Wednesday, May 4

మత్స్యావతారము

మత్స్యావతారము దశావతారములలో ప్రప్రథమ స్థానములో ఉన్నది. లోమ హర్షణుడు గొప్ప ఋషి. నైమిశారణ్యములో అగస్త్య మునికి “మత్స్య పురాణము”ను వివరించెను. 291 అధ్యాయములలో -14 వేల శ్లోకములు గా లోమహర్షణ వాక్కులు సంకలనముగా ఏర్పడినది. మత్స్య పురాణము ను “తామసిక పురాణము”గా పరిగ్రహింపబడుచున్నది. సత్య వ్రతుడు ప్రజా క్షేమము కొరకు పాటుపడే భక్తాగ్రగణ్యుడైన చక్రవర్తి. ఇతడే “వైవశ్వత మనువు”గా ప్రసిద్ధిగాంచెను.

అగ్ని పురాణములో ఈ గాథ ఉన్నది. కృతమాలా నదిలో స్నానము చేసి, సంధ్య వార్చునప్పుడు, సత్యవ్రతుని కమండలమునందు ఒక చిన్న చేప చేరినది. రాజు దానిని తిరిగి నదిలో విడువబోయాడు. కానీ ఆ మీనము “రాజా!నన్ను పెద్ద మత్స్యములు వెంటాడుచున్నవి. వాని నుండి నాకు రక్షణ అవసరము“ అనెను. ప్రభువు జాలి పడి “అట్లే!” అని దానిని భవనమునకు తెచ్చెను. చిత్రంగా అది ఒక్క రాత్రిలో ఎంతో పెరిగినది. అ చేపను పెద్ద గంగాళములోనికి మార్చ వలసి వచ్చినది.రోజు రోజుకూ అలాగ అది అపరిమితముగా వృద్ధి చెందుచునే ఉన్నది. తత్ఫలితముగా అద్దానిని, మడుగు , సరస్సు , చెరువు,కొట్ట కొసకు మహా సముద్రములోనికి మార్చుతూ, చేర్చారు.

“ఇది మామూలు ఝషము కాదు. కేవలము భగవానును అపర అవతారమే!” అని గ్రహించిన మహారాజు సత్యవ్రతుడు, అంజలి ఘటించి,అడిగాడు.”నేను మీ అవతార రహస్యమును తెలుసుకొనలేకున్న అజ్ఞానిని. మీ అవతార హేతువులను, లీలా విశేషములను బోధపరచ కోరుచున్నాను”

ఆ మీనము అన్నది “ నేటి నుండి ఏడవ దినమున ( సప్తమ = 7 )సృష్టి యావత్తు నాశనము అవబోతున్నది. అందు చేత ముందు జాగ్రత్త అక్కర కలిగినది. సృష్టి రక్షణ బాధ్యతా భారమును నీ భుజ స్కంధముల పైన వహింపవలయును.
తరు సంపద నిమిత్తము ముఖ్యమైన విత్తనములను, ప్రాణి కోటి యొక్క పునఃసృష్టి ఆరంభము కొఱకు జంతువులను సేకరించి, భద్రపరచుము.” ఆ ఆదేశములను శిరసావహించాడు సత్యవ్రతుడు.

ప్రకృతి విలయము సంభవించినది.ఆ బృహత్ మీనావతారము, తన వీపున ఒక పెద్ద నావను మోసుకొని వచ్చినది.అందులో సప్తర్షులు, సృష్టి కర్త ఐన బ్రహ్మ ,మున్నే తాను సేకరించిన బీజాది అనేక వస్తు సముదాయములతో రాజు అధిరోహించెను.

చేప కొమ్ముకు (చేప మొప్ప/ రెక్క)ఒక సర్పముతో పడవను కట్టాడు. వైవస్వంతుని పుత్రుడు సత్యవ్రతుడు ప్రళయ పయోధి జలముల నుండి సృష్టిని కాపాడి,నిలిపెను. సృష్ట్యాది నుండి అసంఖ్యాక మన్వంతర యుగములు గడచినవి. ఈనాడు మనము “వైవస్వంత మన్వంతర కాలము”లో ఉన్నాము. మహాభారతము లో అర్జునుడు భేదించిన “మత్స్య యంత్రము” సుప్రసిద్ధమైనదే కదా!

0 వినదగు నెవ్వరు చెప్పిన..: