Friday, September 9

జగద్గురు ఆదిశంకరులు (2)

మాతృపంచకం శ్లోకాలు

1. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్.

"నువ్వు నా ముత్యానివి , నా రత్నానివి , నా కంటి వెలుగువు , కుమారా ! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో అమ్మా , ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను.

2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిః.

"అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అంటూ పంటిబిగువున ప్రసవవేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ ! నీకు నమస్కరిస్తున్నాను.

3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమో
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.

అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను అనుభవించావో కదా ! కళను కోల్పోయి, శరీరం శుష్కించి,శయ్య మలినమైనా - సంవత్సరకాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావోకదా ! ఎవరైనా అలాంటి బాధను సహించ గలరా ? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు అంజలి ఘటిస్తున్నాను.

4. గురుకులముపసృత్య స్వప్నకాలేపి తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః.

స్వప్నంలో నన్ను సన్యాసివేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా !

5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ గావా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న దత్తో మాతస్తే మరణసమయే తారక మనురకాలే
సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులామ్.

అమ్మా ! సమయం మించిపోయాక వచ్చినందువల్ల మరణసమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని ఉచ్చరించలేదు. నన్ను క్షమించి, నాయందు తులలేని దయ చూపించు తల్లీ !

ఈ ఐదు శ్లోకాశ్రు కణాల్లోనూ "మాతృదేవోభవ" అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్ఠితమై ఉంది. మహిత వేదాంత ప్రవచనానికే కాదు – మహనీయ మాతృభక్తిప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: