Friday, April 22

తులసి ప్రాముఖ్యం

మన ఇళ్ళలో ముఖద్వారానికి ఎదురుగా పెరటిలో తులసి కోటని పెట్టుకొంటాం. ప్రతీరోజు తులసమ్మ కి పూజ చేసి నైవెద్యం పెడ్తాము.తులసి మాత చాలా పవిత్రమైనది. శ్రీమన్నారాయణునికి చాల ప్రియమైన శ్రీ మహాలక్ష్మియే తులసి. తులసిని పూజించి నమస్కరించినచో సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీశ్రీమన్నారాయణులను పూజించినట్లే.

యన్మూలే సర్వతీర్ధాని, యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీంత్వాం నమామ్యహం
తులసి యొక్క మొదలునందు సర్వ తీర్ధములు, మధ్య భాగమున సర్వ దేవతలు, అగ్ర భాగమున వేదాలు ఉన్నదైవస్వరూపంగా భావిస్తారు. ఇంతేగాక తులసి అగ్రభాగమున సాక్షాత్తూ బ్రహ్మదేవుడు, మధ్యభాగమున శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడును, శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నైరుతి, ఈశానుడు నివసిస్తారు. అంతేగాక గాయత్రీ, లక్ష్మీ, సరస్వతి, శచీదేవుల నివాసరూపం "తులసి రూపం".

శ్రీమన్నారాయణుడికి అతంత్య ప్రీతికరమైనది తులసి కావునే ప్రతీ నిత్యం అన్ని అర్చనా కార్యక్రమాలలో తులసి ప్రధానముగా ఉంటుంది. ప్రతీరోజు శ్రీవారి అష్టోత్తర నామర్చన ప్రారంభానికి ముందు అర్చకస్వామి వారు శ్రీవారి అష్టోత్తర శతనామార్చనమున సంకల్పించి "ఓం వేంకటేశాయనమః" అని వరాహ పురాణమునందలి అష్టోత్తర శతనామాలను పఠించుచూ ప్రతీ నామం చివర తులసి దళములను భక్తితో శ్రీవారి పాదపద్మల వద్ద ఉంచుతారు.
"తిరుమలవాసా గోవిందా, తులసి వనమాల గోవిందా,
గోవిందాహరి గోవిందా, గోకుల నందన గోవిందా.. "


ప్రాతః కాలమున పురుషులు మాత్రమే తులసీ దళములను కుడిచేతితో కోయవలెను. 3దళాలకు మించి ఎవరూ కోయరాదు. ద్వాదశి, శ్రవణా నక్షత్రములందును, అమావాస్యా, పౌర్ణమి తిధులందును, మంగళ, శుక్ర వారాలయందును, మధ్యాహ్న, సాయంత్ర, రాత్రి వేళల్లో తులసి దళాలను కోయరాదు. గ్రహణసమయమునందు, నిషిద్ధ సమయములందు పవిత్రమైన తులసి పత్రములు కోయరాదు. అవసాన దశయందు తులసి తీర్ధమును నోటిలో పోయుట మోక్షప్రాప్తికి నిదర్శనమని పెద్దల ప్రవచనము.

బృందా బృందావని, విశ్వపూజితా విశ్వపావనా,
పుష్ప సారా నందినీచ, తులసీ కృష్ణ జీవనీ
ఏతన్నా మాష్టకం చైవ స్తోత్రం నామార్ధ సం యుతం
యః పఠేత్ తాంచ సంపూజ్య సోశ్వ మేధ ఫలం లభేత్

తులసీ, బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందినీ తులసి, కృష్ణ సేవితా అను తులసీ నామాష్టకమును భక్తితో పఠించిన వారికి అశ్వమేధ యాగ మోనర్చిన ఫలము దక్కును.

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

స్వాతి said...

గాయత్రి గారు
మీ టపా చదివాను.బాగుంది. నాకు తెలిసిన వివరనను మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతిరోజు నేను భక్తి టివిలొ ప్రసారం అయ్యే ధర్మసందేహాలు కార్యక్రమం వీక్షిస్తాను. అందులో చూసిన ప్రకారం తులసి మొక్కను ఆడవారు కూడా కొయవచ్చట.కాని మంగళ,శుక్ర,ఆదివారములలో తులసి ఆకులను ఆడవారు కాని మగవారు కాని కోయరాదు. అలాగే ఎవరైనా సరే మూడు దళాలకు మించి కోయరాదట. ఇది నాకు తెలిసిన వివరం మాత్రమే.అన్యధా భావించకండి,

గాయత్రి said...

స్వాతి, మంచి విషయం అందించినందుకు ముందుగా ధన్యవాదములు. మీరు చెప్పిన విషయాన్ని టపాలో పొందుపరిచాను. మీ సహకారానికి ధన్యవాదములు..