Monday, January 2

అధ్యయనోత్సవం/ సంక్రాంతి/ కొడై తిరునాళ్ ఉత్సవం (తిరుమల)

అధ్యయనోత్సవం :
శాసనాల ద్వారా విదితమైన విషయం, అధ్యయనోత్సవం తిరుమలలో ముక్కోటి ఏకాదశికి 10రోజుల ముందు ఆరంభమై 20 రోజులు జరుగుతుంది. ఈ ఉత్సవంలో ఉత్సవమూర్తులను ఊరేగింపులో తీసుకొనిపోతూ ఆళ్వార్లు చెప్పిన నాలాయిరదివ్య ప్రబంధాన్ని పఠిస్తారు. ( ఇది సంస్కృత వేదాల వలె తమిళంలో ధర్మ వివరణ చేస్తూ తమిళ వేదాలు అనిపించుకొంటాయి.) ఈ ఉత్సవాన్ని రెండు భాగాలుగా విభజించి మొదటి పదిరోజులను పగల్పత్తు (పగటి పది) అనియు, తరువాతి 10రోజులను వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశితో ప్రారంభించి 10రాత్రులను రావత్తు అని పిలుస్తారు.
అధ్యయనోత్సవాలు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయంలో కూడా జరిగేవి. 5ఆళ్వారులకు 12రోజుల సాత్తుమొరైని ఏర్పరచి తిరుమలలో శ్రీ వేకటేశ్వర స్వామికి నివేదన సమర్పించిన తరువాత తిరుపతికి తీసుకొనివచ్చి ఆళ్వార్లకు అర్పించేవారు
ఈ ఉత్సవాల ప్రస్తావన క్రీ.శ.1400లోను తుది ప్రస్థావన క్రీ.శ.1635లోను ఉట్టంకిచబడిన దాఖలాలు లభిస్తున్నాయి.
ప్రాచీన కాలంలో చైత్ర మాసంలో శ్రీరామానుజుల వారి ముందు కూడ అధ్యనోత్సవం జరిగేది. అప్పుడు ఉత్సవమూర్తులను కూర్చుండబట్టడానికి లోపల కళ్యాణ మండపాన్ని వాడేవారు. మలయప్పస్వామి ఉత్సవమూర్తులను ఈనాడు కూడా బ్రహ్మోత్సవం మరియు అధ్యయనోత్సవానికి కూడా కళ్యాణమండపంలో వేంచేంపు చేయిస్తారు.

సంక్రాంతి:
ఖగోళ పధంలో సూర్యుని సంచారక్రమాన్ని అనుసరించి సంక్రాతులు ఏర్పడుతున్నాయి. లోకభాంధవుడైన సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే సమయం ఉత్తరాయణ పుణ్యకాలంకాగా, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సమయం దక్షిణాయణ పుణ్యకాలం అంటారు. మకర సంక్రమణ, కర్కాటక సంక్రమణం (సమరాత్రి దివాకాలము) లను సాధారణంగా అన్నింటా ఆచరణలో ఉన్నవి. విషుసంక్రాంతులకు అంత ప్రాముఖ్యత లేదు. అయినా, అన్ని విషేషకాల తిధులతో పాటు, అన్ని అమావాస్య తిధులూ పుణ్యమైనట్టివిగా భావిస్తారు. అందుకే తిరుమలలో వీటిని విశేషదినాలుగా పాటిస్తూ, విధివిహిత పూజాది కార్యక్రమాలు జరుపబడొతూ వస్తోంది.
ఈ పుణ్యరోజులలో తిరుమలలో స్వామి వారికి ప్రత్యేక పూజాదులు జరిపించేందుకు చాలమంది భక్తులు ఆధారద్రవ్యాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. క్రీ.శ.960 సం||లో రాణి సామవై ఏర్పాటు చేసిన దానకైంకర్యం మొదటిదిగా చెప్పవచ్చును. ఈ రాణి వార్షికంగా రెండు ఆయన సంక్రాతులలోను, రెండు విషుసంక్రాతులలోను పూజాదులు జరిపించే ఏర్పాటు చేసినట్లు శాశనం తెలుపుతోంది. అప్పటి నుండి శతాబ్దాలుగా సంక్రాతి పుణ్యకాలాన స్వామికి పూజలు జరిపించగోరిన భక్తుల సంఖ్య అధికమవుతూ వచ్చింది. సోమసూర్య గ్రహణానికి సంబంధించి పౌర్ణమి, అమావాస్య తిధులు "విశేషదినాలు"గా ప్రగణింపబడేవి. నియమితంగా ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలోనూ క్రమం తప్పకుండా ఆ ఆవర్తనమయ్యే తిధులు "తింగళ్ దినాలు"గా పరిగణించబడేవి.
దేవాలయ పరిపాలనా నిర్వహణ రంగాలకు సబంధించి వార్షిక ఆదాయ వ్యయాలను వ్రాసే లెక్కల పుస్తకం పాతదానిని పక్కన పెట్టి కొత్తదాని వాడడం "ఆడి అయనం" రోజు ప్రారంభింపబడుతుంది. ఈ విషయం శాసనాలలో పేర్కొనబడినది కూడా. అవి తిరు అండెళుత్తు ఇడుంపోదు, తిరువాండెళుత్తు సాత్తి అరుళుం పోదు, తిరువాణ్డెళుతిట్ట తరువాయిలె మొదలైనవి.

కొడై తిరునాళ్ ఉత్సవం(గ్రీష్మోత్సవం):
వసంతకాలంలో జరిగే ఉత్సవం వసంతోత్సవం కాగా కొడైతిరునాళ్ వేసవిలో జరుపబడే ఉత్సవం. మొత్తం మీద ఈ ఉత్సవం 20రోజులు నిర్వహించబడే ఉత్సవం. తిరుమలలో మలయప్ప ఆయన ఇద్దరు దేవేరులకు, విష్వక్సేనులవారికి పదిరోజులు వైభవంగా ఉత్సవం నిర్వహింపబడెది. తరువాత 10రోజులు తిరుపతి గోవిందరాజస్వామికి జరుపబడేది. కోదండరామస్వామి వారికి జ్యేష్ఠమాసంలో ఈ గ్రీష్మోత్సవం జరిపినట్లు క్రీ.శ.1532 (శా.శ 1454) భవనామ సంవత్సరంలో ప్రకటించిన శాసనం తెలుపుతోంది.
ఈ ఉత్సవాన్ని ప్రప్రధమంగా ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో పడమటి గోడమీద లభించిన ఒక అసంపూర్ణ శాసనం వలన తెలిసింది. దీన్ని బట్టి పేరు తెలియని ఒక రాజు యొక్క 17వ పరిపాలనా సంవత్సరంలో 400పణాలు దానం చేసి ఈ ఉత్సవం నిరవహణకు తగు ఏర్పాటు చేసాడు. ఈ ధనం ఆధారమాధార ద్రవ్యంగా లభించే వడ్డీతో ఉత్సవం నిర్వహించవలసిందిగా షరతు విధించాడు. నిశితంగా పరిశేలించినట్లైతె ఈ శాసనం 12 లేక 13వ శతాబ్ది కాలానికి చెందినదని తెలుస్తోంది.
తిరుమల మహంతుల పరిపాలనలో ఉన్నకాలంలో కూడ ఈ కొడై తిరునాళ్ళు జరుపబడుతూ వచ్చింది. కాని ప్రస్తుతం ఈ ఉత్సవం జరుపబడుటలేదు.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: