Thursday, September 8

జగద్గురు ఆదిశంకరులు (1)

"శంకరశ్శంకరస్సాక్షాత్" అని ప్రపంచమంతా ఆదిశంకరులను పరమశివుని స్వరూపంగా భావించింది. "ఒక సాధారణ మానవదేహం భరించటానికి సాధ్యం కానంత ప్రతిభా పాటవాలు, అపార మేధాసంపత్తి, జ్ఞానతేజం ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన ప్రాణాన్ని ఆ దేహం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే వహించగలిగింది" అన్నారు ఒక సభలో శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి.

కేరళదేశంలోని కాలడి లో శివగురుడు, ఆర్యాంబ అనే పుణ్యదంపతులకు పరమేశ్వర ప్రసాదంగా ఆదిశంకరులు జన్మించారు. ఆయనకు 5 సంవత్సరాల వయస్సులో తండ్రి గతించారు. తల్లి ఆర్యాంబయే ఆయనకు తమ జ్ఞాతులచే ఉపనయన సంస్కారం జరిపించి, వేదాధ్యయనం చేయటానికి గురువుల వద్ద చేర్చింది. ఆయన బ్రహ్మచారిగా సకల శాస్త్రాలూ ఏకసంతాగ్రాహిగా అభ్యసిస్తున్నరోజుల్లోనే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒక పేదరాలి దారిద్ర్యాన్ని చూచి చలించిపోయిన శంకరులు "కనకధారాస్తోత్రం" చెప్పి ఆమె యింట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు.

కాలక్రమంలో ఆయన సన్యాసం స్వీకరించాలని సంకల్పించారు. ఏ వ్యక్తి అయినా సన్యాసం స్వీకరించాలంటేతప్పనిసరిగా తన తల్లి అనుమతి తీసుకోవాలి. అంతేకాదు సన్యాసికి – అతని తండ్రి యైనా నమస్కరించాలి ! సన్యసించి ఎంతటి గురుపీఠాన్ని అధిరోహించిన యతియైనా - తల్లికి మాత్రం నమస్కరించాలి. ఇది భారతీయ సంస్కృతి మాతృదేవతకు ఇచ్చిన ప్రాధాన్యం.

శంకరులు తమ మాతృమూర్తివద్దకు వెళ్ళి "అమ్మా ! త్యాగంతోనే ఎవరికైనా అమృతత్వం లభిస్తుంది. కర్మలతోనో, సంతానంతోనో అది సాధ్యంకాదు. సన్యాసం స్వీకరించి అమృతత్వాన్ని పొందగలిగే వరం నాకు ప్రసాదించు" అని అడిగారు. ఈమాట వినగానే ఆర్యాంబ నిర్ఘాంతపోయి "నాయనా ! నేను వృద్ధురాలి నయ్యాను. నేను బ్రతికి ఉన్నన్ని రోజులూ నన్ను కనిపెట్టుకొని ఉంటావనుకుంటే, నువ్వు సన్యసించి నన్ను వదలిపోవాలనుకోవటం న్యాయమేనా ?" అని విలపించింది. ఆమె దుఃఖాన్ని అర్ధంచేసుకున్న శంకరులు – ఆమె అనుమతి లభించినపుడే సన్యాసం స్వీకరించాలని భావించి ఆమెను అనునయించి యథాప్రకారంగా మాతృసేవలో నిమగ్నులయ్యారు.

ఒకసారి ఆర్యాంబకు ఒక కల వచ్చింది. తాను, శంకరుడూ పూర్ణానదిలో స్నానం చేయటానికి వెళ్ళారు. తాను గట్టుకు దగ్గరగా ఉంది. శంకరుడు నదిలో కొంతదూరం వెళ్ళాడు. ఒక మొసలి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బలంగా లోనికి లాగుతోంది. తాను నిస్సహాయురాలై ఏమీ చేయలేకపోతోంది.

"అమ్మా! నేను మరణిస్తాను. ఇపుడైనా నేను సన్యాసం స్వీకరించటానికి అనుమతించు" అని శంకరుడు ప్రార్థిస్తున్నాడు.
"నాయనా ! నీకు తీరనికోరిక అనేది ఉండకూడదు. నేను అనుమతి ఇస్తున్నాను. సన్యాసివైనా నువ్వుప్రాణాలతో ఉంటే అదే చాలు" అంది ఆర్యాంబ.

ఇంతలో ఆమెకు మెలకువ వచ్చింది. భయంతో వణకిపోతూ కళ్ళు తెరిచింది. అప్పటికే పొద్దెక్కటంతో శంకరులు గురుకులానికి వెళ్ళారు. ఆమె రోదిస్తూ గురుకులానికి వెళ్లి, అక్కడ తన కుమారుని చూడగానే స్తిమితపడింది. తన స్వప్న వృత్తాంతాన్ని సవిస్తరంగా ఆయనకు చెప్పింది. (ఇది స్వప్నం కాదు, నిజవృత్తాంతమని కొందరి అభిమతం)

శంకరులు చిరునవ్వు నవ్వుతూ "అమ్మా !ఈ స్వప్నం దైవసంకల్పం. భగవంతుడే నాకు నీ అనుమతి ఇప్పించాడు. నేను సన్యాసదీక్ష స్వీకరిస్తున్నాను. ఇక నీవు పుత్రవ్యామోహం వదలిపెట్టు. ఏ మాత్రమూ కలతపడకు. నీ శరీరం జరావశమై, నీకు మరణం ఆసన్నమైనపుడు నన్ను తలచుకో. నీదగ్గరకు తప్పకుండా వస్తాను" అని వాగ్దానం చేసి దేశ సంచారానికి వెళ్ళిపోయారు.

సంవత్సరాలుగడచిపోయాయి. శంకరుల అద్వైతప్రచార జైత్రయాత్ర అప్రతిహతంగా జరుగుతోంది. కాలడిలో ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. ఆమె శంకరులను స్మరించింది. ఎంతో దూరంలో ఉన్న శంకరులకు ధ్యానం చెదరింది. ఇది ఏ తర్కానికీ అందని స్పందన. తల్లి అవసాన దశలో ఉన్నట్లు గ్రహించారు. యోగశక్తితో వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, తత్త్వోపదేశం చేసి సద్గతిని కలిగించారు. ఆమెకు ఉత్తరక్రియలు ఆయనే చేయవలసి వచ్చింది.

ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధాలు. అంతటి జగద్గురువు, పరమేశ్వరాంశ, లోకానికి దుఃఖ నివృత్తిమార్గం చెప్పిన అద్వైతసిద్ధాంత ప్రతిష్ఠాత – మాతృమూర్తి మృతికి స్పందించిన తీరు అనిర్వచనీయం. "విరాగికి రాగమేమిటి ?" అనే తర్కానికి ఇక్కడ తావులేదు. ఆ మహామహుడు మాతృవాత్సల్యాన్ని గౌరవించిన తీరు - అందరికీ తమ తల్లుల పట్ల మంచి ఆలోచనను కలిగించాలి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: