Tuesday, July 17

ఆది శంకరలు, భజగోవిందం (3)

21. పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం

ఇహ సంసారే బహుదుస్తారే

కృపయా పారే పాహి మురారే


పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ దయతో నన్ను రక్షించు.


పుట్టుక, మరణం, మరణం - పుట్టుక అంతర్గర్భితమై ఉన్నాయి. మనిషి వస్త్రాలను మార్చినట్లు, జీవాత్మ శరీరాలను మారుస్తుంది. అంటే జీవాత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించడం వల్ల జీవితం అనంతమైన యాత్ర అవుతోంది. మరణం కేవలం దీర్ఘనిద్ర మాత్రమే. కర్మవాసనలు జన్మజన్మలకు వెంటాడుతూ ఉంటాయి. జనన మరణ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది.


మనిషి జన్మ పాపపుణ్యాల మిశ్రమం. ఎన్ని జన్మలెత్తినా పరంధాముని దివ్యధామం చేరలేని జన్మవ్యర్ధం. వివేకం, విచక్షణలతో చిగురించిన వైరాగ్యాన్ని పెంచి, ఓ తండ్రీ! బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహాయుడిని. ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు. పరంధామా! కరుణతో ఈ జన్మకి ముగింపు పలికి, నన్ను నీదరికి చేర్చుకో స్వామీ..! అని ఆర్తితో తపనతో ప్రతిక్షణం నివేదన చేస్తే తప్పక స్పందిస్తాడు పరమాత్మ.


22.రథ్యాకర్పట విరచిత కన్దః

పుణ్యాపుణ్య విసర్జిత పన్ధ:

యోగీ యోగ నియోజిత చిత్తో
రమతో చాలోన్మత్తవ దేవ

నిజమైన యోగి దొరికిన వస్త్రాల పీలికలతో బొంతను తయారుచేసుకుని, అది మాత్రమే ఉపయోగిస్తాడు. పుణ్యాపుణ్యాలను అధిగమించి మనసును పరిపూర్ణ యోగంలో నియమిస్తాడు. బ్రహ్మములో లీనం అయిన మహాత్ముని చిత్తం పసిపిల్లవాని, పిచ్చివాని మనసు వంటిది.

సర్వసంగ పరిత్యాగి అయిన యోగి నిత్యసంతోషి. ఏ విధమైన సుఖానుభూతులను యోగి మనసు కోరదు. తినటానికి తిండి కట్టుకునే బట్ట, తలదాసుకొను గూడు అందరికి అవసరమే. వీటికోసం మనిషి చాలా శ్రమిస్తాడు. కానీ యోగి ఏది దొరికితే అది, ఏది అందుబాటులో ఉంటే అదే అందుకొని తృప్తిపడతాడు. ఎందుకు? యోగి మనస్సు పాప పుణ్యాలను అధిగమించి ఉంటుంది. కారణం, మనస్సుని నియమించి, చిత్తాన్ని పరమాత్మపై ఉంచుతాడు.


‘దృష్టిం జ్ఞానమయం కృత్వా - పశ్యేద్ర్భహ్మమయం జగత్’ అని శృతి వాక్యం. అంటే దృష్టిని జ్ఞానమయం చేసుకటే సకల సృష్టి బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఆ స్థితి పసిబాలుని స్థితి. దివ్యజ్యోతి స్వరూపమైన విశ్వాత్మ ప్రకాశం దర్శించగలిగినప్పుడు అంతా ఆర్ణవమైన ఆనందమే. అహం శబ్దవాచ్యుడైన పరమాత్మే మనలోని ఆత్మ అని తెలిసి నిర్వికల్పానందం అనుభవించవచ్చు.


23.కస్త్వం కోహం కుత ఆయాతః

కామే జననీ కోమే తాతః

ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వంత్యక్త్యా స్వప్నవిచారమ్

నీవెవరు? నేనువరు? నేనెక్కడి నుండి వచ్చాను? నా తల్లిదండ్రులెవరు? బాహ్యేంద్రియాలకు అనుభవమయ్యే ఈ సకల ప్రపంచం కలలాంటిది కదా? అందుకే దీనిని నర్జించాలి.

