Friday, January 27

రధసప్తమి (2)

సూర్యోపాసన
“సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ” - మన సౌర కుటుంబంలోని అన్ని ప్రాణులకూ సూర్యుడే ఆత్మ. కృష్ణయజుర్వేదంలోని, అరణ్యకభాగంలో “అరుణ ప్రశ్న” ఉంది. ఇక్కడ ప్రశ్న అనగా కొన్ని ప్రకరణాల సముదాయము. దీనిని పారాయణ చేస్తే ఋణ, రోగ, శతృ బాధలు నశిస్తాయి. మనం మంత్రపుష్పంలో ఒకటిగా పేర్కొనే “యోపాం పుష్పంవేద, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి” అనే వాక్యాలున్న మంత్రం “అరుణం”లోనిదే. “ జలముల యొక్క పుష్ప స్వరూపం తెలుసుకొన్నవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపత్ సమృద్ధిమంతుడు అవుతాడని” అర్ధం.

సప్తాశ్వుడు
సూర్యకిరణకాంతి ఏడురంగులతో ఉంటుంది. ఆ కాంతివర్ణాలనే ఏడుగుఱ్ఱాలుగా పేర్కొని, సూర్యుణ్ణి “సప్తాశ్వుడు”, “సప్తసప్తి” అన్నారు. వాస్తవానికి, “వేగ”మనేది ఒక్కటే గుఱ్ఱం. సూర్యునికి గమనం ఒక్కటే, దాని పేరే “సప్త”. కాగా “సప్త” అనుపేరుగల గుఱ్ఱం అనగా, కాంతి గమనవేగం ఒక్కటే ఏడుగా వర్ణితమైంది. మనకు కనిపించే సూర్యుడొక్కడే అయినా, బ్రహ్మాండంలో ఇంకా 11మంది సూర్యులు (సూర్య గోళాలు) ఉన్నట్లు ఇటీవల శాస్త్రఙ్ఞులు కనుగొన్నారు. ప్రాచీన మహర్షులు ద్వాదశాదిత్యులు ఉన్నారని ఏనాడో గుర్తించియే ఉన్నారు, వారు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, ఆర్య, భాస్కరులు.
ఈ ద్వాదశాదిత్యులే సంవత్సరాత్మకమైన కాల విభాగంలోని ద్వాదశ మాసాలకు అధిదేవతలుగా పేర్కొనబడినరు. రాశులు కూడా ఇందువలనే 12గా ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కోమాసంలో ఒక్కోరాశిలో ప్రవేశిస్తాడు.
గాయత్రీమంత్రం సూర్యపరమైనదే.

రధసప్తమి రోజు తిరుమలేశుడు
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 7వాహనాలలో విహరిస్తారు. అవి సూర్యప్రభ వాహనం, చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమద్వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం. మధ్యాహ్నం “చక్రత్తాళ్వార్” (సుదర్శన చక్రం) వారికి వరాహస్వామి సన్నిధిలో చక్రస్నానం జరుగుతుంది. ఎన్నడులేని విధంగా ఒకేరోజు 7వాహనాల్లో, 7మార్లు, వివిధాలంకారాల్లో, దివ్య శోభలతో శ్రీవారు ఉత్సవమూర్తిగా దర్శనమివ్వడం, రధసప్తమి నాడు మత్రమే జరిగే విశేష విశిష్ట మహోత్సవం

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

భారతి said...

చక్కగా వివరించారు.
అందరికి ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ "ఆదిత్యున్ని" ప్రార్ధిస్తూ......
రధసప్తమి శుభాకాంక్షలండి

గాయత్రి said...

ధన్యవాదములండి, మీకు కూడా రధసప్తమి శుభాకంక్షలు