Friday, August 12

శ్రావణాల పౌర్ణిమ / రక్షాబంధనం

శ్రావణాల పౌర్ణిమ ను రక్షాబంధనం / రాఖీ(రక్ష) / జంధ్యాల పండుగ గా పిలుచుకొంటాము., అన్నతమ్ములకు అక్కచెళ్ళెళ్ళు కట్టే రక్ష. ఈ రక్షబంధనమనునది నిన్న మొన్న వచ్చినది కాదు. ఎప్పటినుండో మన సంప్రదాయంలో ఉన్నదే. భవిష్యోత్తరపురాణంలో రక్షాబంధన ప్రస్తావన ఉంది. కాకపొతే ఇప్పుడు సంబరంగా జరుపుకొంటున్నాము. రాజులు యుద్ధాలకు వెళ్ళేముందు, ఎదైన కార్యం తలపెట్టే ముందు పూజలో ఉంచిన రక్షను కట్టుకొని మొదలుపెట్టి తప్పకుండా విజేయులయ్యేవారు.
అసలెందుకు శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమనే రక్షాబంధనంగా చేస్తాం?? మాములు పౌర్ణములు ఎందుకు చేయము? త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టి కారకుడు, విష్ణు స్థితి కారకుడు(రక్షణ కల్పించుట), శివుడు లయకారకుడు. విష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. అది ఏ పౌర్ణమి తిధి రోజున ఉంటుందో, ఆ రోజున విష్ణువును ధ్యానిస్తు రాఖీ(రక్ష) కట్టడంకోసం శ్రావణాలపూర్ణిమను నిర్ణయించారు పెద్దవాళ్ళు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసమాన్యమైన విష్ణు శక్తి ఉంటుంది. మరొక కధనం--"రాకా" అంటే, తనకున్న 15 కళలతో నిండుగాఉన్న చంద్రుడు ఉన్న పూర్ణిమ అని అర్ధం. ఈ "రాక" రోజున కట్టే రక్షనే "రాకీ" (రాకా సంబంధం ఉన్న రక్ష అని) అని పేరు, కాలక్రమేణా రాఖీ గా వాడుకలోకి వచ్చింది.

శ్రావణాలపౌర్ణమినాడు రోజులో ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చా?
కట్టకూడదు. మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే రాఖీ కట్టాలని శాస్త్రాలు చెపుతున్నాయి. మనం చేసే ప్రతీపనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి, రక్ష కట్టించుకొన్నవారిని కాపాడాలన్నదే దాని ఉద్దేశ్యం.

ఇప్పుడంటే అక్కచెళ్ళెళ్ళు మాత్రమే అన్నతమ్ములకు రక్ష కడుతున్నారు. పూర్వకాలంలో భార్య భర్త కి కూడ రక్ష కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కట్టడమే దీనికి నిదర్శనం.
ఇంకో కధనం మనందరికి తెలిసిందే, పురుషోత్తముడితో తలపడటానికి సిద్ధపడ్డాడు అలెగ్జాండర్. ఈ విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య, పురుషోత్తముడి ఆశ్రయం సంపాదించింది. పురుషోత్తముడికి సోదరి లేదన్న విషయం తెలుసుకొన్న రుక్సానా బేగం, శ్రావణాలపౌర్ణమి నాడు పురుషోత్తమునికి రాఖీ కట్టింది. బహుమానంగా భర్త ప్రాణములు కాపాడమని కోరింది. తనచేతికి ఉన్న రక్షకారణంగా అలెగ్జాండర్ ను చంపకుండా వదిలేసాడు పురుషోత్తముడు.

పొద్దునే లేచి, తల్లంటు స్నానం చేసి. "రక్ష" ను పూజలో ఉంచి, అన్నతమ్ములకు తిలకం దిద్ది, రక్షను కట్టాలి. అది అన్నతమ్ములకు రక్ష గానూ, అక్కచెళ్ళెళ్ళ పట్ల వారి భాద్యతకు ప్రతీక.
" యేనబద్ధో బలీ రాజ దానవేంద్రో మహాబలః
తేన త్వామసి బధ్నామి రక్షే మాచల మాచస"
"రాక్షసరాజైన బలి చక్రవర్తి శ్రీహరి చేత బంధించబడి, తిరిగి అతనిచేతే రక్షణ పొందాడో, అలాగే ఓ రాఖీ, నేను కడుతున్న రాఖీలో ఉన్న శక్తి చలించకుండా కట్టించుకోనేవారికి రక్షగా ఉండాలి" అని అర్ధం. ఈరోజున కొత్త యఙ్ఞోపవీతములను కూడా ధరిస్తారు. హయగ్రీవ జయంతి కూడా ఈరోజే.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: