Friday, May 6

వరాహావతారం


దశావతార సంప్రదాయంలో వరాహావతారం మూడోది. ఈ వరాహావతారానికి సంబంధించి ఒక పురాణగాధ ప్రచారంలో ఉంది. ఒకానొక సమయంలో సృష్టి చేయదలచిన బ్రహ్మ మానసికంగా మనువును సృష్టించి, సృష్టి సాగించాల్సిందిగా ఆదేశిస్తాడు. ఆ సమయంలో భూగోళం సమస్తం జలంతో మునిగి ఉండడంతో దానిపై సృష్టి ఏ విధంగా చేయాలని మనువు బ్రహ్మను అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ శ్రీమహావిష్ణువును ధ్యానిస్తాడు. నాసికా రంధ్రాల నుంచి యఙ్ఞ వరాహమూర్తి అంగుష్ట మాత్రా దేహంతో ఆవిర్భవించి క్షణాల్లో ఏనుగంత పెరిగాడు. బ్రహ్మ నిద్రావశుడై ఉన్న కాలంలో జలంలొ మునిగిన భూమిని ఉద్ధరించేందుకు రసతలానికి వెళ్తాడు. జలమధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురౌతాడు. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. హిరణ్యాక్షుడు మాయా చక్రాన్ని ప్రయోగించగా, శ్రీహరి తన చక్రంతో ఆ మాయా చక్రాన్ని అడ్డుకొంటాడు. చివరకు వరాహమూర్తి ఆ రాక్షసుడిని కర్ణమూలాన్ని తన కోరలతో చేధించగా హిరణ్యాక్షుడు నెత్తురుకక్కుకొని మరణిస్తాడు. భూమిని ఉద్దరించాక వరాహానికి వైకుంఠం నుంచి భూలోకంలో అవతరించిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల కొండలలో చోటు చూపించాడని వరాహ, బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నాయి.
పరమాత్ముడైన విష్ణుమూర్తి యఙ్ఞరూప ధరుడైన వరాహంగా తెల్లని దేహంతో అవతరించిన కల్పం కనుక శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. సకల సంపదలకు యఙ్ఞం అలవాలం గనుక పరమపురుషుడు యఙ్ఞమూర్తిగా అవతరించాడు. చైత్ర బహుళ త్రయోదశి నాడు యఙ్ఞవరాహావతార ఆవిర్భావం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: