Sunday, January 29

వసంత పంచమి / శ్రీ పంచమి

ఈనెల 28న మనం శ్రీపంచమిని జరుపుకున్నాము. శ్రీపంచమి గురించిన విశేషాలు కొన్ని...
వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయని హేమాద్రి తెలిపారు. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. 'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో ఉంది.

వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు.

వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని తు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత తువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత తువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత తువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత తువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత తువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.

కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు.
తురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.

చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.

Friday, January 27

రధసప్తమి (2)

సూర్యోపాసన
“సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ” - మన సౌర కుటుంబంలోని అన్ని ప్రాణులకూ సూర్యుడే ఆత్మ. కృష్ణయజుర్వేదంలోని, అరణ్యకభాగంలో “అరుణ ప్రశ్న” ఉంది. ఇక్కడ ప్రశ్న అనగా కొన్ని ప్రకరణాల సముదాయము. దీనిని పారాయణ చేస్తే ఋణ, రోగ, శతృ బాధలు నశిస్తాయి. మనం మంత్రపుష్పంలో ఒకటిగా పేర్కొనే “యోపాం పుష్పంవేద, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి” అనే వాక్యాలున్న మంత్రం “అరుణం”లోనిదే. “ జలముల యొక్క పుష్ప స్వరూపం తెలుసుకొన్నవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపత్ సమృద్ధిమంతుడు అవుతాడని” అర్ధం.

సప్తాశ్వుడు
సూర్యకిరణకాంతి ఏడురంగులతో ఉంటుంది. ఆ కాంతివర్ణాలనే ఏడుగుఱ్ఱాలుగా పేర్కొని, సూర్యుణ్ణి “సప్తాశ్వుడు”, “సప్తసప్తి” అన్నారు. వాస్తవానికి, “వేగ”మనేది ఒక్కటే గుఱ్ఱం. సూర్యునికి గమనం ఒక్కటే, దాని పేరే “సప్త”. కాగా “సప్త” అనుపేరుగల గుఱ్ఱం అనగా, కాంతి గమనవేగం ఒక్కటే ఏడుగా వర్ణితమైంది. మనకు కనిపించే సూర్యుడొక్కడే అయినా, బ్రహ్మాండంలో ఇంకా 11మంది సూర్యులు (సూర్య గోళాలు) ఉన్నట్లు ఇటీవల శాస్త్రఙ్ఞులు కనుగొన్నారు. ప్రాచీన మహర్షులు ద్వాదశాదిత్యులు ఉన్నారని ఏనాడో గుర్తించియే ఉన్నారు, వారు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, ఆర్య, భాస్కరులు.
ఈ ద్వాదశాదిత్యులే సంవత్సరాత్మకమైన కాల విభాగంలోని ద్వాదశ మాసాలకు అధిదేవతలుగా పేర్కొనబడినరు. రాశులు కూడా ఇందువలనే 12గా ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కోమాసంలో ఒక్కోరాశిలో ప్రవేశిస్తాడు.
గాయత్రీమంత్రం సూర్యపరమైనదే.

రధసప్తమి రోజు తిరుమలేశుడు
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 7వాహనాలలో విహరిస్తారు. అవి సూర్యప్రభ వాహనం, చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమద్వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం. మధ్యాహ్నం “చక్రత్తాళ్వార్” (సుదర్శన చక్రం) వారికి వరాహస్వామి సన్నిధిలో చక్రస్నానం జరుగుతుంది. ఎన్నడులేని విధంగా ఒకేరోజు 7వాహనాల్లో, 7మార్లు, వివిధాలంకారాల్లో, దివ్య శోభలతో శ్రీవారు ఉత్సవమూర్తిగా దర్శనమివ్వడం, రధసప్తమి నాడు మత్రమే జరిగే విశేష విశిష్ట మహోత్సవం

రధసప్తమి (30.01.12)

రధసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించే పండుగ. ఇది మాఘశుద్ధ సప్తమినాడు వస్తుంది. సూర్యగ్రహణంతో సమానమైన పర్వంగా శాస్రాలు పేర్కొన్నాయి. ఈరోజు అరుణోదయకాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడమ్మహాపుణ్యఫలప్రదమని,ఆరోగ్యకరమని, అకాలమృత్యుపరిహారకమనీ, మరణాంతరం సూర్యలోకాన్ని పొందుతారనీ మహర్షులు పేర్కొన్నారు.

సూర్యగ్రహణతుల్య సౌ శుక్లా మాఘస్యసప్తమీ
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మహాఫలం
మాఘేమాసి సితేపక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః

షష్టినాడు రాత్రి ఉపవాసం చేసి, సప్తమీనాడు అరుణోదయకాలంలో స్నానం చేస్తే 7జన్మల పాపాలు తొలుగుతాయనీ, రోగాలు, దుఃఖాలు నశిస్తాయనీ, జన్మజన్మాంతకర మనోవాక్కా యఙ్ఞాతాఙ్ఞాతములనెడి సప్తవిధ పాపాలూ హరింపబడుతాయని ధర్మసింధువు పేర్కొన్నది.

సూర్యజయంతి
పరమాత్మ మాఘశుద్ధ సప్తమినాడు సూర్యుణ్ణి సృష్టించాడు. కనుకనే ఆ రోజుని "సూర్యజయంతి" ప్రస్సిద్ధ మయింది. సౌరసప్తమి, భాస్కరసప్తమి అనేవి సూర్యజయంతికి పర్యాయపదాలు. సంవత్సరానికి వచ్చే 24 సప్తముల్లోనూ రధసప్తమి ఖగోళ రీత్యా కూడా మహత్తు కలిగిఉంది.
ఈరోజు సూర్యోదయకాలంలో ఆకాశంలో నక్షత్రాల సన్నివేశం రధాకారంలో ఉంటుంది. రధాకారంలో నక్షత్రాలున్న సప్తమీదినం కనుక రధసప్తమి. సాధారణంగా చంద్రోదయసూర్యోదయ వేళాలో ఆకాశంలో ఉండే నక్షత్రాల సన్నివేశాన్ని బట్టి, వ్రతాలు, పూజలు, పండుగలు నిర్ణయించబడుతాయి.

స్నాన విధానం
వ్రతచూడామణిలో "బంగారు, వెండి, రాగి, ఇనుము వీనిలో దేనితోనైనా చేసిన దీపప్రమిదను సిద్ధం చేసుకొని, దానిలో నెయి/ నువ్వులనూనె/ ఆముదం/ ఇప్పనూనె తో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానికి గానీ, చెరువుల వద్దకుగానీ వెళ్ళి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళలో వదిలి, ఎవ్వరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7జిల్లేడాకులుగానీ, 7రేగు ఆకులు కాని తలపై పెట్టుకోవాలి

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్ప్తికే
సప్తవ్యాకృతికే దేవి, నమస్తే సూర్యమాతృకే
"సప్తాశ్వాలుండే ఓ సప్తమీ, నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము" అని చెప్తూ, సూర్యునికి, ఆర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.

పంచాగ కర్తలు రధసప్తమిని "సూర్యజయంతి" అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం. ఈరోజు అభొజ్యార్క వ్రాతాదులు ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే వ్రతం). వైవస్వతుడు 7వ మనువు. సూర్యుడుకి మరో పేరు వివస్వంతుడు. ఇతనికి కొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే) ఇతనికి మన్వతరానికి రధసప్తమియే సవత్సరాది. మన్వంతరాది ప్రవదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు, మకర సంక్రతివలనే పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కలిగించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం
రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి.
జిల్లేడు : శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము/తేలు విషాన్ని, పక్షపాతాన్ని, బోదకాలు వ్యాధిని పోగొడుతుంది. ఇంట్లో తెల్ల జిల్లేడు చాల శ్రేష్టం.

రేగు/బదరీ : దీని గింజలు మంచి బలాన్ని ఇస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగగొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, మంచి స్వరం వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచి రక్తాన్ని కల్గిస్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

ఇలా వృక్ష జాతిలోని జిల్లేడు, రేగు ఆకులు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. కనుక ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, నీళ్ళలోని
విద్యుచ్చక్తి కలిసి శరీరం పై, ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపి, మంచి ఫలితాలు ఇస్తాయి.
కేవలం రధసప్తమి రోజే కాక, మాములు రోజులలో కూడ ఈ ఆకులను ఉపయోగించి స్నానం చేయడం మంచిది. కాని, కనీసం ఏదాదిలో ఒక్కసారైనా తాకినా, వాటి స్పర్శా ప్రభావం ఆ సంవత్సరమంతా మనపై ఉంటుందని భావించి, ఈ పండుగనాడు శిరస్స్నానం తప్పక చేయాలని పెద్దలు సూచించారు.
ఈ ఆకులలో నిల్వచేయబడిన ప్రాణశక్తి, శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్ధీపనం చేసి అందలి నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివలన మానసిక దృఢత్వం, ఙ్ఞాపకశక్తి పెరుగుతాయి. శిరస్సంబంధమైన రోగాలు నశిస్తాయి.

Friday, January 20

గజేంద్ర మోక్షములోని ఒక ఘట్టము


మొసలిబారిన బడ్డ గజేంద్రుడు తనను రక్షింపుమని శ్రీహరిని వేడుకున్నాడు. అతని దీనాలాపన....


అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూలసౌధంబు దా
పలమందార వనాంతరామృతసర: ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకర మావినోదియగు నాపన్న ప్రసన్నుండు, వి
హ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభియై

అచట వైకుంఠపురమునందు, కల్పవృక్ష సమూహములతోనున్న అమృతసరోవర తీరమునందు గల రాజనగరిలోనున్న మణిమయకాంతులీను భవనములో కలువపూలు పరచిన చంద్రకాంతపాన్పు మీద శ్రీలక్ష్మీదేవితో గూడి విహరించుచున్న, ఆపన్న శరణాగత తత్పలుడైన యా శ్రీమన్నారాయణుండు తన భక్తుడైన గజరాజు యొక్క మొరవిని కాపాడతలచినవాడై తత్తరపాటుతో తటాలున

సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం
తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై

శ్రీమన్నారయణుండు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖియైన లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖ చక్ర గదాది ఆయుధములను జేపట్టక, పరివారంబును పిలువక, తనవాహనమైన గరుడునిపై గూడ నధిరోహింపక, జారిన జుట్టును గమనింపక, వేడుకలో లక్ష్మీదేవి కొంగుతో ముడివేసిన యామె పైటకొంగునుకూడ గమనింపక తొందరపాటుతో యీడ్చుచునే బయలుదేరెను.
అట్టి భక్తజనోద్ధారుకుడైన శ్రీమన్నారాయణుడిట్లు సమస్త జంతుకోటి హృదయములందు అమరియున్నవాడై, ఆకాశంబు వేంచేయుచున్న సమయంబున కారణము తెలియక పతిని వెంబడించుచు లక్ష్మీదేవియు, ఆమెనుగూడి యామె అంత:పురజనుంబులు, వారివెనుక గరుత్మంతుడు, యాతని వెనుక విల్లును, కౌమాదకీ, శంఖచక్రగదాధి ఆయుధంబులునూ, నారద మహర్షియునూ, విష్వక్సేనుడును తోడుగా వచ్చిరి. వైకుంఠపురమందలి ఆబాలగోపాలమంతయు అబ్బురపడుచు అరుదెంచిరి.

శ్రీమన్నారాయణుడు క్రొంగువీడుట మరచుటచే యీడ్వబడినదై యాతని వెంబడించుచూ లక్ష్మీదేవి యిట్లు తలపోసెను.

తనపతియైన శ్రీమన్నారాయణుండెందుకు బోవుచున్నాడో చెప్పడు. ద్రౌపది మున్నగు స్త్రీల ఆర్తనాదము విని రక్షింప దలంచెనో, వేదముల నెవరైనా తస్కరులు తస్కరించిరో, రాక్షసులు దేవతానగరిపై దండెత్తి వచ్చిరో, దుర్జనులు 'మీచక్రాయుధుడేడీ' అని ధూషణ తిరస్కారముల నిందించిరో అని తర్కించుచూ, ఊగుచున్న చెవికమ్మెలను సరిచేసుకొనక, విడిన కొప్పుముడిని మరల వేసికొనక, జారిన మొల నూలును సరిదిద్దుకొనక, చెరిగిన బొట్టును గమనింపక, తన ప్రాణేశ్వరుని చేత చిక్కిన పైటకొంగు తన కుచకుంభముల నుండి చెదరగా, సిగ్గు జెందినదై, కోటి చంద్రకాంతులనుబోలు ముఖారవిందముగల లక్ష్మీదేవి

అడిగెదనని కడువడిన జను
నడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ జిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

తొట్రుపాటుతో తన భర్త ఎచటి కేగుచున్నాడో తెలుసుకొన గోరి ఒక అడుగు ముందుకు వేసి, తనకు బదులిచ్చునో లేదో యని సంశయముతో వెనుకంజవేయుచు, మరల ముందరికేగి అడిగితే యేమగునోయని తొట్రుపాటుపడుచు నట్లేయుండిపోయి, మరల తెప్పరిల్లి శ్రీమనారాయణమూర్తిని వెంబడించెను.

ఆపిమ్మట శ్రీహరి మకరి గజేంద్రుల పోరు సలుపు మడుగును జేరి, ప్రచండప్రళయ భీకరమై కన్నులు మిరుమిట్లు గొల్పు సుదర్శన చక్రమును విడిచెను. ఆది మొసలి దాపునకు జేరి తటాలున దాని శిరస్సును ద్రుంచి సంహరించెను. అప్పుడు...
మకరమొకటి రవిజొచ్చెను
మకరము మరియొకటి ధనదు మాటున దాగెన్
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్

ఒక మకరము మకరరాశిని ప్రవేశించెను, మరియొకటి కుబేరుని జేరెను, మిగిలిన మకరములన్నియు ఆదికూర్మమును జేరి దాగుకొనెను. (ఇక్కడ అతిశయోక్తి అలంకారము ఉపయోగింబడినది. జలచర, మకరములన్నియు భీతినందినవి అని యర్ధము.) మొసలిబారినుండి రక్షింపబడిన గజేంద్రుడు అలసటతీర్చుకొనుటకై మిక్కిలి సంతోషాతిశయంబున వీనులవిందుగా ఘీంకారము జేసెను.

కరమున మెల్లన నివురుచు
గర మనురాగమున మెరసి కలయంబడుచున్
గరి హరికతమున బ్రదుకుచు
గరపీడనమాచరించె గరిణులు మరలన్

శ్రీహరి దయతో గజేంద్రుడు బ్రతికి బయటకు రాగా, ఆడ ఏనుగులన్నియు మహదానందముతో మమతానురాగములతో ఒకరి తొండములనొకరు పెనవేసుకున్నాయి.

తనతో వెంబడించి వచ్చిన లక్ష్మీదేవిని జూచి, జగత్ప్రభువైన శ్రీహరి యిట్లనెను

బాలా నావెనువెంటను
హేలన్వినువీధినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబు బట్టుట
కాలోనేమంటి నన్ను నంభోజముఖీ !

(నీచేలాంచలంబుబట్టుటకు ఆలోన్ ఏమంటివి)

ఓలక్ష్మీదేవీ! నీపైటకొంగుముడి విడదీయక గజేంద్రుని కాపాడాలనే సంరంభమున నిన్నుగూడ యీడ్చుకొనిపోయినందుకు నీవేమనుకొంటివి? సర్వదా నన్ను భజించువారి ఆపదలను నేను బాపాదును. అని పలికిన

దేవా! దేవరయడుగులు
భావంబున నిలిపికొల్చు పని నాపనిగా
కో వల్లభ! యేమని యేమనియెద
నీవెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతీ !

ఓ జగన్నాయకా! మీపాదసేవయే నాపరమావిధి. నాకు వేరొందు బనిలేదు. కావున మిమ్ములను వెంబడించితినేగాని మరే తలంపులేదు.

దీనులకుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవన బొందన్
దీనావన నీకొప్పును
దీన పరాధీన దేవదేవ మహేశా !

నిన్ను కొల్చినవారిని కొంగుబంగారమై కాపాడు దేవదేవా! మహేశా! ఆపన్నుల దీనాలాపములను విని రక్షించే రక్షకుడవు. భక్తులచే దీనులచే మిక్కిలిగా బొగడబడినవాడవు. నాకు నీవేదిక్కు అని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని గొనియాడెను.

ఆపిమ్మట సాదరసరస సల్లాప మందహాస పూర్వకముగా లక్ష్మీదేవిని ఆలింగనంబు గావించి సపరివారుండై గరుదారూఢుండగుచు శ్రీహరి నిజసదనంబునకుం జనియె.

ఫలశృతి

గజరాజమోక్షంబును
నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్
గజరాజవరదుడిచ్చును
గజతురగస్యందనములు గైవల్యంబున్

ఈగజేంద్రమోక్షమును భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో పఠించువారికి ఆశ్రీమన్నారాయణుడు ఏనుగులు, అశ్వములు, మొదలుగాగల అష్టైశ్వర్యములను, ఇహలోక, పరలోక, మొక్షమును సిద్ధింపజేయును.