Friday, January 27

రధసప్తమి (30.01.12)

రధసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించే పండుగ. ఇది మాఘశుద్ధ సప్తమినాడు వస్తుంది. సూర్యగ్రహణంతో సమానమైన పర్వంగా శాస్రాలు పేర్కొన్నాయి. ఈరోజు అరుణోదయకాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడమ్మహాపుణ్యఫలప్రదమని,ఆరోగ్యకరమని, అకాలమృత్యుపరిహారకమనీ, మరణాంతరం సూర్యలోకాన్ని పొందుతారనీ మహర్షులు పేర్కొన్నారు.

సూర్యగ్రహణతుల్య సౌ శుక్లా మాఘస్యసప్తమీ
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మహాఫలం
మాఘేమాసి సితేపక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః

షష్టినాడు రాత్రి ఉపవాసం చేసి, సప్తమీనాడు అరుణోదయకాలంలో స్నానం చేస్తే 7జన్మల పాపాలు తొలుగుతాయనీ, రోగాలు, దుఃఖాలు నశిస్తాయనీ, జన్మజన్మాంతకర మనోవాక్కా యఙ్ఞాతాఙ్ఞాతములనెడి సప్తవిధ పాపాలూ హరింపబడుతాయని ధర్మసింధువు పేర్కొన్నది.

సూర్యజయంతి
పరమాత్మ మాఘశుద్ధ సప్తమినాడు సూర్యుణ్ణి సృష్టించాడు. కనుకనే ఆ రోజుని "సూర్యజయంతి" ప్రస్సిద్ధ మయింది. సౌరసప్తమి, భాస్కరసప్తమి అనేవి సూర్యజయంతికి పర్యాయపదాలు. సంవత్సరానికి వచ్చే 24 సప్తముల్లోనూ రధసప్తమి ఖగోళ రీత్యా కూడా మహత్తు కలిగిఉంది.
ఈరోజు సూర్యోదయకాలంలో ఆకాశంలో నక్షత్రాల సన్నివేశం రధాకారంలో ఉంటుంది. రధాకారంలో నక్షత్రాలున్న సప్తమీదినం కనుక రధసప్తమి. సాధారణంగా చంద్రోదయసూర్యోదయ వేళాలో ఆకాశంలో ఉండే నక్షత్రాల సన్నివేశాన్ని బట్టి, వ్రతాలు, పూజలు, పండుగలు నిర్ణయించబడుతాయి.

స్నాన విధానం
వ్రతచూడామణిలో "బంగారు, వెండి, రాగి, ఇనుము వీనిలో దేనితోనైనా చేసిన దీపప్రమిదను సిద్ధం చేసుకొని, దానిలో నెయి/ నువ్వులనూనె/ ఆముదం/ ఇప్పనూనె తో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానికి గానీ, చెరువుల వద్దకుగానీ వెళ్ళి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళలో వదిలి, ఎవ్వరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7జిల్లేడాకులుగానీ, 7రేగు ఆకులు కాని తలపై పెట్టుకోవాలి

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్ప్తికే
సప్తవ్యాకృతికే దేవి, నమస్తే సూర్యమాతృకే
"సప్తాశ్వాలుండే ఓ సప్తమీ, నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము" అని చెప్తూ, సూర్యునికి, ఆర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.

పంచాగ కర్తలు రధసప్తమిని "సూర్యజయంతి" అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం. ఈరోజు అభొజ్యార్క వ్రాతాదులు ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే వ్రతం). వైవస్వతుడు 7వ మనువు. సూర్యుడుకి మరో పేరు వివస్వంతుడు. ఇతనికి కొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే) ఇతనికి మన్వతరానికి రధసప్తమియే సవత్సరాది. మన్వంతరాది ప్రవదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు, మకర సంక్రతివలనే పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కలిగించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం
రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి.
జిల్లేడు : శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము/తేలు విషాన్ని, పక్షపాతాన్ని, బోదకాలు వ్యాధిని పోగొడుతుంది. ఇంట్లో తెల్ల జిల్లేడు చాల శ్రేష్టం.

రేగు/బదరీ : దీని గింజలు మంచి బలాన్ని ఇస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగగొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, మంచి స్వరం వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచి రక్తాన్ని కల్గిస్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.

ఇలా వృక్ష జాతిలోని జిల్లేడు, రేగు ఆకులు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. కనుక ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, నీళ్ళలోని
విద్యుచ్చక్తి కలిసి శరీరం పై, ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపి, మంచి ఫలితాలు ఇస్తాయి.
కేవలం రధసప్తమి రోజే కాక, మాములు రోజులలో కూడ ఈ ఆకులను ఉపయోగించి స్నానం చేయడం మంచిది. కాని, కనీసం ఏదాదిలో ఒక్కసారైనా తాకినా, వాటి స్పర్శా ప్రభావం ఆ సంవత్సరమంతా మనపై ఉంటుందని భావించి, ఈ పండుగనాడు శిరస్స్నానం తప్పక చేయాలని పెద్దలు సూచించారు.
ఈ ఆకులలో నిల్వచేయబడిన ప్రాణశక్తి, శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్ధీపనం చేసి అందలి నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివలన మానసిక దృఢత్వం, ఙ్ఞాపకశక్తి పెరుగుతాయి. శిరస్సంబంధమైన రోగాలు నశిస్తాయి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: