Friday, May 27

అష్ఠాదశ శక్తిపీఠాలు (3)

మహాకాళి :
అమ్మవారి పైపెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని. పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గంగానదికి ఉపనది అయిన క్షిప్రానదీ తీరంలోని ఉజ్జయిని నగరం సప్తపురి క్షేత్రాలలో ఒకటి. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రాలలో ఒకటి.


పురుహూతిక :
పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన అమ్మవారి పీఠభాగం(పిరుదులు) పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో),తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. క్రీ.శ 210 కాలంలో శ్రీపురం, పురహూతికాపురంగా పేరు ఉన్న ఈ పట్టణం కాలక్రమానా పీఠికాపురంగా రూపాంతరం చెందింది.

గిరిజాదేవి :
అమ్మవారి నాభిభాగం పడిన ప్రదేశం, ఒరిస్సాలోని జాజ్పూర్. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 120కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని గిరిజాదేవి, బిరిజా, బిరిజాదేవిగా పలునామాలతో పిలుస్తారు. అమ్మవారి విగ్రహం బంగారు ఆభరణా లతో వివిధ పుష్పమాలికలతో అందంగా నిండుగా అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపించే ఈ విగ్రహానికి వెండి కిరిటీం ధరింపజేస్తారు. భువనేశ్వర్‌లోని జగన్నాధస్వామివారి ఆలయానితో పోలిస్తే ఈ ఆలయం చాలా చిన్నది. ఇక్కడ ముఖ్యవిషయం అమ్మవారి ఆలయానికి దగ్గరలో పితృదేవతలకు నాభి కుండం లో పిండ ప్రదానాలను నిర్వహిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీకి వెళ్ళి చేరుతుందని భక్తుల విశ్వాసం. నాభి కుండంలో రోజులో అసంఖ్యాకం గా పిండప్రదాన తర్పణ కార్యక్రమాలు నిర్వహిం చినా నీటి మట్టం పెరగదు. ఇంతవరకూ నీరు ఇంకిపోలేదు. 4,5 అడుగులలోతున నీరు ఎప్పుడూ అదే స్థాయిలో ఉండటం విశేషం.ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

మాణిక్యాంబ :
అమ్మవారి ఎడమచెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోట వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబా దేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి, అమ్మవారికి ఏకకాలంలో పూజలు జరగడం ఈ క్షేత్ర విశిష్టత. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడని స్థలపురాణం. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు.

కామాఖ్యాదేవి :
అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. కామరూపదేశం తాంత్రిక విద్యకు ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

4 వినదగు నెవ్వరు చెప్పిన..:

voleti said...

నవ దుర్గల గురించి తెలుసుకున్నాను.. ధన్యవాదములు..ఈ పాటికే ఎంతో పుణ్యం మీ ఎకౌంట్ లోకి చేరిపోయి వుంటుంది..

గాయత్రి said...

dhanyavaadamulu voleti garu..

krishna vision 2020 said...

అమ్మా నా పేరు చైతన్య ,నేను కూడా నెల్లూరు వాసి నే . పురాణ ఇతిహాసాల గురించి తెల్సుకోవాలన్న కోరిక నాకు చాలా ఎక్కువ. చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన బెడ్ టైం స్టోరీస్ అన్నీ ఈ కోవ కి చెందినవే. కాని ఈరోజు మీరు చెప్తున్న కథలు మళ్ళీ ఆ స్టోరీస్ ని గుర్తుకుతెస్తున్నాయి. ఇప్పుడు అడ్మిన్ గా పని చేస్తూ ఉన్నందువల్ల చాలా బిసీ గా ఉండే నాకు మీ బ్లాగ్ మూలాన మళ్ళీ వాటిని గుర్తుకు తెచ్చుకునే అవకాశం లభించింది. మీకు దన్యవాదములు తెలుపకుండా ఉండలేక పోతున్నాను. నాకు తెలీని ఎన్నో కథలు ఇందులో చదివాను.

ఇక్కడ నాకొక బుల్లి డౌటు . అష్టా దశ శక్తి పీఠాల గురించి తెలిపేటప్పుడు పీట బాగం అంటే ఎడమ చెయ్యి అని రాసారు. పీట బాగం అంటే పిరుదులు పడిన ప్రాంతం అని విన్నాను. దయ చేసి వివరణ ఇవ్వగలరు.

మీరు చేసే ఈ పని వలన ఎందరికో ఉపయోగం ఉంటుంది. నేను కూడా చాలా మంది ని ఈ బ్లాగ్ చదవమని సజెస్ట్ చేసాను.

నాకు తెల్సిన బ్లాగుల్లో మంచి బ్లాగ్ ఏంటి అంటే మీ బ్లాగ్ అని చెప్తాను . అంత నచ్చింది. కీప్ ఇట్ అప్ మేడం. థాంక్ యు .

krishnavision2020@gmail.com

గాయత్రి said...

porapaatuna yedamacheyi ani raasanu, ipudu savarinchaanu peetabhagamu ani..chaala dhanyavaadamulu.