Saturday, April 16

హనుమాన్ చాలిసా

హనుమాన్ చాలిసా : మన నిత్య దైవారాధనలో హనుమాన్ చాలిసా కూడ తప్పక ఉంటుంది. మన ఇళ్ళలో చిన్నపిల్లలకు సైతం హనుమాన్ చాలిసా నేర్పించడం మనకు పరిపాటి. ఈ చాలిసా ను రచించింది తులసిదాసు. అసలు ఈ చాలిసా అనునది ఎలా వచ్చిందో తెల్సుకొందాం. వారణాసి లో ఉండే తులసిదాసు గొప్ప రామ భక్తుడు. నిత్యం రామనామ సంకీర్తనలో కాలం గడుపుతూ, అందరికి రామనామ దీక్షను ఇస్తూ, అద్యాత్మికతను అందరికి భోదించేవాడు. ప్రజలు కూడ తులసిదాసు తో కలిసి రామనామ సంకీర్తనలు చేసేవారు.

ఒకరోజు, అదే ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిలో, భర్త వియోగం వలన ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, భర్త శవం తీస్కొని పోవద్దు అంటూ ఉన్న ఆ తల్లిని, బంధువులు బలవంతంగా పట్టుకొని ఉండగా, శవయాత్ర మొదలు పెట్టారు. ఆ ఇల్లాలు, బంధువులను విడిపించుకొని, ఆ శవయాత్ర వెంట పరుగు తీసింది. తులసిదాసు ఉండే ఆశ్రమం మీదుగానే శవాన్ని తీస్కొనివెళ్తున్నారు. తులసిదాసు ఆశ్రమం సమీపించగానె ఆ ఇల్లాలు తనకు తెలియకుండానే ఆశ్రమంలో కి వెళ్ళి తులసిదాసు ని ఆశ్రయిస్తుంది. ఆ తల్లి గజ్జెల సవ్వడి, గాజుల శబ్ధం విన్న తులసిదాసు "దీర్ఘ సుమంగళీ భవ" అని ఆశీర్వదించాడు. అది ఎలా సాధ్యం అని ఆమె తండ్రి జరిగింది తులసిదాసుకి వివరిస్తాడు. అది తెల్సుకొన్న తులసిదాసు, రామనామ స్మరణ చేస్తూ కొద్దినీటి ని ఆ శవం పైన చల్లాడు. వెంటనే శవం లో చైతన్యం వచ్చింది.

ఇదే అదునుగా తీసుకొని కీర్తనలు, భజనలు నచ్చని మతపెద్దలు, తులసిదాసు మతమార్పిడి ని ప్రోత్యహిస్తున్నాడు అని, ప్రభువైన పాదుషా కు ఫిర్యాదులు చేసారు.
పాదుషా తులసిదాసుని పరీక్షించ దలచి దర్బారుకి పిలిపించారు.

పాదుషా : రామనామము అన్నింటికన్నా గొప్పది అని ప్రాచారం చేస్తున్నారటా?

తులసిదాసు : అవును ప్రభు. సృస్టికి మూలం ఐన రామనామం వర్ణించడం ఎవరితరం కాదు
పాదుషా : రామనామం వలన దేనినైనా సాదించవచ్చు అని చెప్తున్నారట?
తులసిదాసు : అవును ప్రభు
పాదుషా : ఐతే నేనొక శవం తెప్పిస్తాను, దానికి జీవం పోయగలవా?
తులసిదాసు : సృస్టిలో జనన మరణాలు ప్రకృతి సిద్దమైనవి. వాటిని మనం నిర్ణయించడం సబబు కాదు.
పాదుషా : మీరు శవం లో జీవం తెప్పించండి లేదా మీ రామనామ స్మరణ, మీరు చెప్పినవి అన్ని అబద్ధాలు అని ఒప్పుకోండి.

ఈ విపత్కర పరిస్థితి కల్పించిన నీవే, పరిష్కారం కూడ చూపాలి అని ఆ శ్రీరామ చంద్రుడిని వేడుకొంటూ ద్యానస్తుడైన తులసిదాసుని బందించమని ఆఙ్ఞాపిస్తాడు పాదుషా. ఆ క్షణంలో ఎక్కడనుండి వచ్చాయో కాని వేలాది కోతులు ఒక్కసారిగా సభాసదులందరిపైనా దాడి చేసాయి. ఆ కలకాలానికి ధ్యాన భంగమైన తులసిదాసు, వానర సేనను చూసి, ఎందుకిలా జరుగుతోంది అని సింహద్వారం వైపు చూడగా అక్కడ హనుమంతుడు దర్శనమిచ్చాడు.

అంతే తులసిదాసు మహదానందంలో మునిగిపోయాడు, భక్తి పారవశ్యంతో 40దోహాలుతో ఆ పవన తనయుడిని వర్ణించాడు. శాంతించిన హనుమ, ఏం వరం కావాలో కోరుకోమంటే, ఈ 40దోహాలను పఠించినవారికి అభయం ఇవ్వు తండ్రీ అని తులసిదాసు కోరుకొన్నాడు. దానికి మరింత ముగ్దుడైన ఆంజనేయుడు, ఈ స్తోత్రం చేసినవారికి ఎల్లప్పుడు నేను అండగా ఉంటానని అభయం ఇచ్చాడు.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలీం
శ్రీ రామభక్త హనుమతే నమః

1 వినదగు నెవ్వరు చెప్పిన..:

Anonymous said...

very well