నిజానికి ఈ ప్రపంచం ఒక ఇంద్రజాలం. కొన్నికొన్ని ప్రశ్నలకు సమాధనాలు దొరకవు. కొన్ని పరిస్థితుల్లో మనసులో అసాధారణమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో జన్మల విషయవాసనలు మనస్సును, జన్మాంతరాల వరకు అంటిపెట్టుకునే ఉంటాయి. దేహం వశించినా వాసనలు నశించవు. అందుకే విషయ చింతనలు తగ్గించి విశ్వేశ్వర చింతన పెంచాలి. మనసు తత్త్వాన్ని అవగాహన చేసుకుంటే, అదుపు చేయడం సులభం. మనదైన శరీరం అశాశ్వతమవుతే జగత్తు మాత్రం అశాశ్వతం కాదా! కలకాదా! నిస్సారమైన కలలాంటి జగత్తుపై, శరీరంపై మమకారం పెంచుకోటం మూర్ఖత్వం. ‘ఆత్మవెళ్లిన దేహమగ్నిహోత్రుని పాలు - కఠిచ శల్యములన్ని గంగపాలు’ అన్నారు పెద్దలు. అందుకే మనలోకి మనమే పయనించి, పరమాత్ముని దర్శించి ధన్యత చెందాలి.

24.త్యయిమయి చాన్యత్రైకో విష్ణుః

వ్యర్ధం కుష్యసి మయ్య సహిష్ణుః
భవ సమచిత్రః సర్వత్రత్వం
వఛస్య చిరాద్యది విష్ణుత్వమ్

నీలో, నాలో, అంతటా ఉన్నది ఒక్కడే పరమాత్మ. నీ కోపతాపాలు ఎవరి మీద? నిజంగా నీవు పరమాత్మ దర్శనానికై తపించేట్లయితే సమభావన అలవరుచుకోవాలి.

మోక్షప్రాప్తికి సాధకుడు ఇంద్రియ నిగ్రహం తరువాత సాధించవలసింది సమభావన. స్థిరచిత్తులై, ఇష్ఠానిష్టాలకు, ఆగ్రహాగ్రవేశాలకు లొంగకూడదు. కోపంవల్ల మోహం, మోహంవల్ల లోభం, లోభం వల్ల బుద్ధినాశనం, ఆపై సర్వం నాశనమవుతుంది. ‘ఎన్ని సంవత్సరాల నుంచో పరమాత్మని సేవిస్తున్నానే, అయినా ముముక్షత్వం సిద్ధించట్లేదు’. అని ఆవేదన పడే ముందు, అనన్య చింతనతో పరమాత్మని సేవించానా? అన్యధా శరణం నాస్తి అని సర్వస్య శరణాగతి చేశానా? అని ఆలోచించాలి. చింతలలో రగులుతున్న మనస్సును ప్రశాంతపరచి, ఏకాగ్రం చేసి అప్పుడు శరణంటే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. జన్మజన్మల పుణ్యఫలంగా పరమాత్మ పాదాల చెంత స్థిరమైన భక్తి ఏర్పడుతుంది. సర్వత్ర సమచిత్తం సాధించి ముక్తిపొందవచ్చు.


25. శత్రౌమిత్రే పుత్రౌబంధౌ

మాకురు యత్నం విగ్రహసన్దౌ

సర్వస్మిన్నసి పశ్యాత్మానం

సర్వత్రో త్తృజ భౌధజ్ఞానమ్


శత్రువుతో, మిత్రునితో, పుత్రునితో, బంధువుతో శతృత్వం కానీ, మితృత్వం కానీ చేయాలని చూడరాదు. అందరిలో అంతటా పరమాత్మని దర్శించి అభేద బుద్ధిని వదలాలి.

మితృత్వం వల్ల దగ్గరితనం, శతృత్వం వల్ల అగాధం మనుషుల మధ్య ఏర్పడతాయి. ఈ రెండూ కూడా మోక్షసాధనకు ప్రతిబంధకాలు. చీకటి వెలుగుల్లా, జ్ఞానం - అజ్ఞానం జంటగానే ఉంటాయి. అజ్ఞానం వల్ల మాయకు లోబడితే అంతటా బేధ దృష్టే. సముద్రం, అల వేరు వేరు కానట్లే ఆత్మ, పరమాత్మ వేరు కాదను అభేద దృష్టి మోక్షకారకం. అండ పిండ బ్రహ్మాండమంతా పరమాత్మ చైతన్య శక్తిచే ఆవరించబడి ఉంటుందనే నిజాన్ని గ్రహించిన నాడు, ఆలోచనలు అదుపులో కొచ్చి, సర్వం సమం అనే సమదృష్టి ఏర్పడుతుంది. అంతటా, అన్నిట్లో పరమాత్మే గోచరిస్తాడు. అప్పుడు అనుభవించే ఆత్మానందానికి అవధులు ఉండవు.


26. కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం పశ్యతి సోహం

ఆత్మజ్ఞాన విహీనా మూఢా
స్తేపచ్యన్తే నరక నిగూఢా

కామ, క్రోధ, లోభ, మోహ గుణాలను విసర్జించి, పరమాత్మే నాలోని ఆత్మ అనే సమభావం కలిగితే ఆత్మదర్శనం సులభ సాధ్యం. అజ్ఞానులు మూఢులై, ఆత్మజ్ఞానం లేక నరకంలో పడి బాధలు అనుభవిస్తారు.

అరిషడ్వర్గాలు ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు. ఈ ఆరింటికి మూలం మనస్సు. మనస్సును సత్యమార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం. అంతఃశ్శతృవులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణచివేయాలి. అప్పుడు మధ, మాత్సర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మతః జీవుడు నిర్మలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మల నాచరించి, మాయావరణలో చిక్కుకుని, సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. ఏ కొంచెం వివేకంతో ఆలోచించగలిగినా మాయావరణను ఛేదించి, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి, సాధించి, ముక్తి పొందాలి.

27. గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపసమజస్తం

నేయం సజ్జనసంగే చిత్తం
దేయం దీనజనాయచ విత్తం

భగవద్గీతా నామ సహస్రం గానం చెయ్యాలి. ఎల్లప్పుడు నారాయణుని ధ్యానం చెయ్యలి. మనస్సును సదా సత్సంగత్యంలో నడిపించాలి. దానం చేయాలి.
సర్పోపనిషత్సారమైన గీతాగానం పుష్టిని, తుష్టిని ఇస్తుంది. అట్లాగే నారాయణుని రూపధ్యానం జీవాత్మను, పరమాత్మగా రూపాంతరం చెందిస్తుంది. సజ్జన సాంగత్యం మనిషిలో మాన్వత్వాన్ని ద్విగుణికృతం చేసి దైవత్వానికి దగ్గరగా తీసుకెళుతుంది. దీనికి తోడుగా దీనజన సేవ చేసిన మరింత అద్వైత భావన ప్రబలమై, ముక్తిమార్గం సులభమౌతుంది.

కలియుగంలో మోక్షసాధనకి సులభమార్గంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ప్రసాదించిన అద్భుతవరం గీతాశాస్త్రం. సాధకునికి అవసరమైన సూచనలన్నీ, ఈ గ్రంథంలో సూక్ష్మీకరించబడి, సులభంగా వివరించబడ్డాయి. అందుకే గీతని నిత్యం పారాయణ చేయడం వల్ల, మనోచిత్తాలు శుద్ధమై, నిస్సంకల్ప మౌతాయి. మనసంతా నారాయణుని రూపం నిండి, నిరంతరం అసంకల్పిత ధ్యానం కొనసాగుతుంది. ఆ స్థితిలో మనసెప్పుడూ, మంచి వారితో స్నేహం చేయాలని, మంచి మాటలు వినాలని మంచి పనులు చేయాలని పరుగులు తీస్తుంటుంది. ఎప్పుడైతే సజ్జనమైత్రి లభిస్తుందో, అప్పుడే మనలోని మానవత్వం జాగృతమై, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, దీనులపై దయచూపించాలని, ఆర్తులను ఆదుకోవాలని, దీనులపై దయచూపించాలని, ఆర్తులను ఆదరించాలనే సత్సంకల్పం కలిగి మనల్ని దైవత్వం వైపు నడిపిస్తుంది.


28. సుఖతః క్రియతే రామా భోగం

పశ్చాద్ధస్త శరీరా రోగః

యద్యపి లోకే మరణం శరణం
తదపిన ముంచ తి పాపాచరణమ్

సుఖం కోరి భోగాలలో తేలతారు. అది రోగాలకు దారితీస్తుంది. జీవితంలో చివరికి మరణమే శరణం. అయినా మనిషి పాపాలు చేయడం వదిలిపెట్టడు.

జరిగిపోయిన చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అయినా మనిషి మాయకు లోబడి సుఖ భోగాలకు దాసుడై పతనమవుతున్నాడు. ఇంద్రియ లోలత్వం మనిషిని ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది. తుఛ్ఛమైన ఐహిక వాంఛలు తీర్చుకోవడానికి రేయింబవళ్ళు శ్రమపడే మనిషికి చివరికి మిగిలేదేం ఉండదు. అశాశ్వతమైన భోగాలకి సమయాన్ని శరీరాన్ని వెచ్చించి, చివరికి వ్యాధిగ్రస్తమై మరణించవలసిందే. మనిషి పశువులా కాక మనిషిలా బ్రతికి, పరిమితికి లోబడి, ధర్మానుసారం సుభానుభవాన్ని పొందినా, ధర్మ బద్ధమైన, నీతివంతమైన, ఆదర్శవంతమైన జీవనం ఎన్నుకున్నవారే అంతంలో అనంతుని పొందగలరు.


29. అర్ధవనర్ధం భావయ నిత్య

నాస్తి తతస్సుఖ లేశస్సత్యం

పుత్యాదపి ధన భాజా భీతిః

సర్వత్రేషా విహితా రీతిః

అన్ని అనర్ధాలకు మూలకారణం ధనం. ధనంలో లేశమాత్రం సుఖం లేదన్నది సత్యం. ధనమున్నవారికి పుత్రులవల్ల కూడా భయం కలుగుతుంది. ఇది లోక విహితం. డబ్బు పుష్కలంగా సంపాదిస్తాం. అహంకరిస్తాం. పోయేనాడది వెంట వస్తుందా! పరస్పర సంబంధాలు పెంచుకుని ఆధునిక కాలంలో మనిషి కార్యాచరణకై పరిగెత్తుతూ అది దగ్గర సంబంధాలను కూడా కేవలం ధనం కోసమన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. అది మనస్సులను కలుషితం చేస్తుంది.

ధనం విలువ తెలిసిననాడు, తాను సంపాదించాననే గర్వంతో కాకుండా, తనుకున్నదంతా భగవత్ప్రసాదంగా భావించి, కొంచెం దానం, ధర్మం చేస్తేనే పుణ్యం, పురుషార్ధం. ఇహంలో జీవితం సుఖమయంగా గడపడానికి డబ్బు సంపాదించాలి. తప్పదు. కానీ అది మితిమీరకూడదు. మరి పరానికి ఏం సంపద కూడబెట్టాలి? ఆధ్యాత్మిక సంపద, దైవతత్వ సంపద. ఈ సంపదకి హద్దులేదు. ప్రశాంతమైన జీవితానికై డబ్బు సంపాదించినా, సుఖశాంతులు శరీరం ఉన్నంత వరకే అని గ్రహించగలిగితే జన్మ ధన్యమే. కడుపున పుట్టిన పిల్లలే నాకేమిస్తావు? సంపాదించినదంతా ఏం చేశావు? అని ప్రశ్నించిన రోజుకంటె దౌర్భాగ్యకరమైన రోజు జీవితంలో ఇంకొకటి లేదు. అందుకే అర్ధాన్ని వదిలి సర్వత్రా గోవిందుని భజించి ముక్తికి మార్గం సుగమం చేసుకోవాలి.

30. ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారం
జాప్యసమేత సమాధి విధానం

ప్రాణాయామం చేసి ప్రత్యాహారం పాటించాలి. నిత్యానిత్య విచారణతో, జపతపాలు ఆచరించాలి. మనస్సుని సమాధి స్థితిలో నిలపాలి. వీటికి జాగ్రత్త, ఏకాగ్రత, చెక్కు చెదరని మనసు ముఖ్యం.. శరీరంలో ప్రాణగతిని అదుపులో ఉంచటమే పాణాయామం. ప్రాణాయామానికి చిత్తం ఏకాగ్రమనాలి. మనస్సు నిశ్చలమనాలి. సాధన వల్ల మాత్రమే ఇవి సాధ్యం. అసంకల్పితంగా మనిషిలో జరిగే చర్యలలో ఊపిరి తీయటం ఒకటి. సాధనతో ఊపిరిని అదుపు చేయాలి. సంకల్ప రహితమైన మనస్సుతో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ప్రాణాయామ, ప్రత్యాహారాలు పాటించటమే తపస్సై, సమాధి సిద్ధిస్తుంది. సమాధి స్థితిలో సర్వేంద్రియాలు చిత్తంతో లయమై, ఆత్మానందం అనుభవమవుతుంది. ఇదే జీవిత లక్ష్యమైన వాని జన్మ ధన్యం.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: