Monday, July 9

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి

“చిన్న పిలకాయల్ని అడిగినా చెప్తారు ఎల ప్లాన్ చేసుకోవాలో, పార్టి ఎక్కడ ఇస్తే బాగుంటుందో, ఏ హోటల్ లో భోజనం చేస్తే బాగుంటుందో” అనేది టక్కున వచ్చే సమాధానం. కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యుతను చెడగొడుతోందో తెలుస్తోంది.

వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది.

పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు.

మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం

ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది.

ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయి
ఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి

లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి

అంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిది
కేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??

ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు.

పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే.

ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి

చిరంజీవీ యధా త్వం భో భవిష్యామి మహామునే
రూపనాన్ విత్తవాంశ్చైవ శ్రియాయుక్తశ్చ సర్వదా
మార్కండేయ నమస్తేస్తు సప్తకల్పాంత జీవన
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ప్రసీద భగవన్మునే
చిరంజీవీ యధాత్వంతు మునీనాం ప్రవరో ద్విజ
కురుష్వ మునిశార్దూల తధా మాం చిరంజీవినం
మార్కండేయ, మహాభాగ, సప్తకల్పాంత జీవనః
ఆయురారోగ్య సిద్ధ్యర్ధం ఆస్మాకం వరదోభవ

ఈ శ్లోకాలను పుట్టినరోజు ఎవరిదైతే వారు చదవాలి. ఈ క్రింది షష్టీదేవి శ్లోకం పిల్లలచే చదివించడం మంచిది

జయదేవి జగన్మాతః జగదానంద కారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టదేవతే
త్రైలోక్యేయాని భూతాని స్థావరాణి చరాణిచ
బ్రహ్మ విష్ణు శివైస్సార్ధం రక్షాం కుర్వంతు తానిమే

ఈ శ్లోకాలతోపాటు చదువవలసినవి

అశ్వత్ధామా బలిః వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరుశురామశ్చ సప్తైతే చిరంజీవనః
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ మధాష్టమం
జీవేద్వర్ష శతం ప్రాఙ్ఞః అపమృత్యు వివర్జితః
పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి.

“షష్టిపూర్తి” ఉత్సవాలు

ఇంతేకాక శాంతి కమలాకరంలో షష్టి ఆబ్ది పూర్తి వంటి విశేష దినాలో చేయాల్సిన తంతు చెప్ప బడినది.

జన్మత ష్షష్టమే వర్షే మృత్యు రుగ్ర రధానృణాం
దశభిస్త్వధికే తస్మిన్ మృత్యుర్భీమరధో నృణాం
విజయాఖ్యా రధోమృత్యుః అష్టసప్తతిమే భవేత్

59 దాటి 60వ సంవత్సరం రాగానే “ఉగ్రరధ” శాంతి, 70వ ఏట “భీమరధ” శాంతి, 78వ ఏట “విజయరధ” శాంతి, 83వ ఏట “శతాభిషేకం”, వంద సంవత్సరాలు నిండాక పూర్ణ శతాభిషేకం చేసుకోవాలి.

చిన్నవారందరు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది.

మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..

నిత్యాన్నదాతా తరుణోగ్ని హోత్రీ
మాసోపవాసీ చ పతివ్రతాచః
వేదాంతవిత్ చంద్ర సహస్ర దర్శీ
షడ్జీవలోకే మమ వందనీయాః

“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

విషయ సేకరణ : ఋషిపీఠం

0 వినదగు నెవ్వరు చెప్పిన..: