Saturday, May 28

అష్ఠాదశ శక్తిపీఠాలు (4)

మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వాడుకలోకి వచ్చింది.


సరస్వతీ దేవి :

అమ్మవారి కుడిచేయి పడిన ప్రాంతం కాశ్మీర్లో ఉంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత


పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. పాకిస్తాన్ వాళ్ళు (పాక్ ఆక్రమిత కాష్మీర్) ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేసారు. చాల భాదాకరమైన విషయం :(. కాష్మీరీ పండితుల విన్నపంతో రోజూ ఆ శిధిలమైన గుడి దగ్గరక దీపం పెట్టడానికి ఒక పురోహితుడిని మాత్రం అనుమతిస్తారని వినికిడి.
http://www.hindujagruti.org/news/1028.html

వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక పడినచోటు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతం. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన అమ్మవారు వైష్ణోదేవి. జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది.గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మూర్తిక్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ’చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

మంగళగౌరి
అమ్మవారి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఫల్గుణీనదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు.

విశాలాక్షి :
అమ్మవారి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: