Friday, May 20

వల్లిదేవి, సుబ్రహ్మణ్యస్వామి


తొండైనాడు దేశంలో "మేర్పట్టి" అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ పొలిమేర్లలో వల్లిమలై [ వల్లికొండలు ] ఉన్నాయి. ఆ గ్రామంలోనే నంబి అనే పుళిందుడు ఉండేవాడు. [ పుళిందులు అంటే వేటాడి జీవనం సాగించేవారు అని ]. ఆ నంబికి మగపిల్లలు ఉన్నరు, కాని ఆడపిల్ల అంటే అతనికి చాలా ఇష్టము. ఒకరోజు నంబి, అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూండగా వారు, ఓ శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూసారు. ఆడపిల్లలు లేనిలోటు ఆ దేవుడు ఈ రూపంలో తీర్చాడు అనుకొని, ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దాడి, తమ ఇంటికి తీసుకొని పోయారు. తమ జీవనాధారం ఐన వల్లికొండల మద్య దొరికింది కాబట్టి "వల్లి" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచసాగారు. భగవంతునిపై భక్తి, పెద్దలపట్ల గౌరవము, వినయ విధేయతలతో వల్లి పెరిగింది.

తల్లితండ్రుల మాటమేరకు జొన్నచేలల్లోకి వెళ్ళి పశు, పక్షాదులనుండి పంటను కాపాడుతూండేది. ఒకరోజు నారదుడు అటుగావెళ్తూ వల్లి ని చూసి, కుమారస్వామి కి తగిన వధువు అని తలచి, అక్కడే "తణికై" అనే ప్రదేశంలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి వల్లి ని గురించి చెప్పాడు. అంతట కుమారస్వామి వల్లి ని చేరి, తన స్వపరిచయం చేసుకొని పెళ్ళాడమని కోరాడు, ఇంతలో వల్లి తల్లితండ్రులు, అనుచరులు వస్తూండటం చూసి, ముసలి శివభక్తుని రూపంలో మారిపోయాడు. వచ్చినవారు ఆ శివభక్తుని రూపంలో ఉన్న కుమారస్వామి కి నమస్కరించి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఓ గజరాజు వల్లి పైన దాడిచేసింది, కుమారస్వామి ఆమెను రక్షించాడు. పర్వతీతనయుడు తన వాహనమైన నెమలి ఎక్కి, 12 హస్తాలను కలిగి ఉండి. సహస్ర సూర్యుల తేజస్సుతో శక్తి ఆయుధధారుడై, కుకుటధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యమును నిర్వహించునట్లు వల్లిదేవికి దర్శనం ఇచ్చాడు. ఆ దివ్యస్వరూపాన్ని చూసి, కుమరస్వామికి పాదాభివందనం చేసి పెళ్ళికి సుముఖం వ్యక్తంపరచింది.

పంటచేతికి రావడం తో, వల్లి తల్లితండ్రులతో కలిసి తిరిగి ఇంటికి చేరింది. ముభావంగా ఉన్న వల్లిని గమనించిన తల్లి, సోది చెప్పే "కురువంజి" ని పిలిపించి విషయం తెలుసుకొన్న వారు, కుమారస్వామిని కలిసి, ఆయన పుట్టుకలోని అంతరార్ధమును తెలుసుకొని, వల్లి ని సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి వివాహానికి అంగీకరించారు.
కొండజాతి ఆచారం ప్రకారం. వధూవరులను కూర్చోబెట్టి, వినాయకుడి సమక్షంలో, శివపార్వతుల ఆశీర్వాదంతో, దేవసేన అంగీకారంతో, దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా వల్లీ సుబ్రహ్మణ్యస్వామి ల వివాహం ఆనందదాయకంగా జరిగింది.

ఒక కొండజాతి పిల్లను చేసుకొన్నందుకు ఙ్ఞాపకార్ధంగా సుబ్రహ్మణ్యస్వామి కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని మాట ఇచ్చాడు. అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ క్షేత్రాలన్ని కొండలపైనే వెలసి ఉన్నాయి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: