ్వరుడు పరశురాముని లోనికి వెళ్లవద్దని అడ్డగిస్తాడు. వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. వినాయకుడు తన బలమైన తొండంతో పరశురాముని ఎత్తి పడేస్తాడు. ప్రతిగా పరశురాముడు తన పరశువుతో విఘ్నేశ్వరుని ఎదుర్కొనగా ఆ దెబ్బకు ఆయన దంతం ఒకటి విరిగిపోతుంది. ఆ విధంగా ఆయన ఏకదంతుడయ్యాడు.
మూషిక వాహనుడు
మూషికాసురుడు అనే రాక్షసుడు వినాయకునితో యుద్ధానికి తలపడి గందరగోళం సృష్టించగా పాశాంకుశధరుడు వానిని ఒక చిట్టెలుకగా మార్చి తన చెప్పుచేతల్లో పడి ఉండే వాహనంగా అణగద్రొక్కాడు.
టెంకాయ కొట్టడంలో అంతరార్ధం
మన కోరికలు నెరవేరితే వినాయకునికి టెంకాయ కొడతామని మొక్కుకుంటాం. దీనిలో కూడా ఒక పరమార్థం ఇమిడి ఉంది. తామ్ర, లోహ, స్వర్ణ అనే త్రిపురాలను ఆక్రమించిన ముగ్గురు రాక్షస రాజులు ప్రజలను పట్టి పీడిస్తుంటే ముక్కంటి వారిని సంహరించడానికి ప్రయత్నించినపుడల్లా ఏదో ఒక విఘ్నం సంభవించేది. విఘ్న రాజైన పుత్రుడు వినాయకుని సంప్రదించగా ఆయన సూచన ప్రకారం ముక్కంటికి ప్రతిరూపంగా మూడు రంధ్రాలున్న నారికేళముని ఛేదించి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి తదుపరి ఆ ముగ్గురు రాక్షసులను ఏ ఆటంకం లేకుండా సంహరించాడు. అందుకే సర్వవిఘ్నోపశాంతుడైన వినాయకుని దర్శన సమయంలో కొబ్బరికాయలను కొడతారు.
గుంజీలు
ఒకసారి వినాయకుడు మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకుపోయి మింగేశాడు. ఎంత ప్రాధేయపడినా దాన్ని విష్ణుమూర్తికి తిరిగి ఇవ్వలేదట. వినాయకుడు చూస్తే బాలుడు. అందుకని విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ముందు తన నాలుగు చేతులతో తన రెండు చెవులను పట్టుకుని, కూర్చుని, నిలబడి గుంజీలు తీస్తూ అతని చుట్టూ తిరుగుతూ నృత్యం చేయసాగాడు. ఆ వింతను చూసిన వినాయకుడు ఉండబట్టలేక, బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. అలా కడుపుబ్బ పకపక నవ్వడంతో వినాయకుని గొంతు నుండి ఆ చక్రం కాస్తా ఊడి బయటపడింది. వినాయకుని కనక మనం ప్రసన్నం చేసుకుంటే జీవితంలో దొరకనిదంటూ ఏమీ ఉండదు. పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి పొందవచ్చు. అందుకే వినాయకుని ముందు గుంజీలు తీస్తారు.
మట్టి తో చేసిన వినాయకుడినే పూజించుదాం.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: