Thursday, September 29

వెంకన్న దివ్యాభరణములు

దేవీ నవరాత్రులు

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం అనుసృతంగా వస్తున్న సంప్రదాయం. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుకనే.

అమ్మవారి అలంకారములు :
మొదటిరోజు బాలాత్రిపుర సుందరీదేవి
రెండోరోజు గాయత్రీ అమ్మవారు
మూడోరోజు అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు లలితా త్రిపురసుందరి
అయిదవరోజు సరస్వతీదేవి (మూలా నక్షత్రం వచ్చినప్పుడు)
ఆరో రోజు మహాలక్ష్మి
ఏడవరోజు దుర్గాదేవి
ఎనిమిదవరోజు మహిషాసుర మర్ధిని
తొమ్మిదవరోజు రాజరాజేశ్వరీ అమ్మవారు

నైవేద్యము :
బాలాత్రిపుర సుందరీదేవి - పొంగలి
గాయత్రీ మాత - పులిహోర
అన్నపూర్ణాదేవి - కొబ్బరన్నం
లలితా త్రిపురసుందరి - గారెలు
సరస్వతీదేవి - పెరుగన్నం
మహాలక్ష్మిదేవి - రవకేసరి
దుర్గాదేవి - కదంబం - అన్నికూరలు అన్నం కలిపి వండే వంటకం
మహిషాషురమర్ధిని - బెల్లంతో చేసిన వంటకం
రాజరాజేశ్వరి అమ్మవారు - పరమాన్నం

Thursday, September 22

ఆళ్వార్లు

వైష్ణవ దేవాలయాలలో మనం ఆళ్వార్లు ని దర్శించుకుంటాం. ఆళ్వార్ అంటే నిమగ్నమై ఉన్నవాడు అని అర్ధం. తాము నమ్ముకున్న విధానంపట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారని అర్ధం. ఆ శ్రీమన్నారాయణుని పట్ల భక్తిని పెంచుకున్నారు. ఆ భక్తిభావం కలిగిన అనంతరం వేరే భావాన్ని మదిలోకి రానివన్నంత గాఢంగా విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందుకే భగవంతునికి అంత చేరువ కాగలిగారు. ప్రస్తుతం 12మంది ఆళ్వార్లు లేని వైష్ణవాలయం ఉండదంటే అతిశయోక్తి కాదు.వీరు ఉన్నపుడే ఆ ఆలయానికి పూర్ణత్వం సిద్ధిస్తుందని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారయణుడే వీరిని స్వయముగా అనుగ్రహించడం ఇక్కడ విశేషం. అంతగా స్వామి ధ్యానంలో పరవశులైనారు వీరు.

వీరంతా శ్రీమన్నారయణుడికి సంబంధించిన ఆయుధాలు, ఆభరణాల అంశతో జన్మించారని కూడా అంటారు. దాని గురించి తెలుసుకుందాం.

భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాధ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్సరాంకుశ మునిం ప్రణతోస్మినిత్యం

భూతయోగి - పూదత్తాళ్వార్ - కౌమోదకి అనే గద
సరోయోగి - పోయిగయాళ్వార్ - పాంచజన్యం అనే శంఖం
మహాయోగి - పేయాళ్వార్ - నందకం ఖడ్గం
భట్టనాధుడు - పెరియాళ్వార్ - గరుడుడు
ఆండాల్ - గోదాదేవి - లక్ష్మీదేవి అంశ
భక్తిసారయోగి - తిరుమళిసైయాళ్వార్ - సుదర్శన చక్రం అంశ
కులశేఖరాళ్వార్ - కౌస్తుభమణి అంశ
మునివాహనులు - తిరుప్పాణాళ్వార్ - శ్రీవత్సలాంచన అంశ
భక్తాంఘ్రిరేణువు - తొండరడిప్పొడియాళ్వార్ - వైయజంతి అను పూమాల అంశ
పరకాలయోగి - తిరుమంగైయాళ్వార్ - శారంగం అను ధనస్సు
మధురకవి ఆళ్వార్ - కుముదాంశ
శఠకోపముని - నమ్మాళ్వార్ - విశ్వక్సేనుని అంశ

ఈ వరుస క్రమముని ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తారు. వీరంతా దాదాపుగా దక్షిణదేశానికి చెందినవారు. ఇక, వీరిలో నలుగురేమో పల్లవ రాజ్యానికి, ముగ్గురేమో చోళదేశానికి, ఒకరేమో కేరళ కి చెందినవారుకాగా, మరో నలుగురేమో పాండ్యదేశానికి చెందినవారు. కులమతాలకు అతీతంగా వీరిలో అందరూ ఉన్నారు. ముందు చెప్పిన విధంగా ఈ 12మందిలో ఒకరు దేశాన్నేలే రాజు కాగా, మరొకరు చోరవృత్తి చేసే వారు కూడా ఉన్నారు. ఆళ్వార్లు అందరూ మంచి కవులే.

ఇక ఆండాల్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆమె సాక్షాత్తూ శ్రీరంగడి పత్నిగా ఆయన హృదయంలోనే ప్రతిష్టితురాలైన గొప్ప భక్తురాలు. తిరుప్పావై ఈమె వ్రాసినదే. ఆమె తండ్రి పెరాయాళ్వార్ విష్ణుచిత్తుడిగా పేరుపొందాడు.

Wednesday, September 14

పరమశివుడు

త్రిశూలము :
త్రిశూలము పైన మూడు కొనలు కలిగి, ఆ మూడు కలిసి అడుగున కలిసి ఒకే శూలహస్తముగా ఉంటుoది. సత్వ రజ స్తమో గుణములకు ఇది ప్రతీక. వీటి యొక్క ఏకత్వము త్రిగుణాతీతం. అంటే పరమశివుడు త్రిగుణాతీతుడని భావము.
నాగాభరణము :
కుండలిని సర్పాకరం కలిగి ఉంటుంది. కుండలిని ఉద్దీపన అయినపుడు అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. ఆ సిద్ధులను లోకరక్షణార్ధం వినియోగించువాడు కనుకనే ఈశ్వరుడనే పేరు వచ్చింది. ఇందుకు ప్రతీకగా నాగాభరణుడైనాడు.
డమరుకము :
శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలిగి తాండవము చేయును. దీనికి గుర్తుగానే డమరుకను ధరించును.
విభూతి
ఙ్ఞానము యొక్క స్థితిని తెల్లటిరంగుతో పోలుస్తారు. అదియే విభూతి. మనిషి యొక్క అలోచనలు, కోరికలు నశించుటవలన శుద్ధమైన ఙ్ఞానం కలుగుతుంది. అది ఆనందానికి మూలం. అందుకే శివభక్తులు విభూతిని ధరిస్తారు.
వ్యాఘ్ర చర్మాబరధరుడు :
భయంకరమైన తాంత్రిక శక్తులు, సిద్ధులు, పులి వంటి ప్రమాదకారులు. వాటిని వశపరచుకొన్నవాడు శివుడు. పులి అమ్మణ్ణి వాహనం. ఆమెను పూర్తిగా భార్యవలె ఆధీనమందుంచుకొన్నాదనుటకు సూచనగా పరమశివుడు వ్యాఘ్ర చర్మాబరధరుదైనాడు.
చంద్రకళాధరుడు :
శుద్ధ బ్రహ్మఙ్ఞానం, నిరంతరం స్రవించుచుండు ప్రఙ్ఞ అనువాటిని శివుని జటాజూటంలోని గంగ సూచించుచున్నది. నిత్య ప్రసాంతత. ఆనంద స్థితికి సూచన చంద్రవంక. అందుచే చంద్రకళాధరుని తత్వం అమృతత్వం, ఆనందమయ స్థితి.

Monday, September 12

సుబ్రహ్మణ్య స్తోత్రం

నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం
లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం
బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే

వల్లి దేవయానికా సముల్లసంతం ఈశ్వరం
మల్లికాది దివ్య పుష్ప మాలికా విరాజితం |
ఝల్లరీ నినాద శంఖ వాదన ప్రియం సదా
పల్లవారుణం కుమారశైల వాసినం భజే

షడాననం కుంకుమ రక్త వర్ణం
మహా మతిం దివ్య మయూర వాహనం |
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే

మయూరాధి రూఢం మహా వాక్య గూఢం
మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం |
మహీ దేవ దేవం మహా వేద భావం
మహాదేవ బాలం భజే లోకపాలం

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం సంపూర్ణం

Sunday, September 11

అనంతపద్మనాభ వ్రతం - sep 11th

భాద్రపద శుక్ల చతుర్దశినాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారు. కష్టాలనుండి బైటపడటానికి ఈ వ్రత ఫలితం తోడ్పడుతుంది. వనవాస కాలంలో కృష్ణుని ద్వార ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అనంతుడు అన్న, అనంతపద్మనాభుడు అన్న ఒకరే. పాలకడలిలో శేష తల్పమున పవళించి, బొడ్డు పద్మo లో బ్రహ్మదేవుడు కూర్చొని, లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య మంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. అనంత - అంతము లేనివాడు, పద్మనాభుడు - పద్మము నాభిలో కలవాడు అని.


ఇక వ్రత విషయానికొస్తే, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 7 పడగలు కల (14 పడగలు చేస్తరు కొందరు) అనంతుడిని దర్భలతో చేసి ప్రతిష్టిస్తారు. ముందుగా గణాధిపతిని పూజించాలి. కలిశంలో సిద్ధం చేసుకొన్న పవిత్ర జలములకి "యమున పూజ" చేయాలి అంటే యమునా నదిని ఆవహన చేయడం. తరువాత అనంతుడికి షోడశోపచారాలతో పూజచేసి బెల్లము, నేతితో చేసిన 28 అరిసెలను నైవేద్యముగా పెట్టాలి. వ్రత కథ చదువుకొని, తోరాన్ని కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోచలతో తోరాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి.

ఈ అనంత వ్రతంలో మనకు స్పష్టముగా తెలిసేది 14 కి చాల ప్రాముఖ్యం ఉంది అని. అవి
14 లోకాలను ఏలే వాడు కనుకనే ఈ వ్రతంలో 14 లేక 7 పడగలు కల అనంతుడిని ప్రతిష్ట చేసి పూజిస్తారు
14 కి రెండింతలైన 28 సంఖ్యలో పిండివంటలను నైవేద్యం పెట్టడం
14 ముడులు కల తోరాన్ని ధరించడం
14 సంవత్సరలకి ఒకసరి ఉద్యాపన చేయడం.
ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలచుకోడం కోసమే ఈ వ్రతం. ఈ వ్రతాన్ని పురోహితుడి ద్వార వివరంగా తెలుసుకొని చేయడం మంచిది.

Friday, September 9

జగద్గురు ఆదిశంకరులు (2)

మాతృపంచకం శ్లోకాలు

1. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్.

"నువ్వు నా ముత్యానివి , నా రత్నానివి , నా కంటి వెలుగువు , కుమారా ! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో అమ్మా , ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను.

2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిః.

"అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అంటూ పంటిబిగువున ప్రసవవేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ ! నీకు నమస్కరిస్తున్నాను.

3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమో
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.

అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను అనుభవించావో కదా ! కళను కోల్పోయి, శరీరం శుష్కించి,శయ్య మలినమైనా - సంవత్సరకాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావోకదా ! ఎవరైనా అలాంటి బాధను సహించ గలరా ? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు అంజలి ఘటిస్తున్నాను.

4. గురుకులముపసృత్య స్వప్నకాలేపి తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః.

స్వప్నంలో నన్ను సన్యాసివేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా !

5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ గావా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న దత్తో మాతస్తే మరణసమయే తారక మనురకాలే
సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులామ్.

అమ్మా ! సమయం మించిపోయాక వచ్చినందువల్ల మరణసమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని ఉచ్చరించలేదు. నన్ను క్షమించి, నాయందు తులలేని దయ చూపించు తల్లీ !

ఈ ఐదు శ్లోకాశ్రు కణాల్లోనూ "మాతృదేవోభవ" అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్ఠితమై ఉంది. మహిత వేదాంత ప్రవచనానికే కాదు – మహనీయ మాతృభక్తిప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.

Thursday, September 8

జగద్గురు ఆదిశంకరులు (1)

"శంకరశ్శంకరస్సాక్షాత్" అని ప్రపంచమంతా ఆదిశంకరులను పరమశివుని స్వరూపంగా భావించింది. "ఒక సాధారణ మానవదేహం భరించటానికి సాధ్యం కానంత ప్రతిభా పాటవాలు, అపార మేధాసంపత్తి, జ్ఞానతేజం ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన ప్రాణాన్ని ఆ దేహం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే వహించగలిగింది" అన్నారు ఒక సభలో శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి.

కేరళదేశంలోని కాలడి లో శివగురుడు, ఆర్యాంబ అనే పుణ్యదంపతులకు పరమేశ్వర ప్రసాదంగా ఆదిశంకరులు జన్మించారు. ఆయనకు 5 సంవత్సరాల వయస్సులో తండ్రి గతించారు. తల్లి ఆర్యాంబయే ఆయనకు తమ జ్ఞాతులచే ఉపనయన సంస్కారం జరిపించి, వేదాధ్యయనం చేయటానికి గురువుల వద్ద చేర్చింది. ఆయన బ్రహ్మచారిగా సకల శాస్త్రాలూ ఏకసంతాగ్రాహిగా అభ్యసిస్తున్నరోజుల్లోనే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒక పేదరాలి దారిద్ర్యాన్ని చూచి చలించిపోయిన శంకరులు "కనకధారాస్తోత్రం" చెప్పి ఆమె యింట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు.

కాలక్రమంలో ఆయన సన్యాసం స్వీకరించాలని సంకల్పించారు. ఏ వ్యక్తి అయినా సన్యాసం స్వీకరించాలంటేతప్పనిసరిగా తన తల్లి అనుమతి తీసుకోవాలి. అంతేకాదు సన్యాసికి – అతని తండ్రి యైనా నమస్కరించాలి ! సన్యసించి ఎంతటి గురుపీఠాన్ని అధిరోహించిన యతియైనా - తల్లికి మాత్రం నమస్కరించాలి. ఇది భారతీయ సంస్కృతి మాతృదేవతకు ఇచ్చిన ప్రాధాన్యం.

శంకరులు తమ మాతృమూర్తివద్దకు వెళ్ళి "అమ్మా ! త్యాగంతోనే ఎవరికైనా అమృతత్వం లభిస్తుంది. కర్మలతోనో, సంతానంతోనో అది సాధ్యంకాదు. సన్యాసం స్వీకరించి అమృతత్వాన్ని పొందగలిగే వరం నాకు ప్రసాదించు" అని అడిగారు. ఈమాట వినగానే ఆర్యాంబ నిర్ఘాంతపోయి "నాయనా ! నేను వృద్ధురాలి నయ్యాను. నేను బ్రతికి ఉన్నన్ని రోజులూ నన్ను కనిపెట్టుకొని ఉంటావనుకుంటే, నువ్వు సన్యసించి నన్ను వదలిపోవాలనుకోవటం న్యాయమేనా ?" అని విలపించింది. ఆమె దుఃఖాన్ని అర్ధంచేసుకున్న శంకరులు – ఆమె అనుమతి లభించినపుడే సన్యాసం స్వీకరించాలని భావించి ఆమెను అనునయించి యథాప్రకారంగా మాతృసేవలో నిమగ్నులయ్యారు.

ఒకసారి ఆర్యాంబకు ఒక కల వచ్చింది. తాను, శంకరుడూ పూర్ణానదిలో స్నానం చేయటానికి వెళ్ళారు. తాను గట్టుకు దగ్గరగా ఉంది. శంకరుడు నదిలో కొంతదూరం వెళ్ళాడు. ఒక మొసలి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బలంగా లోనికి లాగుతోంది. తాను నిస్సహాయురాలై ఏమీ చేయలేకపోతోంది.

"అమ్మా! నేను మరణిస్తాను. ఇపుడైనా నేను సన్యాసం స్వీకరించటానికి అనుమతించు" అని శంకరుడు ప్రార్థిస్తున్నాడు.
"నాయనా ! నీకు తీరనికోరిక అనేది ఉండకూడదు. నేను అనుమతి ఇస్తున్నాను. సన్యాసివైనా నువ్వుప్రాణాలతో ఉంటే అదే చాలు" అంది ఆర్యాంబ.

ఇంతలో ఆమెకు మెలకువ వచ్చింది. భయంతో వణకిపోతూ కళ్ళు తెరిచింది. అప్పటికే పొద్దెక్కటంతో శంకరులు గురుకులానికి వెళ్ళారు. ఆమె రోదిస్తూ గురుకులానికి వెళ్లి, అక్కడ తన కుమారుని చూడగానే స్తిమితపడింది. తన స్వప్న వృత్తాంతాన్ని సవిస్తరంగా ఆయనకు చెప్పింది. (ఇది స్వప్నం కాదు, నిజవృత్తాంతమని కొందరి అభిమతం)

శంకరులు చిరునవ్వు నవ్వుతూ "అమ్మా !ఈ స్వప్నం దైవసంకల్పం. భగవంతుడే నాకు నీ అనుమతి ఇప్పించాడు. నేను సన్యాసదీక్ష స్వీకరిస్తున్నాను. ఇక నీవు పుత్రవ్యామోహం వదలిపెట్టు. ఏ మాత్రమూ కలతపడకు. నీ శరీరం జరావశమై, నీకు మరణం ఆసన్నమైనపుడు నన్ను తలచుకో. నీదగ్గరకు తప్పకుండా వస్తాను" అని వాగ్దానం చేసి దేశ సంచారానికి వెళ్ళిపోయారు.

సంవత్సరాలుగడచిపోయాయి. శంకరుల అద్వైతప్రచార జైత్రయాత్ర అప్రతిహతంగా జరుగుతోంది. కాలడిలో ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. ఆమె శంకరులను స్మరించింది. ఎంతో దూరంలో ఉన్న శంకరులకు ధ్యానం చెదరింది. ఇది ఏ తర్కానికీ అందని స్పందన. తల్లి అవసాన దశలో ఉన్నట్లు గ్రహించారు. యోగశక్తితో వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, తత్త్వోపదేశం చేసి సద్గతిని కలిగించారు. ఆమెకు ఉత్తరక్రియలు ఆయనే చేయవలసి వచ్చింది.

ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధాలు. అంతటి జగద్గురువు, పరమేశ్వరాంశ, లోకానికి దుఃఖ నివృత్తిమార్గం చెప్పిన అద్వైతసిద్ధాంత ప్రతిష్ఠాత – మాతృమూర్తి మృతికి స్పందించిన తీరు అనిర్వచనీయం. "విరాగికి రాగమేమిటి ?" అనే తర్కానికి ఇక్కడ తావులేదు. ఆ మహామహుడు మాతృవాత్సల్యాన్ని గౌరవించిన తీరు - అందరికీ తమ తల్లుల పట్ల మంచి ఆలోచనను కలిగించాలి.

Wednesday, September 7

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రం


మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం
ముద్రావిశేషముకులీకృతపాణిపద్మం
మందస్మితం మధురవేషముదారమాద్యం
తేజస్తదస్తు హృది మే తరుణేందుచూడం

శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరమాననం
చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకం
వీణాపుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరై
ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదం

కర్పూరపాత్రమరవిందదళాయతాక్షం
కర్పూరశీతలహృదం కరుణావిలాసం
చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ
మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే

ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థం
ముద్రోల్లసద్బాహుముదారకాయం
సద్రోహిణీనాథకళావతంసం
భద్రోదధిం కంచన చింతయామః

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాంగరాగప్రభం
బాలం మౌంజిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితం
పింగాక్షం మృగశావకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతిం
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికం

శ్రీకాంతద్రుహిణోపమన్యు తపన స్కందేంద్రనంద్యాదయః
ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతాగౌరవం
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే

కపర్దినం చంద్రకళావతంసం త్రిణేత్రమిందుపతిమాననోజ్వలం
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివం

వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం
శ్యామాముత్పలధారిణీ శశినిభాంచాలోకయంతం శివం
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే

వటతరునికటనివాసం పటుతరవిజ్ఞానముద్రితకరాబ్జం
కంచనదేశికమాద్యం కైవల్యానందకందళం వందే

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సంపూర్ణం

Tuesday, September 6

శయన విష్ణుమూర్తి



విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. ఆ లక్ష్మీపతిని శయన, ఆసన, స్థానక, నృత్య రూపాల్లో మనం దర్శించవచ్చు. ముఖ్యంగా శయనవిగ్రహాలు, యోగం, సృష్టి, భోగం, సంహారం అని 4 విధాలుగా ఉన్నాయి. అవి వరుసగా ముక్తికి, వృద్ధికి, భుక్తికి, అభిచారికాలకు మార్గాలుగా ప్రతీక.
మోక్షం కోరేవారు యోగశయనాన్ని, పుత్రపౌత్రాభివృద్ధి కోరేవారు సృష్టిశయనాన్ని, భోగవృద్ధి కోరేవారు భోగశయనాన్ని, శత్రువుల నాశనాన్ని కోరేవారు సంహారశయనాన్ని ధ్యానించవలెనని పురాణాలు చెబుతున్నాయి. నదీతీరాలందు, సరస్సుల ప్రక్కన యోగశయన విగ్రహాలు ప్రశస్తమైనవిగా చెప్తారు. ఈ శయనవిగ్రహాల గురించి తెలుసుకొందాం.


యోగశయనం :
శ్రీమహావిష్ణువు ఎర్రతామర రేకుల వంటి నేత్రాలతో యోగనిద్రా సుఖమునందుంటుంది. 2భుజాలు కలిగి, ఒక పక్కగా పడుకున్నట్లు అర్ధశయనంలో ఉంటుంది. ఐదుపడగలు గల శేషుడు శంఖం వలె, చంద్రునివలె తెల్లగా ఉంటుంది. దీనిమీద శయనించిన విష్ణువు గౌరశ్యామ వర్ణంతోగానీ, పీతశ్యామ వర్ణంతో కాని ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తి పూజాపీఠానికి కుడివైపు భృగువు లేక మార్కండేయుడు, ఎడమవైపున భూదేవి లేక మార్కండేయ మహర్షి ఉంటారు. మధుకైతభులు, బ్రహ్మదేవుడు, పంచాయుధాలు, నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు.

సృష్టిశయనం : తొమ్మిది పడగలు గల శేషపానుపు పై శ్రీహరి, పద్మాలవంటి నయనాలతో, రాజస భావంతో, నల్లని శరీరచ్చాయతో, ఎర్రని అరికాళ్ళతో, శాశ్వతుడై సృష్టిశయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు, ఆదిత్యులు. కిన్నరులు, మార్కండేయ, భృగు, నారద మహర్షులను, మధుకైటభులను వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనమవుతుంది.

భోగశయనం :
ఈ శయన రూపంలో శ్రీమన్నారాయణుడు సకలపరివారంతో కూడినవాడై ఏడు పడగలు గల శేషుని యందు పడుకొని ఉంటాడు. ఈ స్వామి నాభి నుండి వికసించిన తామర పువ్వునందు కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. బ్రహ్మకు రెండు ప్రక్కల శంఖము, చక్రము, గద, ఖడ్గము, శార్ఙ్గం అను పంచాయుధాలు, పద్మము, వనమాల. కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడు ఉంటాడు. స్వామి కుడిచేతి ప్రక్కన లక్ష్మీదేవి, కుడిపాదం ప్రక్కన సరస్వతి, ఎడమచేతి ప్రక్కన శ్రీదేవి, ఎడమపాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురనారదులు, సప్తర్షులు, అప్సరసలు, లోకపాలకులు, అశ్వనీదేవతలుంటారు. శ్రీవారి పూజాపీఠం ప్రక్కన నారసింహ, వరాహమూర్తులుంటాయి. పాదాలవద్ద మధుకైటభులుంటారు. శ్రీవారు సస్యాశ్యామల వర్ణంతో, అర్ధశయనంతో, యోగనిద్రా రూపంతో, నాలుగు భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకులవంటి నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖముతో దర్శనమిస్తాడు.

సంహారశయనం :
శ్రీమన్నారయణమూర్తి రెండు పడగలు గల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్ర యందు,మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసే మూడు కన్నులతో. వాడిన మొగం మొదలగు సర్వాంగాలతో, నల్లని వస్త్రాలతో, 2భుజాలతో, నల్లన్ని శరీర కాంతులతో, రుద్రుడు మొదలగు దేవతల రూపంతో ఉంటాడు.

{సప్తగిరి మాసపత్రిక నుండి సారాంశం సేకరించడమైనది.}

Saturday, September 3

మధురాష్టకం


అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం
వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం

చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ

నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం

రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం
కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గుంజా మధురా బాలా మధురా యమునా మధురా వీచీ మధురా

సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం

దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా

దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం