" వెంకన్న " పేరు వింటేనే తెలియరాని ఆనందానుభూతి, ఆ దివ్య మంగళ రూపాన్ని ఒక్కసారి కనులార దర్శించే భాగ్యం కలిగించు స్వామి అని వేడుకొంటాం. ఎదైనా శుభకార్యం మొదలు పెట్టేముందు మరియు తిరుమల దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వత " పిండి దీపారాధన " చేయడం మనకు పరిపాటి. వెంకన్న కి అలంకరించే తిరునామాల గురించి తెలుసుకొందాం.
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త, సాక్షాత్తూ ఆదిశేషుని అంశతో జన్మించిన భగవద్ శ్రీ రామానుజాచార్యులు వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వ పుండ్రములు అలంకరించారు. ఇప్పటికీ శ్రీనివాసుని నొసట ప్రతీ శుక్రవారం నాడు అభిషేకం తరువాత 16 తులాల పచ్చకర్పూరం, 1 1/2 తులాల కస్తూరితో ఈ తిరునామాలు అలంకరించబడుతాయి. బ్రహ్మోత్సవ సమయాలలో మాత్రం శ్రీనివాసుని ఊర్ధ్వపుండ్రములలో పచ్చకర్పూరం, కస్తూరి రెట్టింపుగా వినియోగిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనవి బ్రహ్మోత్సవాలు.
10రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారం నాడు, మధ్యలో వచ్చే శుక్రవారం రోజు, తిరిగి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారములలో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో 32తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగించబడుతుంది. ఈ శుక్రవారములను ఆలయ సంప్రదాయాలలో రెట్టింపు శుక్రవారాలని, రెట్టవారాలని వ్యవహరిస్తారు. ఈ శుక్రవారాలలో స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని గాంచిన వారికి మరో జన్మ ఉండదు.
మానవుడు సహజముగా తమోగుణప్రధానుడు. తమోగుణము ముఖ వర్ణముచే సూచించబడినది. తమోగుణమును నశింపచేసుకుని సత్వగుణప్రధానులు కావలెను. ఈ సత్వగుణమును సూచించబడేవే తెల్లటి తిరునామాలు. సత్వగుణసంపన్నుడు మాత్రమేకాక రజోగుణసంపన్నుడు కూడా కావలెననెడి భావము అరుణ వర్ణము కలిగిన శ్రీ చూర్ణము వెల్లడించుచున్నది. ధీమహిధియోయోనః ప్రచోదయాత్ అను గాయత్రీ మంత్రార్ధమును ఊర్ధ్వపుండ్ర ధారణము సూచించును. ఇందులో అర్ధము, నాయందుండి నన్ను సత్కర్మలకు ప్రేరేపింపుము, నన్ను వ్యసనముల యందు పడనీయక సన్మార్గమున నడిపించమని అర్ధము.
శ్రీరామానుజుల వారిచే అలంకరించబడిన తిరుమణి తిరుచూర్ణములతో కూడిన ఊర్ధ్వపుండ్రములను తన దివ్య ముఖారవిందమున ధరించిన శ్రీనివాసుని దివ్యమంగళ రూపాన్ని ఒక్కసరి మనస్సులో దర్శించండి....
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద ...